WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'డిఎల్‌' అటా...ఇటా...!?

కడప జిల్లాలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రత్యేక ఇమేజ్‌ ఉన్న నేతల్లో డి.ఎల్‌.రవీంద్రారెడ్డి ఒకరు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించిన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా 1994లో కాంగ్రెస్‌పార్టీ 24 సీట్లు గెలిస్తే...అందులో కూడా డిఎల్‌ ఉన్నారు. నాలుగుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆయన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది పలువురు ముఖ్యమంత్రుల మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. 1983,1989,1994,2004,2009 ఎన్నికల్లో ఆయన మైదుకూరు నుంచి గెలుపొంది..ఆ నియోజకవర్గంపై తిరుగులేని పట్టుసాధించారు. కడప జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి హవాను తట్టుకుంటూనే 'డి.ఎల్‌' తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. వై.ఎస్‌,మైసూరా,డిఎల్‌ ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు తిరుగులేని పట్టుసాధించిన నేతల్లో ఒకరు. వై.ఎస్‌ మృతి చెందిన తరువాత..'జగన్‌'ను ఎదిరించి...ఆయన అప్పటి ముఖ్యమంత్రి 'నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి'కి మద్దతు ఇచ్చి ఆయన మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే...తాను ఎవరికైతే మద్దతు ఇచ్చారో..అదే 'కిరణ్‌' చేత ఘోరంగా అవమానింపబడ్డారు. అప్పటి నుంచి 'కిరణ్‌'పై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేసినా..కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విభజించ డంతో...డిఎల్‌ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా...ఎన్నికలకు దూరం కావడంతో... మైదుకూరు నుంచి వైకాపా అభ్యర్థి గెలుపొందారు. మైదుకూరులో పట్టున్న 'డి.ఎల్‌'ను పార్టీలో చేర్చుకోవాలని టిడిపి భావించి ఎన్ని ప్రయత్నాలు చేసినా..ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా..ఆయనను వైకాపాలో చేర్చుకోవాలని ఆపార్టీ అధినేత 'జగన్‌' రాయబారాలు పంపుతున్నారు. దీంతో..ఇప్పుడు 'డిఎల్‌' ఏ పార్టీలో చేరతారనే దానిపై జిల్లాల్లో ఉత్కంఠత నెలకొని ఉంది.

  మొదటి నుంచి వై.ఎస్‌ సుపుత్రుడు 'జగన్‌'ను 'డిఎల్‌' తీవ్రంగా వ్యతిరేకించేవారు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం 'జగన్‌'ను ముఖ్యమంత్రి చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా..డిఎల్‌ మాత్రం చేయలేదు. దీంతో..అప్పటి నుంచి 'డిఎల్‌'పై కక్ష పెట్టుకున్న 'జగన్‌' తన పత్రిక ద్వారా..'డిఎల్‌'పై దాడి చేయించారు. అయితే...'జగన్‌' దాడిని 'డిఎల్‌' సమర్థవంతంగా తిప్పికొట్టారు. 'సాక్షి' పత్రిక లెట్రిన్‌లో వాడుకోవడానికి కూడా పనికిరాదని సంచలన వ్యాఖ్యలు చేసి...'జగన్‌'కు చిరాకు తెప్పించారు.అయితే...'జగన్‌'పై పోరాడుతున్న 'డిఎల్‌'కు అప్పటి ముఖ్యమంత్రి 'కిరణ్‌' మద్దతు ఇవ్వకపోగా..అవమానకరంగా.. మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయించారు. దీంతో..రాజకీయంగా 'డిఎల్‌' మౌనాన్ని ఆశ్రయించారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన టిడిపిలో చేరి 'మైదుకూరు' నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా..ఆఖరి నిమిషాల్లో అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఎన్నికల్లో టిడిపి గెలిచి అధికారంలోకి రావడంతో..ఆయన టిడిపిలో చేరతారని..ఆయనను స్వయంగా ముఖ్యమంత్రి 'చంద్రబాబు' కుమారుడు మంత్రి లోకేష్‌ పార్టీలోకి ఆహ్వానించారని ప్రచారం జరిగింది. ఆయన సీటుకు టిడిపి నుంచి ఇబ్బంది రాకుండా..నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న 'పుట్టా సుధాకర్‌యాదవ్‌'ను టిటిడి ఛైర్మన్‌ పోస్టును కట్టబెట్టి 'డిఎల్‌'కు స్వాగతం పలికారు. అయినా..'డిఎల్‌' పెద్దగా స్పందించలేదు. దీంతో..ఇప్పుడు వైకాపా ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆయనను పార్టీలో చేర్పించాలని...ఆయనకు సన్నిహితుడైన 'ఆనం రాంనారాయణరెడ్డి' దూతగా..మైదుకూరు పంపించింది. 'డిఎల్‌'తో ఉన్న సాన్నిహిత్యంతో..'ఆనం' ఆయనను పార్టీలో చేర్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 'డిఎల్‌' ఇంటికి వెళ్లి..'ఆనం' చర్చలు జరిపారు. అయితే..'డిఎల్‌' నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదని 'డిఎల్‌' సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద 2019 ఎన్నికల్లో ఆయన టిడిపి తరుపున పోటీ చేస్తారా..? లేక వైకాపా తరుపున పోటీ చేస్తారా..? అనే దానిపై జిల్లా వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. 'జగన్‌'ను గతంలో వ్యతిరేకించినా మారిన పరిస్థితుల్లో ఆయన వైకాపాలో చేరవచ్చునని ఆ పార్టీవర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే..'చంద్రబాబు'తో ఉన్న సాన్నిహిత్యంతో..'డిఎల్‌' టిడిపిలో చేరతారని టిడిపి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏది ఏమైనా...'డిఎల్‌' ఏ నిర్ణయం తీసుకుంటారోనని..ఇరుపార్టీలకు చెందిన వారు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.  

(793)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ