ఇప్పడు డీజీపీని మారిస్తే లాభం ఏమిటి..?
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని ఎన్నికల కమీషన్ బదిలీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే..ప్రతిపక్షాలు డిజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరుతున్నాయి. వారిద్దరూ అధికారపార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్‌కు తొత్తులు వ్యవహరిస్తున్నారని వారిద్దరినీ బదిలీ చేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదుల చేసినా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. డీజీపీగా రాజేంద్రనాధ్ రెడ్డి ప్రతిపక్షాలపై కేసులు పెట్టం, వారిని వేధించడం పనిగా పెట్టుకున్నారు. అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నా, హత్యలకు, హింసకు పాల్పడుతున్నా..వారిపై కేసులు పెట్టకుండా తిరిగి ప్రతిపక్షనేతలపైనే కేసులు పెడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత కూడా ఆయన తన తీరును మార్చుకోలేదు. టిడిపి అగ్రనేతలు, బిజెపి నేతలపై దాడులు జరుగుతున్నా..వాటిపై ఫిర్యాదులు చేస్తున్నా డీజీపీ తన పంథాను మార్చుకోలేదు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ సభలో అడ్డంకులు సృష్టించినా,బిజెపి ఎంపిలపై దాడులు చేసినా..కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీపై చర్యలు తీసుకోలేదు. అయితే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా ఇప్పుడు డీజీపీపై ఎన్నికల సంఘం బదిలీవేటు వేసింది. ఇన్నాళ్లూ ప్రతిపక్షనేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోని ఎన్నికల సంఘం ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకుందనే దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చి దాదాపు నెల రోజులు దాడిపోయింది. ఇప్పటికే..ఆపధ్దర్మ ముఖ్యమంత్రి జగన్ పోలీసులను అడ్డుపెట్టుకుని చేయాల్సినదంతా చేశారనే అనుమానాలు ఉన్నాయి. అభ్యర్థులకు అవసరమైన సొమ్ములు, మద్యం, గిఫ్ట్‌లు, ఇంకా ఇతరత్రా అంతా సర్దేశారు. అధికారపార్టీ ఓటర్లకు మొదట విడత పంచుడు కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేసింది. దీనికి డీజీపీ పూర్తిగా సహకరించారు. అదే విధంగా..ప్రతిపక్షాలకు చెందిన వారికి మద్యం అందకుండా, సొమ్ములు అందకుండా చేయాల్సినదంతా చేశారు. డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి..అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించి జగన్ ఆడమన్నట్లుగా ఆడారు. వృద్ధుల పెన్షన్ల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంత నిర్లజ్జగా వ్యవహరించారో..లోకం అంతా చూసింది. జగన్‌కు మేలు చేయలనే తలంపుతో..ఇంటి దగ్గర పంపిణీ చేయాల్సిన పెన్షన్లు పంపిణీ చేయకుండా వారిని సచివాలయాల వద్దకు తిప్పి కనీసం 50 మంది మరణాలకు కారణం అయ్యాడు. అయినా..వారిపై చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత వారిపై చర్యలు తీసుకుంటే వచ్చేదేమిటని కూటమి నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు. కూటమి పొత్తులో ఉన్న బిజెపి నేతలు ఫిర్యాదు చేసినా స్పందించని కేంద్రపెద్దలు ఆఖరి నిమిషంలో నామ్‌కే వాస్తేకేగా స్పందించారు. తమపై విమర్శలు వస్తాయి కనుక ఆఖరు నిమిషంలో ఏదో చేశామని అనిపించుకునేందుకే ఇప్పుడు డీజీపీని బదిలీ చేశారని, అన్ని అనర్ధాలకు కారణమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇంకా ప్రభుత్వ పెద్దలు బదిలీ చేయించలేదని, ఇదంతా జగన్‌కు బిజెపి పెద్దలకు ఉన్న అవగాహన మేరకే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను తప్పించుకునేందుకు ఇప్పుడు కేంద్రపెద్దలు కంటితుడుపు చర్యలకు పూనుకున్నారని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద..ఎన్నికలకు ముందు బిజెపి పెద్దలు చేసిన ఈ పనులు కూటమికి పెద్దగా మేలు చేసేవేం కావు.