లేటెస్ట్

‘వంశీ’ అరెస్టు ఘనత..నాయకులదా..? లేక పోలీసులదా...!?

వైకాపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ‘వల్లభనేని వంశీ’ అరెస్టుతో ‘టిడిపి’ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ‘గన్నవరం’ ‘టిడిపి’ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు ఆయన అరెస్టును పండుగలా భావిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. తన వెంట పార్టీ మారనందుకు వారిని ‘వంశీ’ నానా విధాలుగా వేధించారు. వారిపై పోలీసు కేసులు పెట్టడం, ఊరి నుంచి తరిమేయడం, అడ్డు వస్తే..తన రౌడీమూకతో..హింసించడం, దౌర్జన్యాలు చేయడం, హింసాకాండకుపాల్పడడం వంటి చేష్టలతో ‘వంశీ’ ‘టిడిపి’ వారికి ఆగర్భశత్రువయ్యారు. ఇప్పుడు ఆయన అరెస్టుతో..వారంతా..సంతోషంతో వేడుక చేసుకుంటున్నారు. అయితే.. ‘వంశీ’ అరెస్టు ఎలా జరిగింది..? ఆయన అరెస్టులో ఎవరి ప్రముఖ పాత్ర పోషించారనే దానిపై పార్టీ కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ‘వంశీ’ ప్రోద్భలంతో..‘టిడిపి’ కార్యాలయంపై దాడి జరిగింది. అప్పట్లో ‘జగన్‌’ ప్రభుత్వం దీనిపై కేసులు నమోదు చేయలేదు. అయితే..తరువాత అధికారంలోకి వచ్చిన ‘కూటమి’ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించి కేసులు నమోదు చేయించింది. అయితే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ‘వంశీ’ ‘సుప్రీంకోర్టు’ నుంచి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. దీంతో..ఇక ఈ కేసులో ఆయన అరెస్టు ఉండదని అందరూ భావించారు. అదే సమయంలో..‘కూటమి ప్రభుత్వం’ ‘వైకాపా’ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడకపోవడంతో ఇక ఈ కేసు నామ మాత్రంగా ఉంటుందని టిడిపి కార్యకర్తలు, నాయకులు అంచనా వేశారు. అయితే..అనూహ్యంగా..ఈ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి..అడ్డం తిరిగి..తాను అసలు కేసు పెట్టలేదని, టిటిపి నేతలే..తన చేత తప్పుడు కేసు పెట్టించారని న్యాయాధికారి ముందు వాగ్మూలం ఇచ్చారు. దీంతో..ఈ కేసులో ‘వంశీ’ ‘టిడిపి’ పెద్దలను బోల్తా కొట్టించారని, ఆయన జిత్తులమారితనంతో..‘టిడిపి’ పెద్దలకు కౌంటర్‌ ఇచ్చారని, ‘వంశీ’ సామాన్యుడు కాదని, ఆయనతో అంత ఈజీ కాదని నిరూపించుకున్నారు. అయితే..ఈ కేసులో ఫిర్యాదు దారు ఎదురుతిరిగిన మరసటి రోజే..‘వంశీ’పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి..ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేసి, విజయవాడకు తీసుకువచ్చి రిమాండ్‌కు పంపించారు.


ఈ తతంగం మొత్తంలో..‘టిడిపి’ యువనాయకుడు ‘నారా లోకేష్‌’ ఉన్నారని, ఆయనే ‘వంశీ’ సంగతి తేల్చాలనే పట్టుదలతో పనిచేశారని తొలుత ప్రచారం జరిగింది. తాము అధికారంలో ఉన్నప్పుడు..తమ పార్టీ వారిచేతే..కేసును ఉపసంహరింపచేస్తారా..? వారికి ఎంత ధైర్యం అంటూ.. ఆయన ‘వంశీ’ అరెస్టు కోసం ఎత్తులు వేశారని, దాంతోనే..‘వంశీ’ అరెస్టు జరిగిందని ‘టిడిపి’ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఆయనను ఆకాశానికెత్తాశారు. ‘లోకేష్‌’ రెడ్‌బుక్‌ అమలౌతుందని, ఇక ‘కొడాలి నాని, రోజా, పెద్దిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, అంబటి’ వంటి నాయకులను అరెస్టు చేస్తారని ఒకటే హోరెత్తించారు. అయితే..ఇదంతా పాక్షిక నిజమమని, అసలు విషయం అదికాదని ఇప్పుడు తెలుస్తోంది. ‘వంశీ’ కేసు ఉపసంహరింపచేయడంతో..‘విజయవాడ’ పోలీసులు నిర్ఘాంతపోయారని, తాము నమోదుచేసిన కేసులో ఉన్న వ్యక్తిని ఆయన ఎలా లోబరుచుకుంటారని ఆగ్రహంతో..‘వంశీ’ సంగతి చూడాలనే పట్టుదలతో..కేసు పెట్టిన ‘సత్యవర్థన్‌’ ఎక్కడ ఉన్నాడని ఆరా తీశారు. ఆయన ఆచూకి తెలుసుకుని, ఆయనను ఎలా ప్రలోభపెట్టింది..భయపెట్టింది తెలుసుకున్నారు. దీంతో..అసలు విషయం మొత్తాన్ని..అతను పోలీసుల ముందు కక్కేశారు. ‘సత్యవర్ధన్‌’ నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్న పోలీసులు ఆయన తల్లితో కేసు పెట్టించారు. తరువాత ఆయన సోదరుడితోనూ.. అదే విధమైన స్టేట్‌మెంట్‌ ఇప్పించుకున్నారు. ‘సత్యవర్థన్‌’ స్టేట్‌మెంట్‌ తరువాత ‘విజయవాడ’ ‘పడమట’ పోలీసు అధికారులు హైదరాబాద్‌ వెళ్లి ‘వంశీ’ ఉన్న అపార్ట్‌మెంట్‌ కు వెళ్లి ప్లాట్‌ తలుపు తట్టారు. ప్లాట్‌ తలుపులు తట్టడంతో..స్వయంగా ‘వంశీ’నే వచ్చి తలుపులు తెరిచి పోలీసులను చూడడంతో అవాక్కుయారు. తనకు బెయిల్‌ ఉందని, తనను ఎలా అరెస్టు చేస్తారని వారితో వాగ్వివాదం వేసుకున్నా..పోలీసులు ఆయనను మర్యాదగా పోలీసు జీపు ఎక్కించారట. ఇక అక్కడ నుంచి ‘విజయవాడ’కు తీసుకురావడం..తరువాత జరిగిన విషయాలన్నీ తెలిసినవే. ఈ మొత్తం వ్యవహారంలో..‘గన్నవరం’ ‘టిడిపి’ నేతలు కానీ, ఎమ్మెల్యే కానీ, టిడిపి పెద్దల హస్తం కానీ ఏమీ లేదని ప్రచారం సాగుతోంది. తమ ఇగోను దెబ్బతీసిన ‘వంశీ’ని దెబ్బకొట్టేందుకే..‘పటమట’ పోలీసులు ‘వంశీ’ విషయాన్ని తేల్చారట. ఈ మొత్తం వ్యవహారంలో.. ‘టిడిపి’ పెద్దలు కానీ, యువనేత కానీ..పెద్దగా పట్టించుకోలేదని, వాళ్లు గతంలో ఎలా ఉన్నారో..ఇప్పుడూ అలానే ఉన్నారని, వారు తమ తీరు మార్చుకోరని, ఇప్పుడు ‘వంశీ’ అరెస్టుతో..మిగతావారిని కూడా అరెస్టు చేస్తారనే ఆశలు క్యాడర్‌ పెట్టుకోవద్దని టిడిపి సానుభూతిపరుడైన ఎనలిస్ట్‌ ఒకరు చెబుతున్నారు. మొత్తం మీద..‘వంశీ’ వ్యవహారంలో రాజకీయనాయకుల కన్నా...పోలీసులే..చురుగ్గా వ్యవహరించారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ