లేటెస్ట్

వెంటిలేటర్ల కొనుగోలులో అవినీతి...!

ఒక వైపు ‘కరోనా’ మహమ్మారి ప్రజల‌కు మరణశాసనం రాస్తుంటే...వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు అదను చూసుకుని అవినీతికి పాల్ప‌డుతున్నాయి. ప్రజలు మరణ యాతన పడుతుంటే అధికార నాయకుల‌ కాసుల‌ కోసం కక్కుర్తి పడుతున్నారు. ఇదని కాదు..అదని కాదు..దొరికిన ప్రతి దాంట్లో అవినీతి  చేస్తోన్న నాయకులు తాజాగా ‘కరోనా’ మహమ్మారిని కూడా తమ సంపాదన కోసం వాడుకుంటున్నారు. ‘కరోనా’ రోగుల‌కు అత్యవసరమైన ‘వెంటిలేటర్ల’ కొనుగోలులో కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ‘సిద్దిరామయ్య’ ఆరోపించారు. అధికార బిజెపి ప్రభుత్వం వెంటిలేటర్ల కొనుగోలులో రూ.2వేల‌ కోట్ల అవినీతి చేసిందని, దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాల‌ని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా ‘సిద్ది రామయ్య’ ఆరోపణలు నిరాధారమని అధికార బిజెపి పెద్దలు కొట్టేశారు. తాము వెంటిలేటర్ల కొనుగోలుకు కేవలం రూ.500/-కోట్లు మాత్రమే ఖర్చు చేశామని రెండు వేల‌ కోట్ల కుంభకోణానికి ఆస్కారమే లేదని మంత్రులు చెబుతున్నారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాత్రం దీనిపై మండిపడుతోంది. ప్రభుత్వం మెడికల్‌ పరికరాల‌ కోసం మొత్తం రూ.4,100/-కోట్లు ఖర్చు చేసిందని, దీనిలో రెండు వేల‌ కోట్లు అధికారపార్టీ నేత జేబుల్లోకి వెళ్లాయని ఆరోపిస్తోంది. దీనిపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. తమిళనాడు నుంచి ప్రభుత్వం వెంటిలేటర్స్‌ను అధిక రేట్లకు కొనుగోలు చేసిందని, కర్ణాటకలో తక్కువ ధరకు వెంటిలేటర్లు వస్తున్నా..తమిళనాడు నుంచి ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నిస్తోంది.

‘‘వెంటిలేటర్లు , పీపీఇ కిట్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్స్‌’ను అధిక ధరకు కొనుగోలు చేసినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, వారు మెడికల్‌ పరికరాల‌ కోసం రూ.324కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు కానీ వారు రూ.4వేల‌ కోట్లు ఖర్చు చేశారు. దీనిలో సగానికి పైగా మంత్రుల‌ జేబులోకి వెళ్లాయి. దీనిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాల‌ని ప్రతిపక్షనేత ‘సిద్ది రామయ్య’ డిమాండ్‌ చేశారు. బృహత్‌ బెంగుళూరు మహానగర్‌ పల్లెకు మరియు లోకల్‌ బాడీ సంస్థల‌ నుంచి రూ.200/- కోట్లు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ నుంచి రూ.815/-కోట్లు, స్టేట్‌ డిజార్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ నుంచి రూ.742/- కోట్లు, కార్మిక శాఖ నుంచి రూ.1000/-కోట్లు మరియు సాంఘికశాఖ నుంచి రూ.500/- కోట్లు, కోవిడ్‌ కేర్‌ నుంచి రూ.160/-కోట్లు, కేంద్ర ప్రభుత్వ నిధుల‌ నుంచి రూ.50కోట్లు ఖర్చు చేశారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రూ.4.78 ల‌క్షలు ఉండే వెంటిలేటర్లకు రూ.18.2 ల‌క్షలు చెల్లించారని, అవినీతికి ఇంత కంటే నిదర్శనం ఏమి కావాల‌ని కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ ఆరోపించారు. దీనిపై కర్ణాటక డిప్యూటీ సిఎం అశ్విత్‌నారాయణ స్పందిస్తూ ‘వెంటిలేటర్ల’ విషయంలో ఒక దానికి ఒకటి తేడాలు ఉంటాయని తాము కొనుగోలు చేసిన వెంటిలేటర్లల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని అందుకే అంత ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. వెంటిలేటర్లు రూ.4ల‌క్షల‌ నుంచి రూ.60ల‌క్షల‌ వరకు ఉన్నాయని, వాటి మోడల్‌ దానిలో ఉన్న ఫ్యూచర్స్‌ను బట్టి రేట్లలో తేడాలు ఉండాయని, కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన వెంటిలేటర్ల విషయంపై కాంగ్రెస్‌ నాయకులు  మాట్లాడాని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2,117/- కోట్లు ఖర్చు చేసిందని, దీనిలో రైతుల‌కు ఇచ్చిన సబ్సీడీ, డ్రైవర్స్‌, వల‌సదారుల‌కు ఇచ్చిన సొమ్ము ఉన్నాయని, కేవలం మెడికల్‌ పరికరాల‌ కోసం తాము రూ.500కోట్లు మాత్రమే ఖర్చు చేశామని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని, అసెంబ్లీలో దీనికి సంబంధించిన అన్ని పత్రాల‌ను ఉంచుతామని పేర్కొన్నారు.

(292)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ