లేటెస్ట్

'ఎల్వీ'పై వేటెందుకు పడింది...!?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'లంకా వెంకటసుబ్రహ్మణ్యం'ను బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తన కింద పనిచేసే అధికారే బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మరింత పెను సంచలనం. గత కొంత కాలంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంకు, సిఎం జగన్‌ కార్యదర్శి 'ప్రవీణ్‌ప్రకాష్‌'కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. సిఎస్‌ పోస్టులో ఉన్న తనను గుర్తించకుండా  ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ స్థాయిలో ఉన్న 'ప్రవీణ్‌' ప్రభుత్వ కార్యకలాపాలు నడిపించడం 'సిఎస్‌'కు నచ్చడం లేదు. ప్రభుత్వ పాలనా వ్యవహారాలు సరిగా జరగడం లేదా.. రూల్స్‌ ప్రకారం ఫైళ్లు వెళ్లడం లేదని, దీనికి 'ప్రవీణ్‌ప్రకాష్‌' సంజాయిషీ ఇవ్వాలని మొన్న 'ఎల్‌వి' 'ప్రవీణ్‌ప్రకాష్‌'కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. 15 రోజుల్లో దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున్న పత్రికల్లో ప్రచారం జరిగింది. దీనిపై ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. ఇద్దరు సీనియర్‌ అధికారులు గొడవపడి ప్రభుత్వ పరువు తీస్తున్నారని, వీరిలో ఎవరో ఒకరిపై వేటు పడుతుందని సచివాలయ వర్గాలు, సీనియర్‌ ఐఎఎస్‌లు, సీనియర్‌ జర్నలిస్టులు అంచనా వేశారు. వారు అంచనా వేసినట్లే...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై బదిలీ వేటు ప డింది. ఎల్‌.వి.సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ 'ప్రవీణ్‌' ఈ రోజు ఉత్తర్వులు ఇవ్వడం..అదీ ఏ మాత్రం ప్రాధాన్యత లేని హెచ్‌ఆర్‌డి జనరల్‌ సెక్రటరీగా నియమించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికార,రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది.

'ఎల్వీ'కి ఇలా చెక్‌ పెట్టారు...!

గత కొన్ని రోజులుగా జిఎడి పొలిటికల్‌ సెక్రటరీ 'ప్రవీణ్‌ప్రకాష్‌'కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం'కు మధ్య తలెత్తిన విభేదాలను సరిదిద్దడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించలేదు.  'సిఎస్‌'ను ఖాతరు చేయకుండా 'ప్రవీణ్‌' వ్యవహరిస్తున్నారంటే ఆయనకు ఎంత అండ ఉందో తెలుసుకోవడంలో 'ఎల్వీ' విఫలమైనట్లు ఉంది. తనపై 'ప్రవీణ్‌'ను వదిలిందెవరో ఆయన తెలుసుకోలేకపోయారా..? లేక తెలుసుకున్నా...? జరిగాల్సింది జరుగుతుందన్న భావనతో ఉన్నారో తెలియదు కానీ...ఆకస్మాత్తుగా 'ప్రవీణ్‌'కు షోకాజ్‌ నోటీసు ఇచ్చి యుధ్ధంలో ఆఖరి ఎత్తు వేశారు. ఈ ఎత్తు వేసినప్పుడు 'ఎల్వీ' తన పదవికి ముప్పురాదని, మహా అయితే ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరి మధ్యకి రాజీ చేస్తారని భావించారేమో..? కానీ..షోకాజు అంశం పత్రికల్లో, సోషల్‌మీడియాలో ప్రచారం కావడం, అధికారపార్టీ, మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి 'ఎల్వీ' విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. ముఖ్యమంత్రి మనోగతాన్ని పసిగట్టిన 'ప్రవీణ్‌' వేగంగా పావులు కదిపి 'ఎల్వీ'కి చెక్‌ పెట్టారు. 

కోరితెచ్చుకున్న'ఎల్వీ'పై అసంతృప్తి ఎందుకు...?

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 'అనిల్‌చంద్రపునీతా'ను ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంతో ఆయన స్థానంలో 'ఎల్వీ' సిఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 'సిఎస్‌'గా బాధ్యతలు చేపట్టిన 'ఎల్వీ' అప్పటి ముఖ్యమంత్రి 'చంద్రబాబునాయుడు'ను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. దీనిపై అప్పట్లో 'సిఎం' వర్సెస్‌ 'సిఎస్‌'గా యుద్ధంనడిచింది. అయితే ఎన్నికల్లో టిడిపి గెలిచి ఉంటే 'ఎల్వీ'కి అప్పుడే చెక్‌ పెట్టేవారనే మాట అప్పట్లో వినిపించేది. కానీ 'జగన్‌' గెలవడంతో..'ఎల్‌వి' సిఎస్‌గా కొనసాగగలిగారు.మొదట్లో 'జగన్‌' 'ఎల్వీ' ఇతర సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు ఇచ్చిన గౌరవం చూసి వీరంతా పొంగిపోయారు. అయితే ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో 'ఎల్వీ' తన మాట వినడం లేదనే భావన 'సిఎం'కు రావడంతో ఆయన ప్రాధాన్యతను తగ్గించుకుంటూ పోయారు. ఏదో ఒక సమావేశంలో సిఎస్‌గా తన అభిప్రాయం 'ఎల్వీ' చెప్పబోయే 'సిఎం' పట్టించుకోలేదని, ఆయన మాటలనువినలేదని 'ఎల్వీ' తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడ్డారని ప్రచారం జరిగింది. అయితే తరువాత కాలంలో 'ఎల్వీ' కొంత తగ్గి సిఎం అడిగినప్పుడు మాత్రమే పాలనా వ్యవహారాల్లో తన అభిప్రాయాలు చెప్పారంటారు. ఇది ఇలా ఉంటే ఢిల్లీలో రెసిడెంట్‌ కమీషనర్‌గా ఉన్న 'ప్రవీణ్‌' సిఎంఒలో చేరడంతో 'ఎల్వీ' కష్టాలురెట్టింపు అయ్యాయి. ఈలోపు తిరుమల తిరుపతి దేవస్థానంలో 'అన్యమతస్థుల' వివాదం 'ఎల్వీ'కి సిఎంకు మధ్య మరింత దూరం పెంచిందని ప్రచారం జరిగింది. అంతే కాకుండా సిఎం అనుకున్న విధంగా 'ఎల్వీ' సహకరించలేదని, అదే సమయంలో కేంద్ర పాలకులకు ఒత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఇటీవల సిఎం 'ఢిల్లీ' పర్యటన సందర్భంగా కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తోన్న ఇద్దరు అధికారులు ఆయనను కలసి తమను రాష్ట్ర సర్వీసుల్లోకి తీసుకోవాలని కోరారని, దానికి 'సిఎం' అంగీకరించారని ప్రచారం జరగడంతో..ఇక తనను 'సిఎస్‌'గా కొనసాగించరనే ఆలోచనలో 'ఎల్వీ'నే ముందడుగువేశారని, 'ప్రవీణ్‌'కు షోకాజ్‌ నోటీసు ఇవ్వడంతోనే 'ఎల్వీ'ని బదిలీ చేశారంటున్నారు. మొత్తం మీద..కోరితెచ్చుకున్న 'ఎల్వీ'ని సాగనంపడంతో..ఇప్పుడు సిఎంఒలో కోరి తెచ్చుకున్న మరి కొంత అధికారులు వణికిపోతున్నారు. ఈ రోజు 'ఎల్వీ' రేపు ఎవరో..? అనే ఆందోళన వారిలో నెలకొంది. 

(672)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ