లేటెస్ట్

నూతన 'సిఎస్‌' ఎవరు...!?

ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'ఎల్‌.వి'ని ఆకస్మికంగా బదిలీ చేయడంతో ఆయన స్థానంలో ఎవరు 'సిఎస్‌' అవుతారనే ఉత్సుకత అధికారవర్గాల్లో వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం సిసిఎల్‌గా ఉన్న 'నీరబ్‌కుమార్‌' తాత్కాలిక సిఎస్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయి సిఎస్‌గా ఎవరికి 'జగన్‌' అవకాశం ఇస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. సీనియార్టీ ప్రకారం చూస్తే....'ఎల్‌వి' తరువాత స్థానంలో 'ప్రీతిసూడాన్‌' ఉన్నారు. ఆమె కేంద్ర కుటుంబ&ఆరోగ్యశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె తరువాత 'నీలం సహానీ,'ఎ.పి.సహానీ, సమీర్‌శర్మ, సుబ్రహ్మణ్యం,డి.సాంబశివరావు, అభయ్‌త్రిపాఠీ, 'సతీష్‌చంద్ర,లు ఉన్నారు. వీరిలో 'నీలంసహానీ, ఎ.పి.సహానీ, సమీర్‌శర్మ, సుబ్రహ్మణ్యం, అభయ్‌త్రిపాఠి'లు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. వీరు రాష్ట్రానికి వస్తారా..? వీరిలో 'నీలంసహానీ, సమీర్‌శర్మ'లు రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపారని సమాచారం. సోమవారం నాడు 'నీలంసహానీ' ముఖ్యమంత్రి 'జగన్‌' నివాసంలో ఆయనను కలసి ఆయనతో లంచ్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు 'సమీర్‌శర్మ' ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలసిశారని, రాష్ట్రంలో పనిచేసేందుకు ఆసక్తి చూపారని తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరు సిఎస్‌ అవుతారని సచివాలయవర్గాలు చెప్పుకుంటున్నాయి. 

రాష్ట్ర సర్వీసులో ఉన్న అధికారుల్లో సీనియర్లు అయిన 'డి.సాంబశివరావు, సతీష్‌చంద్ర'లకు 'సిఎస్‌' అయ్యే అవకాశం కనిపించడం లేదు. నిజాయితీ, కష్టపడిపనిచేసే అధికారులుగా వీరికి పేరున్నా...వారి పేర్లను 'జగన్‌' పరిశీలించరంటున్నారు. 'డి.సాంబశివరావు' నిజాయితీపరుడైన, కష్టపడి పనిచేసే అధికారి అయినా ఆయన సామాజికవర్గం ఆయనకు అడ్డంకి కానుంది. అదీ కాకుండా ఆయన వచ్చే ఏప్రిల్‌ నాటికి రిటైర్‌ అవుతారు. మరో సీనియర్‌ అధికారి 'సతీష్‌చంద్ర' టిడిపికి అనుకూలురనే ప్రచారంతో 'జగన్‌' ప్రభుత్వం నిన్నటి దాకా ఆయనకు పోస్టింగే ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన పేరును 'సిఎస్‌' పోస్టుకు పరిశీలిస్తారని భావించలేం. వీరు కాకుండా 'జె.ఎస్‌.ప్రసాద్‌, ఆదిత్యనాథ్‌దాస్‌'లు కూడా సీనియర్లే. వీరి పేర్లు పరిశీలించే అవకాశాలు లేవు. మొత్తం మీద చూస్తే...ఢిల్లీలో పనిచేస్తోన్న ఆంధ్రా క్యాడర్‌ అధికారుల్లో ఎవరో ఒకరికి ప్రధాన కార్యదర్శి పోస్టు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

(433)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ