లేటెస్ట్

‘నిర్మల‌మ్మా’...వారిని నమ్మవద్దు...!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఇటీవల‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కేంద్ర ఆర్థికమంత్రి ‘నిర్మలాసీతారామన్‌’కు వైకాపా పార్ల‌మెంట్ ప‌క్ష‌నేత ఓ  లేఖ రాశారు. తమ ప్రత్యర్థులు చెబుతోన్న అవాస్తవాల‌ను నమ్మి తమపై ఆరోపణలు చేయవద్దని, గతంలో టిడిపిలో ఉండి ఇప్పుడు బిజెపిలో చేరిన వారి మాటల‌ను నమ్మవద్దని, వారు అసత్యాల‌ను ప్రచారం చేస్తున్నారని, వారు చెప్పిన మాటల‌ను నమ్మి అనవసరంగా ‘జగన్‌’ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేయడం సరికాదని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత ‘మిధున్‌రెడ్డి’ ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల‌ బిజెపి నిర్వహించిన ర్యాలీలో ‘నిర్మలాసీతారామన్‌’ మాట్లాడుతూ అధికార వైకాపా ప్రభుత్వం విద్యుత్‌ను కేంద్రం వద్ద నుంచి యూనిట్‌కు రూ.2కొనుగోలు చేసి..ఇక్కడ రూ.9/-ల‌కు అమ్ముతున్నారని, ప్రజల‌ను దోచుకుంటున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం పేదల‌ పక్షాన పనిచేయడంలేదని, ప్రజల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యల‌పై అప్పట్లో వైకాపా నేతలెవరూ స్పందించలేదు. ప్రభుత్వ సల‌హాదారు ‘అజేయ క‌ల్లంరెడ్డి’ ఆమె వ్యాఖ్యల‌కు వివరణ ఇచ్చి సరిపెట్టారు. అయితే తాజాగా ఇప్పుడు ‘పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి’ ఆమెకు లేఖ రాశారు. టిడిపి నుంచి బిజెపిలో చేరిన నేతలు ఆమెకు తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆ సమాచారాన్ని ఆధారం చేసుకుని విమర్శలు, ఆరోపణలు చేయవద్దని ఆమెకు విన్నవించారు. టిడిపిలో చేరిన ప్రస్తుత బిజెపి నేతలు గతంలో బిజెపిని ఘోరంగా విమర్శించారని, టిడిపి ఓడిపోయిన తరువాత స్వలాభం కోసం బిజెపిలో చేరారని, అటువంటి వారి మాటలు విని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ‘చంద్రబాబు’ ప్రభుత్వం విద్యుత్‌రంగాన్ని సంక్షోభంలోకి నెడితే, జగన్‌ ప్రభుత్వం దాన్ని దారిలో పెట్టడానికి శ్రమిస్తోందని, ఇప్పటికే విద్యుత్‌పై రూ.17వేల‌ కోట్లను ఖర్చు చేశామని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలు కావాలంటే తమను అడగాని, బిజెపిలో చేరిన టిడిపి నేతలు ఇచ్చే సమాచారం ఆధారంగా విమర్శలు చేయవద్దని ఆమెను ఆయన కోరారు. కాగా ‘నిర్మలాసీతారామన్‌’ ఆరోపణలు చేసిన పక్షం రోజుల‌ తరువాత లేఖ రాస్తే ఉపయోగమేమిటని కొందరు వైకాపా నేతలు ప్రశ్నించుకుంటున్నారు. ఆమె చేసిన విమర్శలు ప్రజల్లోకి వెళ్లాయని, ఇప్పుడు లేఖ రాయడం తూతూ మంత్రమేనన్న మాటలు వారి నుంచి వినిపిస్తున్నాయి. 

(301)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ