లేటెస్ట్

ఎమ్మెల్సీలకు టిడిపి ప్యాకేజీ ఇది...మరి వైకాపా ప్యాకేజీ ఏమిటో..?

అనుకున్నట్లే 'శాసనమండలి'ని అధికార వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రోజు అసెంబ్లీలో 'మండలి రద్దు' కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టి 'రద్దు' తీర్మానానికి మమ అనిపించారు. ముందు నుంచి అందరూ ఊహిస్తున్నదే కనుక..దీనిపై ఎవరికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అయితే 'మండలి రద్దు' వల్ల ఎవరికి నష్టం..? ఎవరికి లాభం అనే దానిపై అన్ని పార్టీల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైకాపా, ప్రతిపక్ష టిడిపిలో దీనిపై సుధీర్ఘంగా చర్చించుకుంటున్నారు. అసెంబ్లీలో తాము ప్రతిపాదించి ఆమోదించిన 'బిల్లు'లను 'శాసనమండలి'లో అడ్డుపడతారా..? మీ సంగతి తేలుస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి హూంకరించి 'మండలి' ఉసురు తీశారు. అయితే ఈ రద్దు వల్ల తన పార్టీ వారికి నష్టం జరుగుతున్నా ఆయన ముందుకే వెళ్లారు. ముందుగా తన మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులు తమ పదవులు పోగొట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన 'మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌'లను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసి వారికి 'జగన్‌' మంత్రి పదవులు కట్టబెట్టారు. తనకు అత్యంత నమ్మకస్తులు, విధేయులైన వీరిద్దరికే ఇప్పుడు తొలి నష్టం జరగబోతోంది. వీరి తరువాత..మండలిలో వైకాపా తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న  ఎమ్మెల్సీలకు నష్టం కల్గుతుంది. వీరు కాకుండా గత ఎన్నికల సమయంలో పలువురు నియోజకవర్గ నాయకులకు ఎమ్మెల్సీలు ఇస్తామని, పార్టీ అభ్యర్థికి సహకరించాలని చాలా మంది నాయకులకు 'జగన్‌' హామీ ఇచ్చారు. ఇప్పుడు మండలి రద్దుతో వీరంతా అవాక్కు అవుతున్నారు. చాలా మంది నాయకుల సంగతేమో కానీ...'చిలకలూరిపేట' మాజీ ఎమ్మెల్యే 'మర్రి రాజశేఖర్‌'కు మాత్రం మండలి రద్దు వల్ల తీవ్రమైన అన్యాయం జరగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయనకు టిక్కెట్‌ ఇవ్వకుండా ప్రస్తుత ఎమ్మెల్యే 'రజనీ'కి టిక్కెట్‌ ఇవ్వగా..'మర్రి'కి తాను అన్యాయం చేయనని, ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీంతో 'జగన్‌' గెలవడంతోనే తనకు మంత్రి పదవి వస్తుందని భావించిన 'మర్రి' తాజా పరిణామాలతో దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయనే కాకుండా చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు, నియోజకవర్గ నాయకులు ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకోగా..వారి ఆశలు ఆడియాశలు అవబోతున్నాయి. 

ఇది ఇలా ఉంటే 'మండలి'ని 'జగన్‌' రద్దు చేస్తే...తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు పార్టీ అండగా ఉంటుందని టిడిపి అధ్యక్షుడు 'చంద్రబాబునాయుడు' ఇప్పటికే వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి వచ్చే జీతాన్ని పార్టీ చెల్లిస్తుందని, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీలకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే కాకుండా తమ పార్టీ అధికారంలోకి వస్తే..'మండలి'ని పునరుద్ధరిస్తామని కూడా ఆయన చెబుతున్నారు. ఎమ్మెల్సీలకు ఏ అవసరం ఉన్నా..తన వద్దకు రావచ్చునని..వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీలకు వచ్చే జీతం చెల్లించడం, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడంతో పాటు ఇతర విధాలుగా సహాయం చేస్తానని 'చంద్రబాబు' వారికి ప్యాకేజీ ప్రకటించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా..టిడిపిలో ఇటువంటి ఏర్పాట్లను చూసిన వైకాపా ఎమ్మెల్సీలు తమకు కూడా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇటువంటి ప్యాకేజీ ఇస్తారేమోనని ఆశపడుతున్నారు. వారి వలే జీతం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారేమో చూడాలనే భావన వారిలో ఉంది. అయితే వైకాపా వర్గాలు ప్యాకేజీ ప్రసక్తే లేదని, త్వరలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయబోతున్నారని, వీటి ద్వారా ఎమ్మెల్సీ పదవులను కోల్పోయిన వారికి న్యాయం చేస్తారని చెబుతున్నారు. ఐదు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేస్తారని, వాటికి ఛైర్మన్లుగా ఎమ్మెల్సీ పదవులు కోల్పోయిన వారిని ఎంపిక చేస్తారని, వీరందరికి క్యాబినెట్‌ ర్యాంక్‌ ఇస్తారంటున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవులు కోల్పోయిన వారికి న్యాయం జరుగుతుందంటున్నారు. 

పాపం...బిజెపి, కమ్యూనిస్టులు...!

మండలి రద్దుతో..బిజెపి, కమ్యూనిస్టు పార్టీలు శాసనవ్యవస్థలో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. బిజెపికి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండగా, కమ్యూనిస్టులకు ఐదుగురు ఉన్నారు. వీరందరూ మండలి రద్దుతో నిరుద్యోగులు కాబోతున్నారు. మిగతా స్వతంత్య్ర సభ్యులు, నామినేటెడ్‌ సభ్యులు తాజా ప్రభుత్వ నిర్ణయంతో నిరాశ చెందారు. కాగా బిజెపికి చెందిన సభ్యులు మండలి రద్దు కాదని భరోసాతో ఉన్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో...?

(832)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ