బుమ్రా ఫామ్ పై ఆందోళన...!
టీమ్ ఇండియా ప్రధాన బౌలర్ బుమ్రా ఫామ్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. డబ్య్లుటిసి ఫైనల్ లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ లో బుమ్రా నాసిరకంగా బౌలింగ్ చేశాడు. అతను ప్రత్యర్థులను ఏమాత్రం భయపెట్టలేకపోయాడు. అతని బౌలింగ్ లో ఏమాత్రం పసలేదు. అసలు అతను ఫామ్ లోనే లేడని, అలాంటి వాడిని ఫైనల్ కోసం ఎలా ఎంపిక చేశారని మాజీ క్రికెటర్ సబాకరీం విమర్శించాడు.
అతనికి ఉన్న పేరును దృష్ణిలో పెట్టుకుని అతన్ని ఫైనల్ లో ఆడించారని, గత కొన్నాళ్లుగా అతను ఫామ్ లో లేడని, ఇంగ్లాండ్ సీరిస్ లో కానీ, ఆస్ట్రేలియా సీరిస్ లో కాని అతను ప్రభావం చూపించలేదని, అటువంటి బౌలర్ ను ఫైనల్ లో ఆడించి భారత్ మూల్యం చెల్లించుకుందని ఆయన అన్నారు. కాగా ఫైనల్ లో బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో అతను ప్రభావం చూపించలేకపోయినా రెండో ఇన్నింగ్స్ లో అతను కొంత లయను అందుకున్నాడని, అయితే అతనికి అదృష్ణం కలిసిరాలేదని కరీం అన్నారు. రాబోయే ఇంగ్లాండ్ సీరిస్ నాటికి అతను పుంజుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.