WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రులకు సన్‌స్ట్రోక్స్‌...!?

వేసవికాలంలో ఉష్ణోగ్రతలకు 'జనం' అల్లాడుతూ నీడ పట్టున చేరతారనే విషయం అందరికీ తెలిసినవే. సూర్యభగవానుడి నుంచి వచ్చే కిరణాల దెబ్బకు కొంత మంది బలి అవుతుంటారు. దీనిని సన్‌స్ట్రోక్‌లుగా డాక్టర్లు చెబుతుంటారు. తాజాగా 'సన్‌స్ట్రోక్‌లు' మంత్రులు, ఎమ్మెల్యేలకు తగులుతోంది. తండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వారి బలహీనతలను అనుకూలంగా మలచుకుని కుమారులు తెరవెనుక ఉండి మంత్రుల అంతరంగిక సిబ్బంది ద్వారా అనేక పైరవీలను, ఆదాయం వచ్చే ఫైళ్లను పరిష్కరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వై.ఎస్‌.జగన్‌ అంత అవినీతిపరుడు ఎవరూ లేరు.అని పదే పదే విమర్శించే మంత్రులు ముందుగా తమ కుమారుల అవినీతిని కట్టడి చేయాలనే విషయాన్ని గమనిస్తే బాగుంటుందని అనేక సందర్బాల్లో వైకాపా నాయకులు అభిప్రాయపడ్డారు.పొత్తుల గురించి,నిజాయితీ గురించి పార్టీలో సీనియార్టీ గురించి పదే పదే ధ్వజమెత్తుతున్న రోడ్లు, భవనాలశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు గత నాలుగేళ్ల నుంచి పంచాయితీరాజ్‌,రోడ్లు భవనాలశాఖల్లో జరిగిన అనేక విషయాల్లో ఆయన కుమారుడు 'విజయ్‌' ప్రమేయం లేకుండానే పరిష్కరించారా..? ఈ రెండు శాఖల్లో మంత్రి కుమారుడు 'విజయ్‌' వ్యవహారశైలిని ఎవరిని అడిగినా చెబుతుంటారు. ఎంతో మంది అధికారులు, నాయకులు మంత్రి 'విజయ్‌' చుట్టూ తిరిగి పనులు చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా నూతనంగా నిర్మించే రోడ్లుకు సంబంధించిన పరిపాలనా పరమైన అనుమతులు ఇతర విషయాల్లో మంత్రి కుమారుడు జోక్యం చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నిజాయితీ గురించి నిత్యం కాకమ్మ కథలు చెప్పే మంత్రి అయ్యన్నపాత్రుడు తాను నిర్వహించిన నిర్వహిస్తున్న శాఖల్లో ఎంత నిజాయితీగా, పారదర్శకంగా పైళ్లు పరిష్కారం చేస్తున్నారో ధైర్యంగా చెబితే..ఆయా శాఖల అధికారులతో పాటు ఇతర ముఖ్యులు కూడా నమ్ముతారు. అతిగా ఆవేశపడే మంత్రి అయ్యన్న తన కుమారుడు 'విజయ్‌' జోక్యంతో ఎన్ని ఫైళ్లు పరిష్కరించారు..? గురివింద సామెతలా ముందు తన ఇంటి సమస్యను పరిష్కరించుకోవాలి..తరువాత ఇతర సమస్యలపై మంత్రి స్పందించాలని స్వపక్షీయులతో పాటు..విపక్షాలకు చెందిన వారు డిమాండ్‌ చేశారు. ఆయా డిమాండ్‌లను ప్రముఖ పత్రికలు ఏవీ శీర్షికల్లో ప్రచురించకపోవడం, 'సాక్షి' పత్రిక మాత్రమే కథనాలు ప్రచురించడంతో ఆ ప్రచారాలు ఊపందుకోలేదు. 

అదే విధంగా ఆర్థిక మంత్రి 'యనమల రామకృష్ణడు సోదరుడు కుటుంబసభ్యులు, అల్లుల్లు కూడా తెర వెనుక ఉండి చాలా పనులు చక్కపెట్టారనే విమర్శలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌ మంత్రి ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటిస్తారని, మంత్రి సోదరుడు ఇతర అధికారులకు ఆదేశాలిస్తారని విమర్శలు ఉన్నాయి. పౌరసరఫరాలశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలునిర్వహించినప్పుడు ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఎక్కువగా ఉందని వార్తలు వచ్చాయి..పలు పత్రికలు దీనిపై ఆధారాలతో కథనాలు ప్రచురించాయి. గతంలో రోడ్లు,భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి తాజాగా అటవీశాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'శిద్దా రాఘవరావు'శాఖలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఎక్కువగా ఉంది. అటవీశాఖలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంలో ఏజెన్సీలతో ఆయన కుమారుడు కుమ్మక్కు అయ్యారనే విమర్శలు ఉన్నాయి. తాను కోటీశ్వర్వుడిని అని..తన కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పిన మంత్రి శిద్దాకు తన కుమారుడు తెరవెనుక ఉండి...అధికారాలను చెలాయిస్తున్న సంగతి తెలియదా..? ఈ విషయంపై విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయి. 

  వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుమారుడు కూడా బాహాటంగా తెరపైకి వచ్చారు. జిల్లా యంత్రాగాన్ని శాసిస్తున్నారు..అనేక పనులు చక్కపెట్టుకుంటున్నారు. దీనిపై వైకాపా నాయకులు విమర్శలు చేసినప్పుడు..'సోమిరెడ్డి' స్పందిస్తూ..అదంతా అభూతకల్పనలు అని పనిగట్టుకుని తనపై కుట్రపన్నుతున్నారని ఎదురుదాడి చేశారు. నెల్లూరు జిల్లాలో మంత్రి సోమిరెడ్డి కుమారుడు అధికార యంత్రాంగాన్ని ఎలా శాసిస్తున్నారు..మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎలా చెలాయిస్తున్నాడో జిల్లా నాయకులకు తెలుసు. సర్వేపల్లి నియోజకవర్గానికి పేరుకే మంత్రి ఇన్‌ఛార్జి..అక్కడ పెత్తనమంతా ఆయన కుమారుడిదే. నెల్లూరురూరల్‌ నియోజకవర్గం నుంచి కుమారుడ్ని పోటీలోకి దింపాలని ఆయన కలలు కంటున్నారు. సోమిరెడ్డి కుమారుడు ఏవే పనులు చక్కపెట్టారు..? ఎవరెవరికి సహకరించారు..? కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారా..? లేదా అనే విషయాలపై విచారణ జరిపిస్తే..తాను ఆధారాలతో ముందుకు వస్తానని..సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి సవాల్‌ చేశారు. గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్నంత కాలం ఆయన కుమారుడే అధికారం చెలాయించేవారు. ఎక్సైజ్‌, రెవిన్యూ, రోడ్లు భవనాలశాఖల్లో అధికారులు, ఇంజనీర్లు,  బదిలీలు,పోస్టింగ్‌లు అన్నీ అప్పట్లో మంత్రి కుమారుని కనుసన్నల్లో జరిగేవి. ఈ కారణాలతోనే మంత్రి పదవి నుంచి గోపాలకృష్ణారెడ్డిని తప్పించారని ఆ విషయం బయటకు పొక్కకుండా అనారోగ్య కారణాలతో తొలగించారని సిఎంతో చెప్పించారని పార్టీ నాయకులే చెబుతున్నారు. 

  మంత్రిగా ఆదినారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత సచివాయలంలో ఆయన కార్యాలయంలోని ఆయన కుమారుడు వారి మిత్రులు తిష్టవేశారు. ప్రతి ఫైల్‌కు ఒక రేటు, ప్రతి బదిలీకి ఒక రేటు అని నిర్ణయించి..వసూలు చేస్తున్నారు. అవినీతిపరులైన అధికారులు మంత్రి కార్యాలయంలో గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారంటే పరిస్థితి ఏమిటో స్పష్టం అవుతోంది. మంత్రి కుమారుని అవినీతిని తట్టుకోలేక అంతరంగిక అధికారి సెలవుపై వెళ్లాలని భావించి ఆఖరి నిమిషంలో విరమించుకున్నారు. ఇప్పటి వరకు మంత్రి నిర్వహిస్తున్న పశు,సహకార, మార్కెటింగ్‌ శాఖలకు సంబంధించిన ఫైళ్ల పరిష్కారంలో ఎన్ని లక్షలు చేతులు మారాయో..విచారణ జరిపించాలని వైకాపా నాయకులు కూడా డిమాండ్‌ చేశారు. ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ, దేవాదాయశాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి కుమారుడు కూడా అధికార యంత్రాంగంలో కలుగ చేసుకున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు ముఖ్యమంత్రికి దృష్టికి వచ్చిన నేపథ్యంలో రెవిన్యూశాఖ పరిధిలోని ఆర్‌డిఒ, జాయింట్‌ కలెక్టర్‌-2 బదిలీల అధికారాన్ని మంత్రి అధికార పరిధి నుంచి తప్పించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాను మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయని తన కుమారుడు మాత్రమే పోటీ చేస్తారని కె.ఇ. బాహాటంగా వివరించిన విషయం తెలిసిందే. మంత్రి సోదరుల ప్రమేయం కన్నా..కుమారుల ప్రమయే అధికార యంత్రాంగాన్ని శాసిస్తుందని, అధికారులు, ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. 

  మంత్రి పరిటాల సునీతకు కూడా సన్‌స్ట్రోక్‌ తగులుతుంది. ఆమె కుమారుడు శ్రీరామ్‌ పౌరసరఫరాలశాఖలో చాలా పనులు చక్కపెట్టారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఐసీడిఎస్‌లో నిధులు గోల్‌మాల్‌ చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా మంత్రి వెనకడుగు వేశారంటే..మంత్రి కుమారుని వత్తిడివల్లేనన్న విమర్శలు వచ్చాయి. పై విధంగా చూసుకుంటే..మంత్రుల కుమారులు, అల్లుళ్లు, సోదరులు బాహాటంగా బరితెగించి..ఎన్నో పనులు చక్కపెట్టారు అనే విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు మంత్రుల దూకుడుకు కట్టడి చేసినా జిల్లాల్లో మంత్రుల బంధువుల దూకుడును తగ్గించడంలో ప్రేక్షక పాత్ర పోషించారనే విమర్శలు వచ్చాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు తప్ప..మిగతా యంత్రాంగం అంతా మంత్రుల కుమారుల చేతిలో ఉందనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో ఎంత భయంకరంగా ఉందో..ఇప్పుడు అంత కన్నా రెట్టింపుగా ఉందని సీనియర్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తూ బాధపడుతున్నారు. యధా రాజా..తథా ప్రజా అన్న చందంగా..కనిపిస్తోందని అధికార పార్టీ నాయకులే కొన్ని సందర్బాల్లో అంగీకరించారు.

(316)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ