లేటెస్ట్

అప్పట్లో ‘రవి’తో...ఇప్పుడు ‘ఆమంచి’తో ‘కరణం’ కుస్తీ...!

రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం...ఏ నిమిషానికి..ఎలా మారుతాయో...ఎందుకు మారుతాయో..తెలియదు. రాజకీయాల్లో ఈ రోజు మిత్రులైన వారు రేపు శత్రువులుగా మారిపోతారు. ఏ పార్టీలో ఉన్నా తమకు రాజకీయంగా ల‌బ్ది చేకూరిందా..లేదా..? తమకు పదవులు వచ్చాయా..? లేదా..పదవులు రాకపోతే..పార్టీ మారిపోవడమే నేటి రాజకీయనాయకుల‌ శైలి. దేశ వ్యాప్తంగా ఇదే ధోరణి అయినా..‘ఆంధ్రా’లో ఇది మరింత ఎక్కువ. ప్రస్తుతానికి వస్తే...ప్రకాశం జిల్లా వైకాపా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ‘చీరాల‌’ నియోజకవర్గంలో అధికారపార్టీ నాయకులు ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి హోరాహోరిగా పోరాడుతున్నారు. 

గత ఎన్నికల్లో ప్రతిపక్ష టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నాయకుడు ‘కరణం బల‌రామకృష్ణమూర్తి’ వైకాపాలో చేరడంతో వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోయిన ‘ఆమంచి కృష్ణమోహన్‌’ మండిపడుతున్నారు. వీరిద్దరు నియోజకవర్గంలో పెత్తనం చేయడానికి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా వెళ్లిపోయారు. గతంలో టిడిపిలో కల‌సి ఉన్న ఈ నేతలు.. 2019 ఎన్నికల్లో పరస్పరం పోటీ చేసినా..కాలం మాత్రం ఇద్దరినీ మళ్లీ ఒకే పార్టీలో ఉండేలా చేసింది. ‘చీరాల‌’లో ‘ఆమంచి’ రౌడీయిజాన్ని అణిచివేస్తానని ప్రజల‌కు చెప్పి గెలిచిన ‘కరణం’ తరువాత వైకాపా కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ‘ఆమంచి’ ‘కరణం’ వర్గీయులు నియోజకవర్గంలో పెత్తనం చేయడానికి, ఆజమాయిషీ చేయడానికి, తమ వర్గాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఒకరినొకరు దెబ్బతీయడానికి యత్నిస్తున్నారు. టిడిపి నుంచి వైకాపాలో చేరిన ‘బల‌రాం’ ఇక్కడ పెత్తనం చేయడానికి హక్కులేదని, తానే ఇన్‌ఛార్జిని కనుక..తాను మాత్రమే నియోజకవర్గంలో పెత్తనం చేయాల‌ని ‘ఆమంచి’ అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న తాను కాకుండా ‘ఆమంచి’ పెత్తనమేమిటని ‘బల‌రాం’ ప్రశ్నిస్తున్నారు. ఈ ఇరువురి నాయకుల‌ పోటాపోటీతో నియోజకవర్గంలో రోజూ ఉద్రిక్తత పరిస్థితులు నెల‌కొంటున్నాయి. 

ఇది ఇలా ఉంటే ‘కరణం’ ఏ పార్టీలో ఉన్నా..స్వంత పార్టీ నాయకుల‌తో నిత్యం విభేదిస్తూనే ఉంటారు. గతంలో ‘టిడిపి’లో ఉన్నప్పుడు ‘అద్దంకి’ ఎమ్మెల్యే ‘గొట్టిపాటి  రవికుమార్‌’తో ఘర్షణపడ్డారు. తన కుమారుడిపై గెలిచిన ‘రవి’ని పార్టీలోకి తీసుకోకుండా అడ్డుపడినా..‘చంద్రబాబు, లోకేష్‌’ మద్దతుతో ‘రవి’ టిడిపిలోకి వచ్చారు. అయితే ‘రవి’ పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయనపై ‘కరణం’ దాడి చేస్తూనే ఉన్నారు. ‘చంద్రబాబు, లోకేష్‌’లు ఎంత సముదాయించినా, సర్దిచెప్పినా..‘కరణం’ మాత్రం తన దూకుడును తగ్గించుకోలేదు. టిడిపి అధికారంలో ఉన్నన్నాళ్లు ‘రవి’ని ఏదో విధంగా దెబ్బతీయాల‌ని ఆయన ప్రయత్నించారు. వీరిద్దరి గొడవ‌ అప్పట్లో ప్రకాశం  జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించింది. ‘కరణం’ ఎక్కడ ఉన్నా..స్వంత పార్టీ వారితోనే ఆయన కయ్యం పెట్టుకుంటారని, గతంలో ‘రవి’ ఉదంతాన్ని ఇప్పుడు ‘ఆమంచి’ వర్గీయులు ఉదాహరిస్తున్నారు. మొత్తం మీద..చీరాల‌ గొడవ‌ రాష్ట్ర స్థాయిలో సంచల‌నం సృష్టిస్తోంది. మరి అధికార వైకాపా పెద్ద‌లు దీనిపై దృష్టి పెడతారో..లేదో చూడాలి మరి. 

(498)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ