WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎన్నికల బరిలోకి ఆ నలుగురు ఐఎఎస్‌లు...!

రాష్ట్ర ప్రభుత్వంలో కీలక ప్రాధాన్యత పోస్టులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఎఎస్‌ అధికారులతో పాటు సర్వీసు నుంచి రిటైర్‌ అయినా పొడిగింపులో ఉన్న మరో అధికారి..రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేలు, మంత్రులు అవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఈ నలుగురు అధికారులు నాలుగు సామాజికవర్గాలకు చెందిన వారు కావడం విశేషం. వీరందరు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందడంతో వారికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేయించేందుకు 'చంద్రబాబు' ఆసక్తిగా ఉన్నారట. ఇందులో ఒక అధికారికి మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలా..? వద్దా అనే విషయంపై తర్జనభర్జనలు పడుతున్నారని తెలిసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...గిరిజన కార్పొరేషన్‌ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'బాబూరావునాయుడు' గిరిజన సామాజికవర్గానికి చెందిన అధికారి. కడప కలెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆయనను విశాఖపట్నంలోని గిరిజన వర్గానికి కేటాయించిన నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని 'చంద్రబాబు' నిశ్చయించారు. 

  అదే విధంగా తిరుమలలో జెఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరాజును చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కీ.శే. గాలి ముద్దుకృష్ణమనాయుడు జీవించి ఉంటే ఆయనకు ఆ అవకాశం దక్కేది కాదు. 'ముద్దు' భార్యకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో మళ్లీ ఆ కుటుంబానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో 'నగరి' నియోజకవర్గ టిక్కెట్‌ 'శ్రీనివాసరాజు'కు దక్కవచ్చు. ఆయన సామాజికవర్గానికి చెందిన వారు ఇక్కడ వేల సంఖ్యలో ఉండడం ఆయనకు కలసి వస్తుందని భావిస్తున్నారు. 

 అదే విధంగా పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ కమీషనర్‌గా మూడేళ్లుగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు..కొన్ని నెలలు గ్రామీణనీటి సరఫరాశాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి 'రామాంజనేయులు' ఇటీవల సమాచారశాఖ కార్యదర్శిగా నియమించిన విషయం విధితమే. దళిత సామాజికవర్గానికి చెందిన ఈ అధికారిని మొదట ఎంపీగా పోటీ చేయించాలని 'చంద్రబాబు' భావించినా..ప్రస్తుతం ఆయనను ఎక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే దానిపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు అధికారులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి విజయం సాధిస్తే మంత్రులు అవుతారని టిడిపి వర్గాల్లో, అధికార వర్గాల్లో అభిప్రాయం ఉంది. 'రామాంజనేయులు' బాపట్ల, తిరుపతి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. 

  ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రుడు, నమ్మకస్తుడు అని పేరున్న కృష్ణా జిల్లా కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం' సర్వీసు కొన్ని నెలలే ఉన్న నేపథ్యంలో ఆయనను కూడా ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచి పోటీ చేయించాలనే దానిపై 'చంద్రబాబు' ఒక నిర్ణయానికి రాలేదు. కానీ..ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నలుగురు అధికారుల్లో 'రామాంజనేయులు' మాత్రమే రిటైర్‌ అయ్యారు. గిరిజన కార్పొరేషన్‌ ఎండి 'బాబూరావునాయుడు' తిరుమల జెఇఒగా పనిచేస్తున్న 'శ్రీనివాసరాజు' ఇంకా సర్వీసులో ఉన్నారు. కృష్ణా కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం' విషయంలో 'చంద్రబాబు' ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు లేవని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై ప్రేమ చూపిస్తున్నా..తాను..ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదని ఆయన తనకు సన్నిహితమైన మీడియా వర్గాలతో అంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడం కన్నా..ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన సేవలను 'చంద్రబాబు' ఉపయోగించుకుంటే బాగుంటుందేనేది..కలెక్టర్‌ లక్ష్మీకాంతం కోరిక. మరి..'చంద్రబాబు' ఆయన కోరిక తీరుస్తారో..లేక..ఆర్థిక వనరుల విషయం తాను..చూసుకుంటాను...ఎన్నికల బరిలోకి దిగమని సూచిస్తారో..చూడాలి? 

 కాగా  'రామాంజనేయులు, బాబూరావునాయుడు' విషయంలో 'చంద్రబాబు' ఒక నిర్ణయానికి వచ్చారని 'శ్రీనివాసరాజు' విషయంలో ఆయన ఇంకా ఒక నిర్ణయానికి  రాలేకపోయారని తెలుస్తోంది.  'నగరి' నియోజకవర్గంలో 'ముద్దు' కుటుంబానికి మద్దతు ఉండడమే ఆయన నిర్ణయానికి రాలేకపోవడానికి ప్రధాన కారణం. 'ముద్దు' కుటుంబ సభ్యులకు టిక్కెట్‌ ఇవ్వకపోతే... వారు స్వతంత్య్ర అభ్యర్థిగానో..లేక వైకాపాకు మద్దతుగానో..మారితే పరిస్థితి ఏమిటనే దానిపై 'చంద్రబాబు' ఆలోచిస్తున్నారని ఆ జిల్లా నాయకులు చెబుతున్నారు.  మొత్తం మీద..ఈ నలుగురు అధికారులు రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా రాబోతున్నారని అధికార వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

(677)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ