లేటెస్ట్

క్రిస్మస్‌ పండుగ+ఇళ్ల పండగ

అధికార వైకాపా ప్రభుత్వం క్రిస్మస్‌ పర్వదినాన్ని ఇళ్ల పండగగా మార్చివేస్తోంది. క్రీస్తు పుట్టిన రోజు అయిన డిసెంబర్‌25న దాదాపు 30లక్షల మంది ఇళ్లు లేని పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చి వారి స్వంత ఇంటి కలను నెరవేర్చబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల మందికి గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 1 సెంట్‌ స్థలంలో ఇంటి స్థలాలను ఇవ్వబోతోంది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని క్రిస్మస్‌ రోజు ప్రారంభించనున్నారు. ఇళ్ల పట్టాలే కాకుండా 28.30లక్షల ఇళ్లను కూడా నిర్మించబోతున్నారు. జగనన్న కాలనీ పేరుతో నిర్మించనున్న ఈ ఇళ్లను కూడా క్రిస్మస్‌ రోజే ప్రారంభించనున్నారు. మరోవైపు గత టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను కూడా అదే రోజు పంపిణీ చేయబోతున్నారు. 2.62 లక్షల ఇళ్లను ఆ రోజు లబ్దిదారులకు అందజేయనున్నారు. ఏడాదిన్నర నుంచి ఈ గృహాలను పంపిణీ చేయడం లేదని ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. 1,43,600 మంది లబ్దిదారులకు 300చ.అ, 365 చ.అ, 430 చ.అడుగుల టిడ్కో గృహాలను కేవలం ఒక్క రూపాయికే అందించనున్నారు. కాగా ఈ టిడ్కో ఇళ్ల పంపిణీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భారీగా టిడ్కో గృహాలను నిర్మించారు. పట్టణ ప్రాంతాల్లో 300,365, 430 చదరపు అడుగుల ఇళ్ల కోసం రూ.25వేలు, రూ.50వేలు, రూలక్ష చొప్పున లబ్దిదారులు డీడీలు తీశారు. ఈ గృహాలు నిర్మించి దాదాపు రెండేళ్లు దాటినా వాటిని పంపిణీ చేయలేదు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం వాటిని పంపిణీ చేయడానికి ముందుకు వచ్చింది. అయితే అధికార వైకాపా గతంలో ఉన్న జాబితాను మార్చివేసి తమకు కావాల్సిన వారికి గృహాలను కట్టబెడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో అర్హత సాధించిన వారిని పక్కన పెట్టి మళ్లీ జాబితా రూపొందించి దాన్ని లాటరీ ద్వారా తీసి ఎవరికైతే వస్తుందో వారికి ఇస్తామని గతంలో జాబితాలో ఉన్నవారు ఈ జాబితాలో రాకపోతే వారు కట్టిన సొమ్మును వెనుక్కు ఇస్తామని హామీ ఇస్తోంది. దానితో పాటు వారికి సెంటు స్థలం కేటాయిస్తామని చెబుతోంది.టిడ్కో ఇళ్లే కాకుండా పేదలకు ఇచ్చే సెంటు,సెంటున్నర స్థలాల విషయంలోనూ ప్రభుత్వం పలు విమర్శలను ఎదుర్కొంటుంది. పేదలకు ఇచ్చే స్థలాలు ఊరికి దూరంగా ఉన్నాయని, ముప్పు ప్రాంతంలో ఉన్నాయని, ఈ స్థలాల ఎంపికలో అధికార వైకాపా నాయకులు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు బలంగా వచ్చాయి. ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం ఒకేసారి 30లక్షల మందికి ఇళ్ల పట్టాలు, గృహాలు ఇస్తున్నామని, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని చెప్పుకుంటోంది. 

(155)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ