లేటెస్ట్

బిజెపిలో ‘రఘురామ’ చిచ్చు...!

వైకాపా అసంతృప్తి ఎంపీ ‘రఘురామకృష్ణంరాజు’ వ్యవహారం రోజు రోజుకు విస్తరిస్తోంది. స్వంత పార్టీపై అసమత్మతి స్వరాన్ని వినిపిస్తోన్న ఆయన ప్రభావం ఇతర పార్టీల‌పైనా పడుతోంది. ముఖ్యంగా ఆంధ్రాలో ఒక్కసారిగా వెలిగిపోదామనుకుంటున్న ‘బిజెపి’పై ఆయన ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఈ పార్టీలో ఆయన వ్యవహారంపై నాయ‌కులు  ఎప్పటి వలే రెండు పక్షాలుగా చీలిపోయి వాదులాడుకుంటున్నారు. ఒక వర్గం వైకాపాను సమర్థించే విధంగా మాట్లాడుతుండగా, మరో వర్గం ‘రఘు’కు మద్దతుగా మాట్లాడుతోంది. పైకి మాత్రం అది ‘రఘురామరాజు’కు వైకాపాకు మధ్య అంతర్గత వ్యవహారమని, ఆ పార్టీ అంతర్గత వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని చెబుతున్నా...రెండు వాదల‌ను మాత్రం వినిపిస్తున్నారు. 

ఒక వర్గం పూర్తిగా వైకాపా పెద్దల‌కు అండగా మాట్లాడుతుంటే మరో వర్గం ‘రఘు’కు మద్దతు ఇస్తోంది. ఈ మేరకు అంతర్గగతంగానూ, బహిరంగంగానూ తమ వాదనల‌ను వినిపిస్తున్నారు. ‘ఆంధ్రా’కు చెందిన కొందరు నేతలు ఈ వ్యవహారంలో బిజెపి పెద్దల‌ ప్రమేయం లేదని, ‘రఘు’కు బిజెపి మద్దతు లేదని చెబుతూ పరోక్షంగా వైకాపాను సమర్థిస్తున్నారు. అంతే కాకుండా ‘రఘురామకృష్ణంరాజు’పై వేటు పడుతుందని, బీహార్‌కు చెందిన ‘శరత్‌యాదవ్‌’ వలే ఈయనపై కూడా ఆటోమేటిక్‌గా అనర్హత వేటు పడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.  కాగా కేంద్ర నాయకత్వంలో కీల‌కంగా వ్యవహరించే ‘రఘు’ మాత్రం ‘రఘురామకృష్ణం రాజు’ వ్యవహారంలో కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. టీవీ ఛానెల్స్‌ చర్చలో ఆయన మాట్లాడుతూ ‘రఘు’ వ్యవహారంలో కుట్ర జరుగుతోందని, తనకు ఈ విషయంలో 80శాతం ఆధారాలు ఉన్నాయని, కానీ వాటిని ఇప్పుడే బయటపెట్టనని, మిగతా ఆధారాలు ల‌భించిన తరువాత...కుట్రదారుల‌ వివరాల‌ను బయటపెడతానని పదే పదే చెప్పుకుంటున్నారు. ఆయన వ్యాఖ్యలు టిడిపిని ఉద్దేశించి చేసినవే మాట ఆ పార్టీలోని మరో వర్గం వ్యక్తం చేస్తోంది. ‘రఘురామకృష్ణంరాజు’ వెనుక టిడిపి అధినేత ‘చంద్రబాబు’ ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల‌కు కొనసాగింపుగా ఈ కుట్ర ఆరోపణలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. 

‘సత్య’ మద్దతు ‘రఘురామరాజు’కే...!

వైకాపా రెబల్‌ ఎంపీ ‘రఘురామకృష్ణంరాజు’కు బిజెపి జాతీయ కార్యదర్శి ‘సత్యకుమార్‌’ బహిరంగ మద్దతు తెలిపారు. ఆయనకు బిజెపి మద్దతు ఉందని, ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ప్రజా సమస్యలు, అవినీతి గురించి మాట్లాడితే తప్పేముందని, ‘రఘురామ’పై స్పీకర్‌ అనర్హత వేటు వేయరన్నారు. వైకాపా అధిష్టానంపై కానీ, పార్టీపై కానీ ‘రఘురామ’ విమర్శలు, ఆరోపణలు చేయలేదని అలాంటప్పుడు ‘బీహార్‌’ ఉదంతం ఇక్కడ వర్తించదని తేల్చి చెప్పారు. మరో వైపు తమ అధిష్టానమే ఆయనను పార్లమెంటరీ పార్టీ కమిటీకి ఛైర్మన్‌గా నియమించిందని, వైకాపా వ‌ల్ల ఆయ‌న‌కు ప‌ద‌వి దక్క‌లేద‌ని చెబుతున్నారు. ఒక వైపు బిజెపిలో కొంత మంది ‘రఘు’ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని పేర్కొంటుండగా, మరి కొందరు మాత్రం ‘రఘు’ వ్యవహారంలో తప్పులేదని చెబుతూ ఆయనకు మద్దతు ఇస్తోన్నారు. కాగా ఒకప్పుడు ‘వెంకయ్యనాయుడు’ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ‘సత్య’ (సత్యకుమార్‌) చేసిన వ్యాఖ్యల‌తో బిజెపి ఈ విషయంలో రెండు వర్గాలుగా చీలిపోయింద‌నే మాట సర్వత్రా వినిపిస్తోంది.

(916)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ