WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'విజయవాడ' లోక్‌సభ బిజెపి అభ్యర్థిగా ఐవైఆర్‌ కృష్ణారావు...!

25లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పరోక్షంగా ప్రకటించిన 'జగన్‌' విజయవాడ విషయంలో కప్పదాటు వైఖరితో వెళుతున్నారు. అదిగో..అభ్యర్థిని ప్రకటిస్తా...ఇదుగో అభ్యర్థిని ప్రకటిస్తా...? అని చెబుతున్నారే..తప్ప..అభ్యర్థిని ప్రకటించడం లేదు. దీనిలోని అసలు విషయం ఏమిటా అని ఆరా తీయగా..నిన్నటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేసిన కృష్ణారావు బిజెపిలో చేరిన విషయం విదితమే. వైజాగ్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన ఐవైఆర్‌ అక్కడ స్థానిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విజయవాడ నుంచి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు బయటకు పొక్కింది. విషయం ఏమిటంటే విజయవాడ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బ్రాహ్మణులు, వైశ్యులు పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. అంతే కాకుండా వైకాపా మద్దతు పరోక్షంగా ఉంటుంది. ఇక్కడైతే మాత్రమే క్షేమకరమని ఐవైఆర్‌కు నమ్మకమట. అధిష్టానానికి మధ్యవర్తులుగాపనిచేస్తోన్న కొందరు బిజెపి నాయకులతో ఐవైఆర్‌ చెబుతున్నట్లు తెలిసింది. గతంలో ఆయన సామాజికవర్గానికి చెందిన చెన్నుపాటి విద్య ఎంపీగా గెలిచిన విషయాన్ని ఐవైఆర్‌ గుర్తు చేస్తున్నారు. విజయవాడ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు రంగంలోకి ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ ఓట్లు ఐవైఆర్‌కు బదిలీ అవుతాయనేది ఆయన నమ్మకం. ఇదే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుదృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ఐవైఆరే కాదు..సాక్షాత్తూ 'జగనే' పోటీ చేసినా..అఖండ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు విజయవాడ ఎంపి 'కేశినేని నాని'. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అనుకూలంగా మలచుకుంటామని..ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపుతామని 'జగన్‌' భావిస్తున్నప్పటికీ మా ప్రభుత్వంపై వ్యతిరేకతే లేదు...అటువంటప్పుడు..ఓటర్లును ఆయన ఏ విధంగా ఆకర్షిస్తారు...? అని ఎంపీ కేశినేని నానీ ధీమాతో ఉన్నారు. 'జనసేన' అధిపతి 'పవన్‌' కూడా ఐవైఆర్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆశీస్సులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు పొందడమే కాకుండా కొంత కాలం బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అధికారం చెలాయించిన ఐవైఆర్‌ తెరవెనుక కొందరి ప్రోద్బలంతో చంద్రబాబుపై విమర్శలు చేసి సంచలనం సృష్టించి..కొద్ది నెలల క్రితం బిజెపిలో చేరి..తన వెనుక ఎవరు ఉన్నారో రుజువు చేశారు. చెన్నుపాటి విద్య  వలే ఐవైఆర్‌ విజయం సాధిస్తారా..? లేదా ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా తెరమరుగు అవుతారా..? చూద్దాం..ఏమి జరుగుతుందో..?

(150)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ