WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాష్ట్రంలో సోషల్‌మీడియా వార్‌...!

ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయపార్టీలు అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన వెంటనే టిడిపి అధినేత 'చంద్రబాబునాయుడు' విజయవాడలో నిర్వహించిన సభతోనే ఎన్నికల ప్రచారానికి శంఖారావం ఊదారు. అంతకు ముందే..వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రచారానికి తెరతీశారు. మరో వైపు 'జనసేన' అధినేత కూడా అక్కడక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక కాంగ్రెస్‌, బిజెపి, కమ్యూనిస్టులు, ఇతర చిన్న పార్టీలు కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యాయి. సాధారణ ప్రచారం కన్నా..సోషల్‌ మీడియాలో ప్రచారానికి అన్ని పార్టీలు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇప్పటికే వైకాపా తన సోషల్‌మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ పార్టీకి ఊపు తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ ఐటి వింగ్‌, సోషల్‌మీడియా వింగ్‌ ద్వారా కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ ప్రచారం నిర్వహిస్తోంది. కొన్ని వేల మందిని నెలకు ఇంత చొప్పున ఇస్తూ..వారి పార్టీ తరుపున ప్రచారాన్ని చేయిస్తోంది. ఆ పార్టీ సలహాదారు 'పికె' ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయనకు ఉన్న అనుభవాన్ని రంగరిస్తూ...సోషల్‌మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. లక్షల ఫేక్‌ అకౌంట్లను క్రియేట్‌ చేస్తూ..ఆ పార్టీ అధికారపార్టీపై దుమ్మెత్తి పోస్తోంది. ప్రపంచంలో ఏమి జరిగినా...'చంద్రబాబు' వైఫల్యంవల్లే అన్నట్లు..ప్రచారాన్ని నిర్వహిస్తూ..తటస్తులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న సంఘటన జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అధికారపక్షం వైఫల్యం వల్లే ఇది జరిగిందని చెబుతోంది. ఏదో దేశంలో రోడ్లు బాగా లేకపోతే...అవి ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్లు అన్నట్లు ఇవి 'చంద్రబాబు' పాలనలో రోడ్ల స్థితి అంటూ ట్వీట్లు, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తోంది. ఇవి కాకుండా కొన్ని పెయిడ్‌ వెబ్‌సైట్లల్లో 'జగన్‌' గెలవబోతున్నారని, ఆ పార్టీకి అన్ని సీట్లు వస్తున్నాయి..ఇన్ని వస్తున్నాయి..అంటూ ప్రచారం చేపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో 'జగన్‌' పార్టీకి 140సీట్లు రాబోతున్నాయని, ప్రజలు టిడిపిపై అసంతృప్తితో ఉన్నాయని రాయిస్తోంది. దీంతో సగటు ప్రజలు, తటస్తులు..'జగన్‌' పార్టీకి ఊపు వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవబోతుందనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది.

ఇది ఇలా ఉంటే..'పవన్‌కళ్యాణ్‌' కూడా తన పార్టీ తరుపున 'శతఘ్ని' అంటూ సోషల్‌మీడియా విభాగం ఏర్పాటు చేసుకుని..అధికార పార్టీపై విమర్శలు కురిపిస్తోంది. సోషల్‌మీడియా ఏర్పాటుకు ఇప్పటికే 'పవన్‌' పార్టీ హైదరాబాద్‌లో భారీ భవనాన్ని అద్దెకు తీసుకుని, ఏర్పాట్లు చేసుకుంది. దీని పర్యవేక్షణను సీనియర్‌ నేతకు అప్పగించింది. బిజెపి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సోషల్‌మీడియా విభాగం ఆంధ్రప్రదేశ్‌ విషయాలపై ప్రత్యేకంగా స్పందిస్తోంది. కేంద్రంలో అవిశ్వాసంతో తమను ఇబ్బంది పెట్టిన టిడిపిపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారించి..తెలుగులో ఉన్న విషయాలను హిందీలోకి అనువధించి జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవినీతికి మారుపేరుగా మారిందని ప్రచారం చేస్తోంది. తాము నిధులు ఇస్తే..అవి రాష్ట్రానికి చెందిన నిధులంటూ..ప్రచారం చేసుకుంటున్నారని, మోడీ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇచ్చారని..వాటిని కూడా టిడిపి తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటుందని సోషల్‌మీడియా ద్వారా ఆ పార్టీ నిందిస్తోంది.

కాగా..ఇన్ని రకాల ప్రత్యర్థులు తనపై దాడి చేస్తోన్నా..అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పటి వరకు నామ మాత్రంగానే స్పందిస్తూ వస్తోంది. ఆ పార్టీకి చెందిన అభిమానులు, కార్యకర్తలు వ్యక్తిగతంగా మాత్రమే ప్రత్యర్థులకు కౌంటర్‌ ఇస్తూ వస్తున్నారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్‌మీడియాలో దూకుడు వ్యవహరించింది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత దూకుడు తగ్గించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష వైకాపా, జనసేనలు అభ్యంతరకరంగా ప్రచారం చేస్తున్నా..పార్టీ నామమాత్రంగానే స్పందిస్తోంది. ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని తెలిసినా...పార్టీ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. తీరా..ఇప్పుడు మేల్కొని..ప్రతిపక్ష పార్టీలు చేస్తోన్న ప్రచారాన్ని అడ్డుకోవాలని తీర్మానించి...దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారట. ఇప్పుడు టిడిపి కూడా ప్రత్యేకంగా సోషల్‌మీడియా వింగ్‌ను నియమించి ప్రత్యర్థులు చేస్తోన్న విషప్రచారానికి కౌంటర్‌ ఇస్తోంది. ఇన్నాళ్లూ ప్రతిపక్షం ఏమి ప్రచారం చేసినా..తాము అసలైన సమయంలో రంగంలోకి దిగుతున్నామని, దీంతో తమకు లాభం ఉంటుందని ఆ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారట. మొత్తం మీద...టిడిపి కూడా అధికారికంగా సోషల్‌మీడియా ప్రచారంలోకి దిగడంతో..ఇక సోషల్‌ మీడియా వార్‌ హోరెత్తనుంది. మరో తొమ్మిది మాసాలు...ఈ ప్రచారహోరులో ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో చూడాలి మరి. కాగా...సోషల్‌ మీడియాను ఎడాపెడా వాడేస్తూ..కేంద్ర ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారని గ్రహించిన బిజెపి పెద్దలు..సోషల్‌మీడియాను కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్‌మీడియాలో ప్రధానమై వాట్సప్‌ను కట్టడి చేయడానికి కేంద్రం ఆ సంస్థపై షరతులు విధించినట్లు తెలుస్తోంది. వాట్సప్‌ నుంచి షేరింగ్‌లు ఐదుకు మించి చేయడానికి వీలు లేని విధంగా చేసింది. దీంతో గత మూడు నాలుగు రోజుల నుంచి..వాట్సప్‌ సందేశాలు చాలా వరకు నియంత్రణలోకి వచ్చాయి. మరి రానున్న రోజుల్లో దీనిపై కేంద్రం మరింత దృష్టి పెడితే..సోషల్‌మీడియా ప్రచార హోరు తగ్గుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం..ఏమి జరుగుతుందో...!?

(263)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ