లేటెస్ట్

‘గల్లా’ కుటుంబం టిడిపికి గుడ్‌బై చెబుతుందా...!?

చాలా కాలం నుంచి రాజకీయ వర్గాల్లో ‘గల్లా’ కుటుంబం గురించి చర్చ జరుగుతోంది. ‘గల్లా’ కుటుంబం టిడిపికి గుడ్‌బై చెప్పి ‘బిజెపి’లో చేరుతుంద‌నేది ఈ చర్చల‌ సారాంశం. ఈ చర్చల‌కు బలం చేకూర్చే వార్త..ఈ రోజు ఒకటి బయటకు వచ్చింది. టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్న ‘గల్లా అరుణకుమారి’ పోలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేయ‌డం. రాజీనామా లేఖను ‘చంద్రబాబు’కు గత రాత్రి  ఆమె పంపించింది. వ్యక్తిగత కారణాల వ‌ల్ల‌ ఆమె రాజీనామా చేసిందని చెబుతున్నా..దీని వెనుక వ్యూహం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గుంటూరు ఎంపిగా ‘గల్లా జయదేవ్‌’ గెలిచినప్పటి నుంచి ఆయన టిడిపిలో ఉండరని, బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ‘గల్లా’ కుటుంబం ఖండిస్తూ వస్తోంది. అయితే పార్టీనీ సంస్థాగతంగా బలోపేతం చేస్తూ...వివిధ జిల్లాల‌కు అధ్యక్షుల‌ను, ఇతర కార్యవర్గాన్ని ప్రకటిస్తున్న సమయంలో ‘గల్లా అరుణ’ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

వాస్తవానికి ‘గల్లా’ కుటుంబం సుధీర్ఘకాలం కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉంది. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ఈ కుటుంబం రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరింది. 2014 ఎన్నికల్లో ‘గల్లా అరుణ’ ‘చంద్రగిరి’ నుంచి పోటీ చేసి ఓడిపోగా, ఆమె తనయుడు ‘గల్లా జయదేవ్‌’ గుంటూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ పార్లమెంట్‌లో ‘గల్లా జయదేవ్‌’ చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజల‌ దృష్టిని ఆకర్షించింది. ‘మిస్టర్‌ ప్రధాని’ అంటూ ‘జయదేవ్‌’ చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రత్యేకహోదా కోసం బిజెపితో తెగతెంపులు చేసుకుని ఎన్నికల్లో అదే అంశాన్ని హైలెట్‌ చేస్తూ ప్రచారం చేసిన టిడిపికి ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు నుంచి పోటీ చేసిన ‘జయదేవ్‌’ స్వల్ప‌ మెజార్టీతో బయటపట్టారు. ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయిన తరువాత రాజధాని తరలింపు అంశంలో ‘జయదేవ్‌’ స్థానిక రైతుల‌కు బాసటగా నిలిచి అసెంబ్లీ ముట్టడిలో వీరోచితంగా పోరాడారు. అయితే అప్పటి నుంచి ఆయన క్రియాశీల‌కంగా కనిపించడం లేదు. ఈ లోపు ఆయన బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వం ‘గల్లా’ కుటుంబం నిర్వహిస్తున్న సంస్థకు కేటాయించిన భూముల‌ను ‘జగన్‌’ ప్రభుత్వం రద్దు చేయడం, తరువాత వివిధ రకాలుగా ఆ కుటుంబంపై ఒత్తిడి తేవడంతో వారు ‘బిజెపి’లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ‘గల్లా’ కుటుంబం కొట్టివేసినా..అదే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యత్వానికి ‘అరుణ’ రాజీనామా చేయడంతో..వారు బిజెపి వైపు చూస్తున్నారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. రాజధాని ప్రాంతంలో ఎంపీగా ఉండి రాజధాని రైతుల‌ సమస్యపై పోరాడుతున్న ‘జయదేవ్‌’ బిజెపిలో చేరతారా..? చేరితే ఆయనకు ఉన్న ఇమేజ్‌ పోతుందన్న అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. రాజధానిని తరలిస్తుంటే బిజెపి చూస్తూ ఉందని, అదే సమయంలో వైకాపా ప్రభుత్వానికి బిజెపి పెద్దలు సహకరిస్తున్నారన్న మాట ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ‘గల్లా’ కుటుంబం బిజెపిలో చేరితే..రాజకీయంగా వారు నష్టపోతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా...ఇప్పుడున్న పరిస్థితుల‌ను బేరీజు వేసుకుంటే ‘గల్లా’ కుటుంబం ‘బిజెపి’ వైపు మొగ్గు చూపుతుందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. మరి ఏమి జరుగుతుందో చూద్దాం.

(683)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ