లేటెస్ట్

‘కేజ్రీ’ దెబ్బకు ‘జగన్‌’కు ‘మోడీ’ అపాయింట్‌మెంట్‌...!

‘ఢిల్లీ’ అసెంబ్లీ ఎన్నికల్లో ‘కేజ్రీవాల్‌’ ఘన విజయం అందరూ ఊహించిందే. ఎన్నికలు ముగిసిన తరువాత విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌ అన్ని కూడా ‘కేజ్రీ’ గెలుస్తాడనే చెప్పాయి. అయితే కొందరిలో ఏదో మూల‌..ఏదో శంక...! బిజెపి పెద్దలు ఏమి చేస్తారో..? ఎటువంటి వ్యూహం అమలు చేశారో..వారు హిందూత్వను రెచ్చగొట్టి లాభపడతారేమో...? ఇవిఎంల‌ను మేనేజ్‌ చేస్తారేమో..? ఆఖరు నిమిషంలో కేంద్ర హోంమంత్రి ‘అమిత్‌షా’ తామే గెలుస్తున్నామని చేసిన ప్రకటన ‘కేజ్రీ’ అభిమానుల్లో ఆందోళన కల్గించింది. అయితే వారి అనుమానాల‌ను పటాపంచులు చేస్తూ..ఈ రోజు వచ్చిన ఫలితాలు..వారిని సంతృప్తి పరిచాయి. వరుసగా మూడోసారి ‘కేజ్రీ’ ‘ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి మ‌రోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ‘కేజ్రీవాల్‌’ గెలుపు ఆయన చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల‌కు ఫలిత‌మ‌ని, ‘ఢిల్లీ ఓటర్లు తెలివిగా ఓటు వేశారని, బావోద్వేగాల‌ విషయంలో ఆచితూచి స్పందించారని, తమకు ఎవరు మేలు చేస్తున్నారో తెలుసుకుని ఓటు వేశారని, ఇది అభివృద్ధికి, సంక్షేమానికి వేసిన ఓటుగా విశ్లేషకలు భావిస్తున్నారు. ‘కేజ్రీ’ గెలుపుతో ప్రాంతీయ పార్టీల్లో ఉత్సాహం నెల‌కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ‘కేజ్రీ’ గెలుపును తమ గెలుపుగా భావిస్తుండగా..ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అధికార వైకాపా ‘కేజ్రీ’ గెలుపుతో సంబరాలు చేసుకుంటోంది. ‘ఢిల్లీ’ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆమ్‌ఆద్మీ’ గెలుపు వ‌ల్ల‌ తమకు లాభం కలుగుతుందని, రాబోయే రోజుల్లో ‘బిజెపి’ తమ పట్ల ఉదారంగా వ్యవహరించబోతోందని ఆనందపడుతోంది. ‘ఢిల్లీ ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ల‌భించడంతో వారి ఆనందం మరింత రెట్టింపైంది. గత కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌కు ప్రధాని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ నిరాకరిస్తున్నారు. తమకు నచ్చని విధానాల‌ను ‘జగన్‌’ చేపడుతున్నారని, ఆయన విధానాల‌పై వారిద్దరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అందుకే వారు ‘జగన్‌’కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగినట్లే ‘జగన్‌’కు మూడుసార్లు ‘ఢిల్లీ వెళ్లినా వారిద్దరి దర్శనం ఆయనకు కాలేదు. అయితే ఇప్పుడు‘ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వచ్చిన వెంటనే ‘ముఖ్యమంత్రి’ ‘జగన్‌’ను ‘ఢిల్లీకి రమ్మని ఆహ్వానం రావడంతో..‘ఢిల్లీ ఫలితాలు బిజెపిపై ప్రభావం చూపిస్తున్నాయనే భావన ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది.

‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ‘జగన్‌’ అపాయింట్‌మెంట్‌ ఖరారు కావడం యాధృచకమా..? లేక ఒక వ్యూహం ప్రకారం వైకాపా అధినేతను ‘ఢల్లీి’కి పిలిపించారా..? అనేదానిపై రాజకీయ వర్గాల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘జగన్‌’కు ‘మోడీ’ అపాయింట్ ల‌భించడం వెనుక ‘బిజెపి’  వ్యూహం ఉందని, ఆయనను మచ్చిక చేసుకునేందుకే హడావుడిగా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓడిపోయిన ‘బిజెపి’కి తాజా పరాజయం తీవ్రమైన ఎదురుదెబ్బ అని, ఇప్పటికే ఎన్‌డిఎలో ఉన్న మిత్రులందరినీ ఏదో ఒక నెపంతో బయటకు నెట్టేసిన ‘బిజెపి’కి రాబోయే కాలంలో మిత్రులు దొరికే పరిస్థితి లేదని, అందుకే ‘జగన్‌’ను దువ్వుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లోక్‌సభలో నాల్గ‌వ‌ అతిపెద్దపార్టీగా ఉన్న ‘వైకాపా’ను దరి చేర్చుకునే వ్యూహం బిజెపి పెద్దల్లో ఉందంటున్నారు. ఇప్పటికే రాజ్యసభలో మెజార్టీ లేక బిజెపి తిప్ప‌లు పడుతోంది. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైకాపా బలం ఆరుకు చేరుతుంది. దీంతో..రాజ్యసభలో అవసరమైనప్పుడు వైకాపా మద్దతు తీసుకునేందుకు వారిని దగ్గరకు తీయాల‌నే ఆలోచనే దీనిలో ఉందని, అందుకే ‘వైకాపా’ను జారిపోనీయకుండా చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా..‘మోడీ’ అపాయింట్‌మెంట్‌ సందర్భంగా ‘జగన్‌’ తాను ఎదుర్కొంటున్న సమస్యల‌కు పరిష్కారాన్ని పొందబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానుల‌ విషయం, శాసనమండలి రద్దు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి బడ్జెట్‌లో మొండి చేయి చూపడంతో పాటు, తన ఆగర్భ శత్రువు ‘చంద్రబాబు’ను జైలుకు పంపించడానికి అవసరమైన ప్రణాళిక గురించి ‘మోడీ’తో చర్చిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద...‘ఢిల్లీలో ‘కేజ్రీ’ గెలిస్తే..‘ఆంధ్రా’లో ఉన్న ‘జగన్‌’కు లాటరీ తగిలిందని రాజకీయ పరిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. 

(962)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ