కేంద్ర ప్యాకేజీ పచ్చి దగా, మోసం: కెసిఆర్

‘కరోనా’ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ పచ్చి దగా, మోసమని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ఫెడరల్ వ్యవస్థల్లో రాష్ట్రాల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వల్ల కేంద్రం తన పరువు తానే తీసుకుందని, రాబోయే రోజుల్లో ఈ ప్యాకేజీ ఎంత బోగసో ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. రాష్ట్రాలపై ఈ రకమైన పెత్తనం చెలాయించడం ఫెడరల్ వ్యవస్థకు నష్టమని, కేంద్రం చాలా దారుణంగా వ్యవహరిస్తుందని, విపత్కర పరిస్థితుల్లో ఇటువంటి షరతులు పెడతారా..? అని ఆయన ప్రశ్నించారు. సంస్కరణలు అమలు చేస్తేనే ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచుతామని చెప్పడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతుల్లో మూడు విషయాల్లో తాము ముందున్నామని, పదిహేనవ ఆర్థిక సంఘం చెప్పిన సంస్కరణల్ని ఏ రాష్ట్రామైతే అమలు చేస్తుందో వాటికే నిధులు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. వన్ నేషన్-వన్ రేషన్‌కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాల క్రమబద్ధీకరణ వంటి విషయాల్లో ముందున్నామని, విద్యుత్ సంస్కరణల విషయంలో మాత్రం తాము కేంద్రం చేసేది చూస్తూ ఊరుకోమని తెలిపారు. దీని వల్ల రాష్ట్రానికి రెండు వేల కోట్ల నిధులు రావంటున్నారని, ఆ ముష్టిని తీసుకోమని ఆయన తేల్చి చెప్పారు.
కంటైన్మెంట్ ఏరియాలు తప్ప అన్నీ గ్రీన్ జోన్లే
రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. తెంగాణలో 31వరకు లాక్డౌన్ కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ ఏరియాలో ఉన్నాయని తెలిపారు. కంటైన్మెంట్ ఏరియాలో ప్రభావం ఉన్న పరిసరాల్లోనే లాక్డౌన్ అమలులో ఉంటుంది. పూర్తిగా పోలీసు పహారాలోనే కంటైన్మెంట్ ఏరియాలో ఉంటుంది. కరోనాకు వ్యాక్సిన్ రేపో మాపో వచ్చే పరిస్థితి లేదని ప్రపంచం అంగీకరించిందని, కరోనాతో కలసి జీవించడం నేర్చుకోవాలని బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకుపోవాలని ఆయన చెప్పారు.
రేపు ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. రేపు ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని తెలిపారు. అయితే హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు నడవవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇస్తున్నాం. ఆటోలో డ్రైవర్ +2 టాక్సీలో డ్రైవర్ +3 నియమం పాటించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చుని, ఈ కామర్స్‌లను అనుమతిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాయాలు జాగ్రత్తలు తీసుకుని, వంద శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. పరిశ్రమలు వందశాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చని కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.