లేటెస్ట్

‘అమరావతి’పై ‘డొక్కా’కు ‘జగన్‌’ హామీ ఇచ్చారా..?

ఆరేడు నెల‌ల క్రితం మూడు రాజధానుల‌ ప్రస్తావన వచ్చినప్పుడు..రాజధాని ‘అమరావతి’ తరలిపోతుందని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినప్పుడు టిడిపి ఎమ్మెల్సీగా ఉన్న ‘డొక్కా మాణిక్యవరప్రసాద్‌’ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు ‘చంద్రబాబునాయుడు’ను ఉద్దేశించిన  రాసిన రాజీనామా లేఖలో ‘రాజధాని అమరావతి’ తరలిపోతుందని, దాని కోసమే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనని పేర్కొన్నారు. అయితే తరువాత..మూడు రాజధానుల‌ ప్రకటన చేసిన వైకాపాలోనే ఆయన చేరిపోయారు. సరే..రాజకీయ నాయకుడిగా ఆయన ఏ పార్టీలో చేరినా అభ్యంతరాలేమీ ఉండవు కానీ...అప్పుడు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన ఇప్పుడు మళ్లీ అదే ఎమ్మెల్సీకీ పోటీపడుతుండడంపై పలువురిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. నాడు రాజధాని తరలింపుకు తాను వ్యతిరేకమన్న ‘డొక్కా’కు ఇప్పుడు రాజధాని తరలిపోదని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారా..? అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా..? అనే మాటలు పలువురు నుంచి వ్యక్తం అవుతున్నాయి. మూడు రాజధానులు ఉంటాయని, స‌చివాల‌యం విశాఖ‌కు వెళుతుంద‌ని ఇటీవల‌ గవర్నర్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పిన విషయం ‘డొక్కా’కు తెలియదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. మూడు నెల‌ల క్రితం..రాజధాని కోసం రాజీనామా అన్న నేత...నేడు ఏమి మారిందని, అంతలోనే మళ్లీ ఎన్నికల‌కు సిద్ధం అవుతున్నారన్న ప్రశ్నను వారు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద..‘డొక్కా’ రాజీనామా చేసినప్పుడు చెప్పిన మాటలు ఆయనకు గుర్తు లేవేమో కానీ...ప్రజల‌కు గుర్తు ఉన్నాయని ప్రతిపక్షనేతలు అంటున్నారు. కాగా..మరోవైపు..శాసనమండలిని రద్దు చేయాల‌ని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిందని, ఏ నిమిషంలోనైనా..రద్దు ప్రకటన రావచ్చుని, తుమ్మిదే ఊడిపోయే ముక్కువంటి పదవి కోసం ‘డొక్కా’ వంటి సీనియర్‌ ప్రయత్నించడం ఏమిటనే మాట కూడా వినిపిస్తోంది. ఒక వైపు..శాసనమండలి రద్దు చేయాల‌ని కోరుతూనే మరో వైపు ఉప ఎన్నికల్లో వైకాపా పోటీ చేయడం నైతికంగా సరికాదని పలువురు రాజకీయ పరిశీకులు పేర్కొంటున్నారు.

(514)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ