లేటెస్ట్

‘బిజెపి’ అంటే ‘వైకాపా’కు భయమా..!?

రాష్ట్రంలో తమ ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేస్తే...వారూ వీరని చూడకుండా పదే పదే విమర్శలు చేసే అధికార వైకాపా పార్టీ ‘బిజెపి’పై విమర్శలు చేయాలంటే మాత్రం వణికిపోతోంది. ‘బిజెపి’ నుంచి ఘాటైన విమర్శలు, ఆరోపణలు వచ్చినా..ఆ పార్టీ మాత్రం వారిపై ప్రతివిమర్శలు చేయడానికి కానీ, కనీసం కౌంటర్‌ ఇవ్వడానికి కానీ సాహసించడం లేదు. గతంలో బిజెపి జాతీయ కార్యదర్శి ‘రామ్‌మాధవ్‌’ వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా..వైకాపా నేతలెవరూ స్పందించలేదు. రాష్ట్ర ప్రజల‌ పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడిపోయినట్లుందని, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతిలో కూరుకుపోయారనే విమర్శలు చేసినా...వైకాపా నేతలు దానికి కౌంటర్‌ ఇవ్వలేదు. ఒకసారి కాదు..ప్రతిసారీ ఆయన ఘాటుగా ఆరోపణలు చేస్తున్నా స్పందించడం లేదు. ఆయనే కాదు..తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి ‘నిర్మలాసీతారామన్‌’ కూడా వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి విద్యుత్‌ యూనిట్‌ను రెండు రూపాయల‌కు కొనుగోలు చేసి ప్రజల‌కు తొమ్మిది రూపాయల‌కు అమ్ముతున్నారని, రాష్ట్రంలో కుటుంబపాల‌న జరుగుతోందని, అవినీతి పెచ్చుమీరిపోయిందని ఘాటుగా విమర్శలు కురిపించారు. ఆమె విమర్శల‌పై సీనియర్‌ మంత్రులు కానీ, పార్టీ నాయకులు కానీ ఎవరూ స్పందించలేదు. చివరకు ప్రభుత్వ సల‌హాదారు ‘కల్లాం’తో సమాధానం ఇప్పించి మమ అనిపించారు. ఆయన ప్రభుత్వ తరుపున వివరణ ఇచ్చి సరిపుచ్చారు. ఆమె చేస్తోన్న ఆరోపణలు నిజమని కానీ, లేదని కాని చెప్పలేదు. చివరకు విద్యుత్‌ అంశం కేంద్ర పరిధిలోకి వెళుతుందని వార్తలు వస్తున్నాయని చెప్పగా, వాళ్ల పరిధిలోకి తీసుకుంటే తాము స్వాగతిస్తామని ప్రకటించారు. ఒకవైపు తెంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాష్ట్ర పరిధిలో ఉన్న విద్యుత్‌ను కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నిస్తూ, అలా కేంద్రం తీసుకుంటే తాము వ్యతిరేకిస్తామని చెబుతుండగా, ఇక్కడ మాత్రం స్వాగతిస్తున్నామని చెప్పడం గమనార్హం. బిజెపి కేంద్ర నాయకుల‌ను కానీ, కేంద్ర మంత్రుల‌ను కానీ విమర్శిస్తే..లేనిపోని తల‌నొప్పులు వస్తాయనే భయంతోనే వైకాపా వారి విమర్శల‌కు, ఆరోపణల‌కు ప్రతిస్పందించడం లేదని విశ్లేషకుల‌తో పాటు, ఆ పార్టీకి చెందిన వారే చెబుతున్నారు.

‘పవన్‌’పై దండెత్తిన ‘అంబటి’...!

కాగా ‘కాపుల‌కు’ సంబందించిన రిజర్వేషన్ల అంశంపై జనసేన అధినేత ‘పవన్‌కళ్యాణ్‌’ ఒక ప్రెస్‌నోట్‌ విడుదల‌ చేసిన వెంటనే అదే సామాజికవర్గానికి చెందిన ‘అంబటి రాంబాబు’ ఆగమేఘాల‌పై మీడియా సమావేశం పెట్టి ‘పవన్‌’పై విమర్శలు కురిపించారు. మంత్రి ‘కన్నబాబు’ కూడా దీనిపై విమర్శలు చేశారు. టిడిపి కానీ, జనసేన కానీ, ఇతర పార్టీలు ఏవైనా కానీ...అధికారపార్టీపై విమర్శలు, ఆరోపణలు చేస్తే..క్షణాల్లో ప్రతిస్పందిస్తూ, ఘాటైన విమర్శలు చేసే ‘వైకాపా’ నాయకులు..అదే వేగాన్ని ‘బిజెపి’పై ఎందుకు చూపడం లేదని, వారిపై విమర్శలు, ఆరోపణలు చేయవద్దని అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలే దీనికి కారణమని చెబుతున్నారు.

(289)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ