లేటెస్ట్

ఇద్దరు ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారు...మిగిలిన వారి సంగతేమిటో...!

గత ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి...వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి ఎమ్మెల్యేల్లో దాదాపు ముప్పావు వంతు మంది పార్టీ మారతారని మొదటి రోజు నుంచే ప్రచారం ప్రారంభమయింది. గెలిచిన 23 మందిలో నలుగురైదుగురు తప్ప అంతా పార్టీ మారతారని, బిజెపిలోకి కొందరు వెళతారని, మరి కొందరు వైకాపాలోకి వెళ్లి ఉప ఎన్నికలు ఎదుర్కొంటారని సామాజిక మాధ్యమాల్లోనూ, పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. అయితే గత ఐదు నెలల నుంచి వారు చేస్తోన్న ప్రచారం నిజం కాలేదు కానీ...ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారడం ఖాయమైపోయింది. పార్టీ మార్పుపై వారే స్పష్టత ఇచ్చారు. ముందుగా కృష్ణా జిల్లా 'గన్నవరం' ఎమ్మెల్యే 'వల్లభనేని వంశీమోహన్‌' విషయాన్ని తీసుకుంటే ఆయన ఎన్నికలకు ముందే పార్టీ మారాలనే ఆలోచన చేశారు. కానీ చివరి నిమిషంలో పార్టీ నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఇక అప్పటి నుంచి ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ..ఆయన ఇటీవల సిఎం జగన్మోహన్‌రెడ్డిని కలిసి వచ్చారు. దీంతో..ఆయన పార్టీ మారినట్లేనని అందరూ భావించారు. అయితే ఇటీవల కాలంలో దానిపై ఎటువంటి వార్తలు రాకపోవడంతో..ఆయన పార్టీ మార్పు అనేది ప్రస్తుతానికి ఆగిపోయిందనుకున్నారు. కానీ నిన్న 'వంశీ'నే స్వయంగా దీనిపై స్పష్టత ఇచ్చారు. తాను వైకాపాలో చేరుతున్నానని, అదిఎప్పుడనేది చెప్పలేనని, పార్టీ నాయకుల నుంచి తనకు ఆశించిన సహకారం అందలేదని, అధికార పార్టీ వేధింపులకు గురిచేస్తుంటే, జిల్లా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో ఆయన పార్టీని వీడినట్లే. 

ఇక మరో ఎమ్మెల్యే 'గంటా శ్రీనివాసరావు' ఆయన మొదటి నుంచి అధికార పార్టీలో ఉండానికే ఇష్టపడతారు. ఆ రకంగా చూసుకుంటే ఆయన ఏ రోజైనా పార్టీ మారతారు. ఆయన వైకాపాలోకి వెళతారని మొదట భావించినా...బిజెపితో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీల్లో బిజెపి ప్రధాన కార్యదర్శి 'రామ్‌మాధవ్‌'ను కలసి వచ్చారు. దీంతో..ఇక రేపో..మాపో ఆయన బిజెపిలోకి వెళ్లడం ఖాయమైంది. కాగా ఇప్పటికి ఇద్దరు  ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారని, మిగతా వారు ఇంకా స్పష్టత ఇవ్వకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. వీరు కాకుండా ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, రాయలసీమకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఇదే దారిలో ఉన్నారంటున్నారు. చూద్దాం..మరి వారు కూడా బయటకు వస్తారేమో...? 

(806)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ