WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపి ప్రభుత్వంలో అనధికార మంత్రులు వీరే...!?

అదేమిటో...కానీ...చంద్రబాబునాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా...ఆయనకు ఇష్టులు, దగ్గరవారనుకున్న కొంత మంది ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయేవారు. ఆయన కావాలని వారిని పక్కన పెడతారా..? లేక..పరిస్థితులు ఆ విధంగా వస్తాయో తెలియదు కానీ...'చంద్రబాబు'కు బాగా దగ్గర అనుకునే వారికి మంత్రివర్గంలో చోటు దక్కేది కాదు. 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత నుంచి 2014లో మళ్లీ విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా అదే పరిస్థితి ఉంది. సామాజిక సమీకరణాలు కుదరక వారిని మంత్రివర్గంలోకి తీసుకోలేదని ఆయన బుజ్జగించేవారు. 'చంద్రబాబు' బుజ్జగింపులకు ఆయా ఎమ్మెల్యేలు...అయిష్టంగా తలలూపేవారు. అయితే ఇక్కడే తిరకాసు ఉంది. 'చంద్రబాబు' వారిని మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా...వారు మాత్రం తామే మంత్రులమనే రీతిలో వ్యవహరించేవారు. ఉదాహరణకు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి 'చంద్రబాబు' ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రి వర్గంలో చోటు దక్కని 'ఎర్రబెల్లి దయాకర్‌ రావు'నే చూసుకోండి. అప్పట్లో వరంగల్‌ జిల్లాలో 'కడియం శ్రీహరి' మంత్రిగా ఉండేవారు. పేరుకు 'కడియం' మంత్రి అయినా... జిల్లాలో పెత్తనమంతా 'ఎర్రబెల్లే' నడిపించేవారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు 'ఎర్రబెల్లి'కి పుష్కలంగా ఉండడంతో... ఆయనను 'కడియం' ఏమీ చేయలేకపోయేవారు. అదే విధంగా...చంద్రబాబు వద్ద తనకు ఉన్న పరపతిని చూపించుకునేందుకు 'ఎర్రబెల్లి' తెగ తాపత్రయపడేవారు. ఆయనను 'చంద్రబాబు' కూడా అదే విధంగా ప్రోత్సహించేవారు. ఆయనొక్కరే కాదు..అప్పట్లో ప్రతి జిల్లాకు ఇటువంటి అనధికార మంత్రులు ఉండేవారు. గతంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా చంద్రబాబు అనధికార మంత్రులను ప్రోత్సహిస్తున్నారనే మాట వినిపిస్తోంది.

 కొన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణలు కుదరక కొందరు సీనియర్‌ ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వ లేకపోయారు. అయితే..మంత్రి పదవులు దొరకని సీనియర్లు తామే మంత్రులమన్నట్లు..వివిధ జిల్లాల్లో పెత్తనం చెలా యిస్తున్నారు. ప్రతి జిల్లాల్లో ఇద్దరు లేక ముగ్గురు శాసనసభ్యులు తామే మంత్రులమన్నట్లు వ్యవహరిస్తున్నారనే మాట స్వంత పార్టీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రాజధాని నగరమైన గుంటూరు జిల్లాల్లో ఇద్దరు శాసనసభ్యులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే మాట ఉంది. వారు వివిధ శాఖల్లో తాము చెప్పినట్లే జరగాలని పట్టుపట్టి పనులు చేపించుకుంటున్నారట. మంత్రులకు చేతకాని పనులను ఈ ఎమ్మెల్యేలు చక్కపెడుతున్నారని పార్టీ వర్గాలు, అధికార వర్గాలు అంటున్నాయి. పోలీసు, రెవిన్యూ,పంచాయితీరాజ్‌, జలవనరులు, దేవాదాయ,మానవవనరులు, వ్యవసాయ,ఎక్సైజ్‌,సాంఘిక సంక్షేమ,ఆరోగ్య, హౌసింగ్‌, సివిల్‌ సప్లయి తదితర శాఖల్లో ఈ అనధికార మంత్రుల హవా సాగుతుందని వారు విమర్శిస్తున్నారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి,అనంతపురం,తూర్పుగోదావరి, ప్రకాశం,కడప జిల్లాలకు చెందిన  కొందరు ఎమ్మెల్యేలు షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్నారట. మంత్రుల మాట కన్నా...ఎమ్మెల్యే మాటే..ఆయా జిల్లాల్లో అధికారులకు వేద వాక్కు అవుతోందట. మంత్రులు చెప్పిన పనులు అధికారులు చేయడం లేదని...అదే ఎమ్మెల్యే చెబితే ఆగమేఘాలపై పనులు అవుతున్నాయని వారు వాపోతున్నారు. కొన్ని శాఖల్లో కొందరు ఎమ్మెల్యేలు తలదూర్చి...తాము చెప్పిన పనులతో పాటు..విధాన నిర్ణయాల్లో కూడా పాలు పంచుకుంటున్నారట. దీంతో మంత్రులు, అధికారులు విస్తుపోతున్నారు. అసలు మంత్రి ఎవరు..? అనధికార మంత్రి ఎవరు..? అని వారిలో వారు చర్చించుకుంటున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద ఉన్న సాన్నిహిత్యంతో వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని దీని వల్ల ప్రభుత్వానికి అప్రదిష్ట వస్తుందని కొందరు టిడిపి సీనియర్‌ నాయకులు వ్యాఖ్యా నిస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి పదవి రాకపోయినా...మంత్రి పదవి కంటే ఎక్కువ అధికారాలను సదరు ఎమ్మెల్యేలు అనుభవిస్తున్నారని..ప్రచారం జరుగుతోంది.

(1009)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ