లేటెస్ట్

త్వరలో నూతన అక్రిడిటేషన్‌ పాలసీ...!

ఏ ముహూర్తానా..అక్రిడిటేషన్ల పక్రియను సమాచారశాఖ చేపట్టిందో కానీ...అడుగు..అడుగిక్కి దానికి బ్రేక్‌లు పడుతూనే వస్తున్నాయి. వారం రోజుల క్రితం దాకా...నూతన అక్రిడిటేషన్ల మంజూరు తథ్యమన్న భావన అటు సమాచారశాఖ అధికారుల్లో..ఇటు జర్నలిస్టుల్లోనూ ఉండేది. కానీ..మూడు రోజుల కిందట జరిగిన పరిణామాలతో..ఒక్కసారిగా అక్రిడిటేషన్ల పక్రియకు బ్రేక్‌ పడింది. ముందు నుంచి కొందరు భావిస్తున్నట్లు..అక్రిడిటేషన్ల మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ..సమాచారశాఖ అధికారులు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ముందు నుంచి కొందరు ఊహిస్తున్నదే. జర్నలిస్టు సంఘాల మధ్య నెలకొన్న అనైక్యత, అధికారపార్టీకి మద్దతు ఇస్తోన్న పత్రికలోని పెద్ద తలకాయల మధ్య నెలకొన్న విభేదాలు, మీడియా సలహాదారుల అతి జోక్యంతో ఈ ఏడాదికి నూతన అక్రిడిటేషన్ల పక్రియ ఆగిపోయి..గతంలో ఉన్న వాటినే పొడిగించాల్సి వచ్చింది. ఇప్పటికే మూడు నెలల వంతును మూడుసార్లు అక్రిడిటేషన్లను పొడిగించిన అధికారులు...ఇప్పుడు మరో ఆరు నెలలకు మరోసారి పొడిగించారు. మొత్తం మీద..నాలుగుసార్లు ఇప్పటికి పొడిగింపు తంతు జరిగిందన్నమాట. 

ఇది ఇలా ఉంటే...తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ప్రభుత్వం మరోసారి అక్రిడిటేషన్‌ పాలసీని తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో నూతన పాలసీపై అప్పటి ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ వాసుదేవదీక్షితులు, మరి కొందరు జర్నలిస్టు సంఘాల నాయకులు కలసి ఒక పాలసీని రూపొందించారు. టిడిపి హయాంలో నియమించిన సబ్‌కమిటీ రిపోర్టుతోనే తాము నూతన అక్రిడిటేషన్‌ పాలసీని రూపొందించామని సమాచారశాఖ అధికారులు నిన్న మొన్నటి దాకా చెప్పారు. ఆ పాలసీ అత్యంత వివాదాస్పదం కావడం, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పత్రికల గొంతు కోసే విధంగా ఉండడంతో దీనిపై పలు విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా చిన్న పత్రికలకు సంబంధించి 'జిఎస్‌టి, ఎంపానెల్‌మెంట్‌' వివాదాస్పదం అయ్యాయి. అప్పట్లో సబ్‌ కమిటీలో ఉన్న జర్నలిస్టు నాయకులు తాము 'జిఎస్‌టి' గురించి ప్రభుత్వానికి సిఫార్సు చేయలేదని చెప్పినా..ప్రభుత్వం మాత్రం జిఎస్‌టి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనిపై..పలు సంఘాల నాయకులు, జర్నలిస్టులు అప్పటి సబ్‌కమిటీ సభ్యులను నిందించడం, దూషించడం, ఇతరత్రా వ్యాఖ్యానాలు చేశారు. జిఎస్‌టికి తాము ఒప్పుకోలేదని సదరు సబ్‌కమిటీ సభ్యులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా..వీరంతా..వారిపై మాటలతో, దూషణలతో దాడి చేసి..వారి వల్లే ఇలా జరిగిందని ఆడిపోసుకున్నారు. 

గతంలో ఏమి జరిగిందో..మంచో..చెడో జరిగిపోయింది..ఇప్పుడు ప్రభుత్వం ఇటీవల తెచ్చిన అక్రిడిటేషన్‌ పాలసీని రద్దు చేసి, మరో నూతన పాలసీ తేవాలని భావిస్తోంది. ఈ పాలసీలో ఏమేమి నింబంధనలు పెడతారో కానీ...గతంలో సబ్‌కమిటీ సభ్యులను దూషించిన వారు..ఇప్పుడు రాబోయే కమిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పట్లో ఎవరైతే సబ్‌ కమిటీ సభ్యులను వ్యక్తిగతంగా తిట్టారో, దూషించారో.. ఇప్పుడు వారే..ఈ కమిటీలో సభ్యులుగా ఉండి జర్నలిస్టులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే నూతన పాలసీలో జిఎస్‌టి, ఎంపానెల్‌మెంట్‌, ఇతరత్రా సమస్యలు లేకుండా..రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా నిబంధనలు రూపొందించడంలో వీరు తమ సామర్ధ్యాన్ని చూపించాల్సి ఉంటుంది. 

(1245)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ