లేటెస్ట్

కేంద్ర సర్వీసులకు 'ఎల్‌వి'...!

అత్యంత అవమానకరమైన రీతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి పోగొట్టుకున్న 'ఎల్వీ సుబ్రహ్మణ్యా'న్ని కేంద్రం అక్కున చేర్చుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. ఆయనను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుని కీలకమైన సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌(సివిసి) బాధ్యతలు అప్పగించబోతున్నారని సమాచారం వస్తోంది. దీనిపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినా...మంగళవారం సాయంత్రం నుంచి సచివాలయ, సోషల్‌మీడియా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా 'సిఎస్‌' పోస్టు నుంచి 'ఎల్‌వి'ని తప్పించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఇంటిలిజెన్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించుకుంటోందని, 'ఎల్‌వి'పై ఎటువంటి ఆరోపణలు, విమర్శలు లేకపోయినా...అంత అవమానకరంగా తొలగించడంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్లు తెలుస్తోంది. 'సిఎస్‌'గా ఎవరిని పెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి విచక్షణ మీద తీసుకునే నిర్ణయమైనా...ఒక సీనియర్‌ అధికారిపట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని, ఇష్టం లేకపోతే అదే విషయం చెప్పి తొలగించాల్సిందని, అలా కాకుండా అవమానించి వెళ్లగొట్టారనే అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇంటిలిజెన్స్‌ ద్వారా, రాష్ట్ర బిజెపి నాయకుల ద్వారా తెలుసుకుంటున్న కేంద్ర పెద్దలు 'ఎల్‌వి'కి భరోసా ఇచ్చారని చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర పెద్దల ఆశీస్సులతో 'సిఎస్‌'గా ఎంపికైన 'ఎల్‌వి' తన పనితీరుతో వారిని ఆకట్టుకున్నారు. తాము నియమించిన 'సిఎస్‌'ను ఎటువంటి కారణాలు లేకుండా తొలగించడంతో...అసలు రాష్ట్రంలో ఏమి జరుగుతుందన్న దానిపై ఒక నివేదిక ఇవ్వాలని బిజెపి పెద్దలు రాష్ట్ర నాయకులను అడిగినట్లు సమాచారం. 'సిఎం, సిఎస్‌'ల మధ్య విభేదాలకు కారణం ఏమిటి..? 'ఎల్‌వి'పై వచ్చిన ఒత్తిడిలు ఏమిటనేదానిపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా తనను అవమానకరంగా తొలగించినా..'ఎల్‌వి' రాష్ట్ర పాలకులతో సర్థుకుపోయేందుకే నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. మొదట్లో దీనిపై ఆయన క్యాట్‌కు వెళ్లాలని భావించినా.. తరువాత ఎందుకో వద్దునుకున్నారని, బిజెపి పెద్దలు హామీ లభించడంతో...ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లి తన సర్వీసును పూర్తి చేసుకోవాలనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 'ఎల్‌వి'ని అత్యంత అవమానకరంగా ఇక్కడ నుంచి పంపించిన కొంత మంది ఐఎఎస్‌లు 'ఎల్‌వి' కేంద్ర విజిలెన్స్‌లోకి వెళుతున్నారనే వార్తలు రావడంతో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆయన కేంద్ర సర్వీసులకు వెళితే రాష్ట్రంలో ఏమి జరిగిందో మొత్తం పూసగుచ్చినట్లు కేంద్ర పెద్దలకు చెబుతారని దానితో ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు ఆరు నెలలు కూడా సర్వీసు లేని 'ఎల్‌వి'ని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటారా..? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న ఐఎఎస్‌లకు గతంలో కేంద్ర సర్వీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి చూద్దాం..ఏమి జరుగుతుందో..?

(450)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ