WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పలువురు మంత్రులకు ఓటమి భయం...!

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేస్తోన్న వారిలో కొందరికి ఎన్నికల భయం పుడుతోందట. ఎన్నికల్లో పోటీ చేస్తే..గెలుస్తామా..? లేదా..అన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోందట. ముఖ్యంగా గిరిజన సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న మంత్రుల్లో ఈ ఆందోళన ఎక్కువగా ఉంది. గతంలో 'పవన్‌' కళ్యాణ్‌ మద్దతుతో విజయం సాధించారు. అలా విజయం సాధించిన వారిలో రోడ్లు,భవనాలశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో కాపులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది 'అయ్యన్న'కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 2004లో చంద్రబాబుపై వ్యతిరేకత వ్యక్తం అయినా...'అయ్యన్న' విజయం సాధించగలిగారు. కానీ 2009లో ప్రజారాజ్యం ప్రభావంతో 'అయ్యన్న' ఓడిపోయారు. మళ్లీ అదే ప్రభావం పనిచేస్తే..'అయ్యన్న' ఓడిపోక తప్పదేమో..అని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్ననాయుడు కూడా అదే రీతిలో ఓడిపోయి..2014లో 'పవన్‌' ప్రభావంతో విజయం సాధించారు. 2004లో విజయం సాధించిన 'యనమల' 2009లో ఓడిపోయారు. 2014లో ఎమ్మెల్సీగా చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం పొందారు. మళ్లీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే..ఆయనకు అదే పరిస్థితి ఎదురవుతుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురంలో 'జనసేన' ప్రభావం అధికంగా ఉండవచ్చు. కానీ...మంత్రి రాజప్పపై అన్ని వర్గాల ఓటర్లల్లో ఆదరాభిమానాలు ఉన్నాయి. కానీ 'పవన్‌' ప్రభావం పనిచేస్తే..రాజకీయంగా ఇక్కట్లు తప్పవని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. 

  అదే విధంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంనుంచి 2009లో టిడిపి అభ్యర్థి ఓడిపోగా..అప్పట్లో ప్రజారాజ్యం చీల్చిన ఓట్లే కారణం. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో 2014లో 'పవన్‌' ప్రభావంతో టిడిపి అభ్యర్థి విజయం సాధించి మంత్రి అయ్యారు. ఇక్కడ 'జనసేన' అభ్యర్థి రంగంలోకి దిగితే 'కొల్లు'కు ఓటమి తప్పదని టిడిపి నాయకులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా 'దర్శి' నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. మంత్రి శిద్దారాఘవరావుకు 'జనసేన' తాకిడితో ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేగా అక్కడ నుండి తాను పోటీ చేయను..ఎంపీగా వెళతాను...అని మంత్రి శిద్ధా అంటున్నట్లు బయటకు పొక్కింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మంత్రి కాల్వ శ్రీనివాసులకు ఓటమి భయం పట్టుకుందట. గతంలో అన్ని పరిస్థితులు కలసి వచ్చి..ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీలు గోవింద్‌రెడ్డి, దీపక్‌రెడ్డిల సహకారం లేకుంటే ఓటమి తప్పదు. ఈ నియోజకవర్గం నుంచి మళ్లీ తానే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోవింద్‌రెడ్డి చెబుతున్నారట. కాదు...తనకే సీటు ఇవ్వాలి...ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి నష్టపోయాయని..తానే బరిలో ఉంటానని...'దీపక్‌రెడ్డి' చెబుతున్నారట.మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ 'జనసేన' ప్రభావం ఉండదని..వారు చెప్పుకుంటున్నారు. కానీ 'జనసేన' ప్రభావం పొంచి ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు. పలు జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులకు ఓటమి భయం పెరిగిపోతోందట. ఈ రోజు పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో..ఒకవేళ 'జనసేన, వైకాపా పొత్తు కుదుర్కుఅని పనిచేస్తే...అప్పటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో..? ఈ విషయాలన్నీ చర్చించుకుంటూ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు మంత్రులు. వారికి ఏ విధంగా కాలం కలసి వచ్చి..మళ్లీ ఎమ్మెల్యేగాలు గెలుస్తారా..? లేక ఓడిపోయి మాజీలుగా మిగిలిపోతారా..?

(1110)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ