WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గెలిచే అభ్యర్థుల వైపే 'చంద్రబాబు' చూపు...!

టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా రాజకీయాలవైపు దృష్టిసారిస్తూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నారు. చివరకు కుమారుడు, మంత్రి లోకేష్‌ను కూడా కొన్ని విషయాల్లో సంప్రదించకుండా కొన్ని జిల్లాలకు చెందిన నాయకులను ఏకాంతంగా చర్చిస్తూ...ఎవరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి..ఎవరు ఎంపీలుగా పోటీ చేయాలనే చర్చిస్తున్నారు. ఆయా చర్చలప్పుడు పలు జిల్లాలకు చెందిన మంత్రులను లోపలికి రానీయడం లేదు. పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కొంత మంది మంత్రులను, సీనియర్‌ పార్టీ నాయకులను, కార్యాలయంలో పనిచేస్తోన్న నాయకులను పక్కనపెడితే..ఇంతకు ముందు దృష్టికి రాని వివరాలన్నీ వస్తాయని ఇంటిలిజెన్స్‌ విభాగపు అధికారి ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలిసింది. ఏయే జిల్లాలో పార్టీ బలహీనంగా ఉంది...ఏయే నియోజకవర్గంలో ఎవరైతే అవలీలగా విజయం సాధిస్తారు..కష్టపడితే విజయం సాధిస్తారా..? ఖర్చుపెడితే విజయం సాధిస్తారా..అనే విషయంపై చంద్రబాబు దృష్టిసారిస్తున్నారు. అంతే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు ఎవరు రంగంలో ఉంటారనే దానిపై దృష్టి పెడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల వల్ల పార్టీ బలహీనపడిందని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారిస్తూ..అభ్యర్థులుగా ఎవరెవరిని ఎంపిక చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వైకాపా నాయకులు పార్టీలో చేరేందుకు మధ్యవర్తుల ద్వారా సమాచారం పంపుతున్నారని అటువంటి వారిలో స్థానికంగా పట్టున్న వారిని చేర్చుకునేందుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వబోతున్నారు. 

  మరొక ఆరు నెలల అనంతరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు నెలలు ముందుగా అభ్యర్థులను ఎంపిక చేసి..వారిని నియోజకవర్గంలో పర్యటించి..ఓటర్లను ఆకట్టుకునే విధంగా సూచనలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ ఏకాంతంగా పలువురితో ఆయన చర్చించి నిర్ణయం తీసుకోవడంతో అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. పార్టీ కార్యాలయంలో పనిచేస్తోన్న నాయకులు కొందరు మంత్రుల కొమ్ము కాస్తూ..పనులు చక్కపెట్టుకుంటున్నారని 'చంద్రబాబు' దృష్టికి వచ్చింది. అభ్యర్థుల ఎంపికలో వారి ప్రమేయం లేకుండా ఎటువంటి సిఫార్సులు లేకుండా 2014 ఫలితాల కన్నా అదనపు ఫలితాలు సాధించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. విపక్షాలన్నీ కలసిపోటీ చేసినా...పరస్పరం తెరవెనుక ఉండి సహకరించుకున్నా..గెలిచే అభ్యర్థులను మాత్రమే ఎన్నిక చేసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు, పార్టీ కార్యాలయ నాయకులతో పాటు మరెవరి ప్రమేయం లేకుండా స్వయంగా చంద్రబాబు ఎంపిక చేసుకుంటే ఎదురుండదని సీనియర్‌ నాయకులు..అభిప్రాయపడుతున్నారు. అందుకేనేమో..ఈ మధ్య కాలంలో కొంత సీనియర్లతో చంద్రబాబు రహస్యంగా చర్చిస్తున్నారని వారు చెబుతున్నారు. 1994 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్‌ ప్రారంభించిన ఫార్ములాను ఇప్పటికే అమలు చేస్తాను..అని చెప్పారు..ఇంకా ఆయన పాటించిన పద్దతులను చంద్రబాబు కూడా పాటించబోతున్నారు.

(309)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ