లేటెస్ట్

'కన్నా'ను 'సిఎం రమేష్‌' ఆహ్వానించలేదట...!?

బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌ తన కుమారుడి వివాహ  అత్యంత విలాసవంతమైన 'దుబాయ్‌'లో అంగరంగ వైభోగంగా నిర్వహించారని తెలుస్తోంది.  ఈ నిశ్చితార్ధానికి మహామహులైన వారి కోసం ప్రత్యేకంగా విమానాలను ఏర్పాటు చేసి, ఇక్కడ నుంచి దుబాయ్‌కి తరలించారట. దీనికి వైకాపా,టిడిపి, బిజెపి, ఢిల్లీ స్థాయిలో పెద్ద నాయకులను ఆహ్వానించిన 'సిఎంరమేష్‌' తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 'కన్నా లక్ష్మీనారాయణ'ను ఆహ్వానించలేదట. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఈ వివాహ నిశ్చితార్థం బిజెపి వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న 'కన్నా'ను ఆహ్వానించకుండా, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడైన 'విష్ణువర్థన్‌రెడ్డి'ని 'సిఎం రమేష్‌' ఆహ్వానించారట. తనను ఆహ్వానించలేదని 'కన్నా' స్వయంగా చెప్పుకుంటున్నారు. తనకు పెళ్లి కూతురు తరుపున ఆహ్వానం అందిందని, అయినా తాను ఇతర కార్యక్రమాల వల్ల దానికి వెళ్లలేదని ఆయన చెప్పారు. ఇటీవలే టిడిపి నుంచి బిజెపిలో చేరిన 'సిఎం రమేష్‌' స్వంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమే. కాగా..ఈ వివాహ నిశ్చితార్థం అధికార వైకాపాలోనూ చర్చనీయాంశమైంది. 

ఈ నిశ్చితార్ధానికి సుమారు 12 మంది వైకాపా ఎంపీలు దుబాయ్‌ వెళ్లారని ప్రచారం జరుగుతుండగా, వైకాపా మాత్రం ప్రతిపక్ష టిడిపిని టార్గెట్‌ చేసింది. సిఎం రమేష్‌ ఇంటిలో జరుగుతున్న నిశ్చితార్థ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 'నారా లోకేష్‌' వెళ్లారని, దీనితో 'సిఎం రమేష్‌'కు 'చంద్రబాబు'కు మధ్య ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ప్రచారం చేసింది. దీనిపై 'నారా లోకేష్‌' స్పందిస్తూ..వైకాపా పేటిఎం బ్యాచ్‌ ఇంకా తనపై విషప్రచారం చేస్తోందని, తాను విజయవాడలో ఉన్నా..'దుబాయ్‌' వెళ్లానని ప్రచారం చేస్తోందని, పేటిఎం బ్యాచ్‌ సొమ్ములు ఇస్తే..ఎంతటి నీచ ప్రచారానికైనా దిగజారతారని ట్వీట్‌ చేశారు. టిడిపిలో ఉన్నప్పుడు 'చంద్రబాబు'కు అతి సన్నిహితుడిగా ప్రచారం పొందిన 'సిఎం రమేష్‌'పై ఎన్నికలకు ముందు ఇన్‌కమ్‌ట్యాక్స్‌ దాడులు జరిగాయి. ఎన్నికల తరువాత ఆయన బిజెపిలోకి చేరడంతో ఆయనపై దాడులు ఆగిపోయాయి. రాయలసీమ ప్రాంతంలో వివిధ కాంట్రాక్టులు చేసే సిఎం రమేష్‌ టిడిపి హయాంలో బాగా లబ్దిపొందారని, ఆ సొమ్ములతోనే ఇప్పుడు తన కుమారుడి నిశ్చితార్ధం ఇంత ఘనంగా జరుపుతున్నారని ఆయన వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో గత వారం రోజుల నుంచి 'సిఎం రమేష్‌' కుమారుడి వివాహనిశ్చితార్ధం చర్చనీయాంశమైంది. గతంలో 'గాలి జనార్థన్‌రెడ్డి' తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశారని, ఇప్పుడు 'సిఎం రమేష్‌' అంతకంటే ఎక్కువగా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కడప జిల్లాలో ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కుటుంబాన్ని ఆర్థికపరంగా 'సిఎం రమేష్‌' అధిగమించారని ఆ జిల్లాకు చెందిన బిజెపి,టిడిపి,వైకాపా నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కుమారుడి వివాహనిశ్చితార్థం సందర్భంగా తన సంపదను 'రమేష్‌' తానెంత స్థితిమంతుడినో రుజువు చేసుకుంటున్నారని వారు అంటున్నారు. 

(588)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ