WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపి,టిఆర్‌ఎస్‌ పొత్తుకు 'గరికపాటి' ప్రయత్నాలు...!

తెలంగాణలో జరగబోయే ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఒకవైపు అధికార టిఆర్‌ఎస్‌ ఒంటరిగానే తాము పోటీ చేస్తామని చెబుతున్నా...ఆపార్టీ టిడిపితో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రెండు పార్టీలకు ఇష్టుడైన..టిడిపికి చెందిన 'రాజ్యసభ' సభ్యుడు 'గరికపాటి రామ్మోహన్‌రావు' ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో కీలక నాయకుడు ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే...ఇప్పుడు పొత్తుల విషయంలో టిఆర్‌ఎస్‌ పునరాలోచనలో పడిందని, దానిలో భాగంగా...రాజ్యసభ సభ్యుడు 'గరికపాటి'తో మంతనాలు సాగిస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో టిడిపి బలహీనపడినా..ఆ పార్టీ హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం,నల్లగొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ వంటి పూర్వ జిల్లాల్లో ఇంకా గట్టిగానే ఉంది. పార్టీ నాయకులు ఇతర పార్టీలోకి వలస వెళ్లినా...కార్యకర్తలు పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో...కాంగ్రెస్‌తో టిడిపి కలిస్తే...టిఆర్‌ఎస్‌కు ఇబ్బందులు వచ్చే పరిస్థితి నెలకొనడంతో... ఇప్పుడు...టిడిపితో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని పార్టీలోని ముఖ్యనాయకులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  వాస్తవానికి ఆరు నెలల ముందు టిడిపి,టిఆర్‌ఎస్‌లు పొత్తు పెట్టుకుని..వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని భారీ ఎత్తున్న ప్రచారం జరిగింది. అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా ఈ మేరకు కొన్ని సంకేతాలను పంపించారు. 'పరిటాల రవి' తనయుడు వివాహానికి ఆయన అనంతపురం వచ్చినప్పుడు, విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసినప్పుడు కూడా ఇదే రకమైన వాతావరణం నెలకొని ఉంది. అయితే...ఇటీవల కాలంలో టిడిపి బిజెపికి పూర్తిగా దూరం జరిగి...ఆ పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటించిన దగ్గర నుంచి కెసిఆర్‌ కూడా టిడిపికి దూరంగా జరిగారు. అప్పటి దాకా జరిగిన పొత్తు చర్చలు..తరువాత...ముందుకు సాగలేదు. ఈ లోపు...'చంద్రబాబు'...కాంగ్రెస్‌ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ'తో సన్నిహితంగా మెలగడంతో...తెలంగాణలో కాంగ్రెస్‌, టిడిపి పొత్తు ఖాయమనే సంకేతాలు బలంగా వెలువడ్డాయి. అయితే... ఇప్పుడు ఆపార్టీలు పొత్తు పెట్టుకుంటే...తమకు నష్టం తప్పదనే భావనతో..టిఆర్‌ఎస్‌ ముఖ్యులు..మంత్రులు తుమ్మల, కడియం శ్రీహరి వంటి నేతలతో...మళ్లీ పొత్తు గురించిన మాటలు మాట్లాడిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఇరు పార్టీలకు దగ్గరైన 'గరికపాటి రామ్మోహన్‌రావు' రంగంలోకి దిగారని చెబుతున్నారు. ఆయన టిఆర్‌ఎస్‌ పెద్దలతో పొత్తు గురించి..ప్రాధమిక చర్చలు జరపబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసి..ఈ పొత్తు ప్రతిపాదన జరుగుతుందా..? లేక 'గరికపాటి' ఒంటరిగానే ...ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారా..? అనే దానిపై స్పష్టత లేదు. టిడిపి,టిఆర్‌ఎస్‌ పొత్తు ఉంటే తమకు లాభం ఉంటుందని భావించే..వ్యాపారవేత్తలు..ఈ పార్టీల మధ్య చివరకు పొత్తు కుదురుస్తారని..తెలుస్తోంది. ఏది ఏమైనా...'గరికపాటి' చేస్తోన్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో..లేదో చూడాల్సి ఉంది.

(390)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ