'పశ్చిమ' 'ప్రకాశం'లో వైకాపా ముందంజ....! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పశ్చిమ' 'ప్రకాశం'లో వైకాపా ముందంజ....!

ఎన్నికలకు సమీపిస్తున్న కొద్ది...ప్రజల మనోగతం మెల్ల మెల్లగా బయటపడిపోతోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వెల్లడవుతున్న ప్రజాభిప్రాయం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కిస్తున్నాయి. అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపాలు ఇక్కడ ఆధిపత్యం కోసం హోరాహోరి తలపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార టిడిపి కన్నా మంచి ఫలితాలు సాధించిన వైకాపా..ఇప్పుడు అటువంటి ఫలితాలను మళ్లీ సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. వారి ప్రయత్నాలకు ప్రజల నుంచి కూడా సహకారం లభిస్తున్నట్లు..ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తోంది. జిల్లాలో 'పశ్చిమ' ప్రాంతంలో..ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని.. అధికార టిడిపికి ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందన్న అభిప్రాయం సర్వాత్రా వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా...అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలపై మాత్రం ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో...ప్రజల అసంతృప్తి తగ్గించడానికి..అధికారపార్టీ పలు ప్రయత్నాలు చేస్తోంది. అయితే..అవి ఎంత వరకు ఫలితాలను ఇస్తాయో..ప్రస్తుతం చెప్పలేకపోయినా...జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు,కందుకూరు,కనిగిరి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగా లేదని...టిడిపి నాయకులే చెబుతున్నారు.

  మార్కాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైకాపా తరుపున 'జంకే వెంకటరెడ్డి' గెలుపొందారు. జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా..ఆయన మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని ఉండడంతో..వైకాపా వర్గానికి చెందిన వారు ఆయనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ఓటు బ్యాంక్‌గా పరిగణించే ఈ వర్గాలు..మళ్లీఆయనే అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటుండంతో..ఇక్కడ టిడిపి గెలవడం కష్టమైన పనే. ఇక యర్రగొండపాలెంలో 'డేవిడ్‌రాజు' గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలుపొందారు. అయితే ఆయన తరువాత టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో కూడా..ఆయన పనితీరు బాగాలేదని తేల్చారు. దీంతో..ఇక్కడ..పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మరో నియోజకవర్గమైన 'గిద్దలూరు'లో గత ఎన్నికల్లో వైకాపానే గెలుపొందింది. అయితే ఇక్కడ గెలిచిన 'అశోక్‌రెడ్డి' తరువాత టిడిపిలో చేరారు. ఆయన పనితీరు కూడా బాగాలేదని సిఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. టిడిపి తరుపున పోటీ చేసిన అన్నే రాంబాబు పార్టీని వీడిపోవడం పార్టీని బలహీనపర్చింది. కందుకూరు నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి రోజు రోజుకు బలహీనపడుతుందని పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  గతంలో వైకాపా నుంచి గెలిచి టిడిపిలో చేరిన 'పోతుల రామారావు'పై ఓటర్లకు సదాభిప్రాయం లేకపోవడం, కాంగ్రెస్‌లో ఉన్న మాజీ మంత్రి మహిధర్‌రెడ్డి వైకాపాలో చేరడం..ఆ పార్టీకి కలసి వస్తుందని, ఇక్కడ మళ్లీ వైకాపానే గెలుస్తుందని ఎక్కువ మంది చెబుతున్నారు. కనిగిరిలో పరిస్థితి కొంచెం అటూ ఇటుగా ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన 'కదిరి బాబూరావు' కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఆయన వైఖరి వల్ల..ఇక్కడ పార్టీ బలహీనమవుతుందని...అంటున్నారు. మొత్తం మీద..పైన చెప్పిన ఐదు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని, దీన్ని ఇప్పటికైనా సరిదిద్దాల్సిన అవసరం ఉందని..పార్టీ సీనియర్‌ నాయకులు, జిల్లా కార్యకర్తలు, సానుభూతిపరులు చెబుతున్నారు. ఇవి కాకుండా, దర్శి, సంతనూతలపాడు, కొండపి, చీరాలల్లో కూడా పార్టీ పరిస్థితి బాగా లేదని అంటున్నారు. అయితే...ఇక్కడ కొంత వరకు సరిదిద్ద వచ్చని...అధినేత దృష్టిపెడితే...స్వల్ప మెజార్టీతోనైనా..టిడిపి గెలవగలదని..వారు చెబుతున్నారు. ఒంగోలు, అద్దంకి, పర్చూరుల్లో పార్టీ పరిస్థితి బాగానే ఉందని...ఇక్కడ సునాయాసంగా గెలవగలమని చెబుతున్నారు. మొత్తం మీద..గత ఎన్నికల వలే...ఇప్పుడూ పరిస్థితి ఉందంటున్నారు. చెరి సగం వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

(1698)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ