లేటెస్ట్

సలహాదారుడ్ని సాగనంపుతారా...!?

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తనకు వివిధ రంగాల్లో సలహాలు ఇచ్చేందుకు లెక్కకు మిక్కిలి సలహాదారులను నియమించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత 'జగన్‌'కు సన్నిహితులైన పలువురికి ఈ పోస్టులు దక్కాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు వివిధ రీతుల్లో సహాయం చేసిన వారికి, తన శ్రేయస్సు కోరుకున్నవారికి ఆయన సలహాదారు పోస్టులు ఇచ్చి గౌరవించారు. అయితే ఇటువంటి సలహాదారుల్లో ఇప్పుడో..సలహాదారుడ్ని ఇంటికి పంపబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. తాను ఎంతో గౌరవించి సలహాదారుపోస్టు ఇస్తే...తన మనోభిష్టాన్ని గుర్తించకుండా వ్యవహరిస్తున్నారని, అంతే కాకుండా తన కుటుంబ సభ్యుల మనోభావాలను గుర్తించకుండా వ్యవహరిస్తున్న సలహాదారును సాగనంపాలని నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. తన తండ్రి హయాంలో చక్రం తిప్పి..అప్పట్లో క్యాబినెట్‌ పదవి పొందిన ప్రస్తుత సలహాదారు పనితీరు, ఆయన వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఫిర్యాదులు వెళ్లాయని, దీంతో త్వరలో సదరు సలహాదారును సాగనంపుతారంటున్నారు.

ఒకప్పుడు వై.ఎస్‌ కుటుంబం నడిపిస్తోన్న పత్రికలో పనిచేసిన సదరు వ్యక్తిని తరువాత సలహాదారుగా తీసుకున్నారు. ఆంధ్రాతో సంబంధం లేకపోయినా పిలిచి పెద్దపీట వేస్తే...ప్రభుత్వానికి మైలేజ్‌ తీసుకురాకుండా మీడియా రంగంలో చిచ్చుపెడుతున్నారని, తమ పత్రికలో పనిచేసే వారితో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారనే అభియోగాలు సదరు సలహాదారుపై వచ్చాయి. 'జగన్‌' పత్రికలో కీలకంగా పనిచేసే సీనియర్‌ జర్నలిస్టుకు, సదరు సలహాదారుకు మధ్య నెలకొన్న విభేదాలు..చివరికి ఆయన పదవికి ఎసరు పెట్టబోతున్నాయంటున్నారు. 'జగన్‌' పత్రికలో కీలకంగా పనిచేసే జర్నలిస్టును ఇటీవల మీడియా ప్రభుత్వం నియమించిన మీడియా అక్రిడిటేషన్‌ కమిటీలోకి రావాలని భావించారు. అంతకు ముందు సదరు జర్నలిస్టు మీడియా అక్రిడిటేషన్‌ పాలసీ తీసుకు రావడంలో కూడా కీలకంగా వ్యహరించారు. దీంతో ఇటీవల నియమించిన మీడియా కమిటీలో తన పేరు ఖచ్చితంగా ఉంటుందని సదరు జర్నలిస్టు భావించారు. ఆయన ఆశించినట్లే...ఆయన పేరు మీడియా కమిటీలో ఆఖరు వరకు ఉంది. అయితే అప్పుడే సదరు సలహాదారు సీన్‌లోకి ఎంటర్‌ అయి సీనియర్‌ జర్నలిస్టు పేరును ఆ లిస్టులోంచి తీసేసి తనకు ఇష్టులైన ముగ్గురికి మీడియా కమిటీలో స్థానం కల్పింప చేసుకున్నారు. దీంతో సదరు సీనియర్‌ జర్నలిస్టు ఆగ్రహించారు. తన పేరే సలహాదారు అక్రిడిటేషన్‌ కమిటీ నుంచి తీసివేయిస్తారా..? ఆయన సంగతి తేలుస్తానంటూ..మీడియా కమిటీలో టిడిపి సానుభూతిపరులు ఉన్నారని సిఎంతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై సిఎం జోక్యం చేసుకుని ప్రస్తుతానికి నూతన అక్రిడిటేషన్లు అవసరం లేదని పాతవాటినే పొడిగించాలని సమాచారశాఖ కమీషనర్‌కు సూచించారు. దీంతో నూతన అక్రిడిటేషన్లు వస్తాయని భావించిన జర్నలిస్టులకు నిరాశ ఎదురైంది. 

ఇదంతా జరిగిపోయిన వ్యవహారం అయినా..ప్రస్తుతం..ఆ సలహాదారునిపై వేటు వేయించాలనే లక్ష్యంతో సదరు సీనియర్‌ జర్నలిస్టు అవిశ్రాంతంగా పోరాడుతున్నారని ప్రచారం జరుగుతోంది. తనపై అనవసరంగా సదరు సలహాదారు కయ్యానికి కాలు దువ్వారని, తన సత్తా ఏమిటో చూపిస్తానంటూ..ఆయన ఎక్కడ చక్రం తిప్పాలో అక్కడ తిప్పుతున్నారు. సిఎం కుటుంబ సభ్యులకు విషయం వివరించడంతో పాటు...ఆయన వల్ల ప్రభుత్వానికి ఒరిగిన మేలు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారట. సలహాదారు వల్ల ముఖ్యమంత్రికి ఢిల్లీలో పదే పదే అవమానాలు ఎదురవుతున్నాయని, జాతీయ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నా...సలహాదారు చేసిందేమిటో తెలియడం లేదని, ఇటువంటి వారి వల్ల 'జగన్‌'కు మరిన్ని ఇబ్బందులు వస్తాయని...ఆయనను తొలగించి వేరే వారికి ఆ స్థానంలో చోటు కల్పించాలని ఆయన సూచిస్తున్నారట. మొత్తం మీద..సదరు సలహాదారు పదవికి 'జగన్‌' మీడియాలో పనిచేసే సీనియర్‌ జర్నలిస్టు ఎసరు పెట్టారని అంటున్నారు. చూద్దాం..ఏమి జరుగుతుందో..?

(693)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ