WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోక్‌సభ'కు గుంటూరు మంత్రులు...!?

రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మరో ఆరు మాసాలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు సుధీర్ఘ కసరత్తులు చేస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కొందరిని, ఇన్‌ఛార్జులను మార్చాలని భావిస్తూ ఆ మేరకు ప్రయత్నాలు చేస్తుండగా...ప్రతిపక్ష వైకాపా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిని మార్చి నూతనంగా సొమ్ములు పెట్టే వారికి కోసం వెతుకులాట ప్రారంభించింది. తమ మద్దతు లేకుండా ఎవరూ అధికారాన్ని చేపట్టలేరని చెబుతోన్న 'జనసేన' పార్టీ జిల్లాలో స్తబ్దుగా ఉంది. ఆ పార్టీ హడావుడి జిల్లా వ్యాప్తంగా పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికి హడావుడి లేకపోయినా..రేపు ప్రధాన పార్టీలైన టిడిపి, వైకాపాలో టిక్కెట్లు రానివారి..'జనసేన' వైపు వస్తారని వారు భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే..అధికార టిడిపిలో సరైన అభ్యర్థుల కోసం కసరత్తులు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒంటరిగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఆయన తన కుమారుడు, మంత్రి లోకేష్‌ను కూడా వేలు పెట్టనివ్వడం లేదనేది జిల్లా పార్టీ నాయకుల అభిప్రాయం. జిల్లాల్లో ఇప్పటికే పలు నియోజకవర్గాల నుంచి ఎవరెవరిని పోటీ చేయించాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అభిప్రాయానికి వచ్చారని...కొన్ని నియోజకవర్గాలపై ఇంకా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉంటే..గత ఎన్నికల్లో టిడిపి 12స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చారని తెలుస్తోంది. 

  ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలైన 'పత్తిపాడు, తాడికొండ,వేమూరు' నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన వారెవరినీ మళ్లీ పోటీకి నిలపరని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 'పత్తిపాడు'లో మాజీ మంత్రి 'రావెల కిశోర్‌బాబు'కు టిక్కెట్‌ ఇవ్వరని ఎప్పుడో తేలిపోయింది. అదే బాటలో 'తాడికొండ' ఎమ్మెల్యే 'తెనాలి శ్రావణ్‌కుమార్‌' కూడా ఉన్నారు. మరో ఎస్సీ నియోజకవర్గమైన 'వేమూరు' నుంచి ప్రస్తుత సాంఘిక,సంక్షేమశాఖ మంత్రి 'నక్కా ఆనందబాబు' ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు టిక్కెట్‌ ఇచ్చేది ఖాయమైనా...ఆయనను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనివ్వరని ప్రచారం జరుగుతోంది. ఆయనను పార్లమెంట్‌ బరిలో దింపాలనే ఉద్దేశ్యంతో అధినేత ఉన్నారని తెలుస్తోంది. 'ఆనందబాబు' మంత్రిగా ఘోరంగా విఫలమయ్యారని, శాఖలో అవినీతిని కట్టడి చేయలేకపోయారని, అవినీతికి ఆయనే రాచబాట వేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. శాఖపై పట్టుసాధించలేకపోయారని, ఎస్సీ,ఎస్టీలకు ఎంతో మేలు చేసే అవకాశం ఉన్నా ఆయన చేతులారా వదిలేసుకున్నారని, ఆయన కంటే గంతలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన 'రావెల' నయమనే మాట సచివాలయ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన 'ఆనంద్‌బాబు'కు ఎమ్మెల్యే టిక్కెట్‌ కన్నా..ఎంపీ టిక్కెట్‌ ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. బాపట్ల పార్లమెంట్‌ నుంచి ఆయనను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తులు చేస్తున్నారట. జిల్లాకు చెందిన మరో మంత్రి 'పత్తిపాటి పుల్లారావు'ను కూడా పార్లమెంట్‌కు పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన నర్సరావుపేట పార్లమెంట్‌ నుంచి పోటీకి దిగుతారని...ఆయన స్థానంలో ఆయన భార్య 'చిలకలూరిపేట' నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఆలోచన అధిష్టానంలో ఉందని విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికల్లో నర్సరావుపేట  నుంచి పోటీ చేసి గెలిచిన 'రాయపాటి సాంబశివరావు' తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన నేపథ్యంలో..అక్కడ నుంచి మంత్రి పుల్లారావును బరిలోకి దించితే ఎలా ఉంటుదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుందట. ఏది ఏమైనా...జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు లోక్‌సభకు పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తులు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

(1130)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ