లేటెస్ట్

‘చౌదరి’ అలా...‘సోము’ ఇలా...!?

మూడు రాజధానుల‌ విషయమై...రాష్ట్ర బిజెపిలో అదే అస్పష్టత కొనసాగుతుంది. మూడు రాజధానుల‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని కొంత మంది సీనియర్‌ నేతలు చెబుతుంటే మరి కొందరు మాత్రం జోక్యం చేసుకుంటుదని చెబుతున్నారు. రాష్ట్ర రాజధానుల‌ విషయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కేంద్రం దానిపై జోక్యం చేసుకోదని బిజెపి సీనియర్‌ నేతలు ‘జి.వి.ఎల్‌.నర్సింహ్మారావు, రామ్‌మాధవ్‌, థియోధర్‌ తదితర నేతలు గతంలో చెప్పగా..అలా కాదని, రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది అని అదే పార్టీకి చెందిన ‘సుజనాచౌదరి’ వాదిస్తున్నారు. గతంలో ఈ విధంగా వాదించుకున్న నేతలు...ఇప్పుడూ అదే రీతిలో వాదించుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన ‘సోమువీర్రాజు’ ఈ విషయంపై స్పందిస్తూ..మూడు రాజధానుల‌ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని...ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పారు. దేశంలో అనేక చోట్ల రాజధానుల‌ను ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని ఆయన గుర్తు చేశారు. నాడు సింగపూరు, జపాన్‌, చైనా అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల‌ను మభ్యపెడుతూ కథల‌ను చెప్పారని, చంద్రబాబు మాటల‌పై నాడు కేంద్రం అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడూ అదే వైఖరికి కేంద్రం కట్టుబడి ఉంటుందని తెలిపారు. కాగా బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడి మాట‌ల‌ను తోసిపుచ్చుతూ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ‘సుజనాచౌదరి’ మరో సారి స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం ఉంది కాబట్టే రాజధాని రైతుల‌కు పన్ను మినహాయింపు, రాజధాని కోసం నిధులు ఇచ్చారని ఆయన చెప్పారు. ఎపి ప్రభుత్వం మూడు రాజధానుల‌ పేరిట హాస్యాస్పదమైన పనులు చేస్తోందని విమర్శించారు. రాజధాని వికేంద్రీకరణ బదులు పాల‌న వికేంద్రీకరణపై  ప్రభుత్వం దృష్టి పెట్టాల‌ని, రాజధానులు పెంచుకుంటూ పోవడం సరికాదని, రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 5,6ల‌కు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని ప్రభుత్వం గవర్నర్‌ వద్దకు తీసుకెళ్లిందని, గవర్నర్‌ న్యాయ సమీక్షకు పంపకుండా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ నిర్ణయం తీసుకోరని, కౌన్సిల్ ఆమోదించకుండా రాజధాని విభజన బిల్లుల‌ను గవర్నర్‌కు పంపడమే రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, ‘అమరావతి’ని రాజధానిగా సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించందని, రాజ్యసభ సభ్యుడిగా తాను చెబుతున్నానని కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు. మరి ఈ ఇద్దరు బిజెపి నేతలు చెబుతున్న మాటల్లో ఏది నిజం..? ఎవరిని ప్రజలు నమ్మాలి..?

(428)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ