అధికార వ్యవస్థలో పెనుమార్పులు...!?
తెలంగాణ ముఖ్యమంత్రిగా ‘రేవంత్‌రెడ్డి’ ప్రమాణస్వీకారం తరువాత తెలంగాణ అధికార వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. నేడు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ‘రేవంత్‌రెడ్డి’ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచే అధికార వ్యవస్థలో మార్పులు కోసం కసరత్తు చేయబోతున్నారు. ముందుగా ఐఏఎస్ వ్యవస్థలో పెనుమార్పులు తెస్తారని ప్రచారం సాగుతోంది. గత ‘కెసిఆర్’ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన చాలా మంది ఐఏఎస్‌లను లూప్‌లైనులోకి పంపించబోతున్నారని, గత ప్రభుత్వ పెద్దలతో వీరు కుమ్మక్కె ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, వారి సంగతి ‘రేవంత్‌రెడ్డి’ తేలుస్తారని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా రెవిన్యూ, పోలీస్, మున్సిపల్, ఆర్థిక,విద్యాశాఖ, సమాచార,సోషల్ వెల్ఫేర్‌కు సంబంధించిన శాఖలపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తారని, వీరిలో ముఖ్యంగా రెవిన్యూ, మున్సిపల్ శాఖలను ఆయన ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది. గత తొమ్మిదిన్నరేళ్ల పాటు అడ్డగోలు వ్యవహరించి నిబంధనలకు తూట్లు పొడిచి భారీగా అవినీతికి పాల్పడ్డ వారిని ‘రేవంత్’ వదలరని ఆయా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాగా..సమర్థత, నిజాయితీ ఉండి గతంలో లూప్‌లైనులో ఉన్న అధికారులకు ఆయన పెద్దపీట వేయబోతున్నారని, అదే విధంగా ఎస్సీ వర్గాలకు చెందిన అధికారులకు కూడా ప్రధానమైన పోస్టులు లభిస్తాయని తెలుస్తోంది. కొందరు అధికారులు ఇప్పటికే ప్రాధాన్యతా పోస్లు కోసం పైరవీలు చేస్తున్నారని, ఢిల్లీ స్థాయి నుంచి వీరు ప్రయత్నాలు చేస్తున్నారని, ఎస్సీ సామాజికవర్గానికి చెంది మాజీ ఐఏఎస్ దీనిలో ప్రధాన భూమికను పోషిస్తున్నారని, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వద్ద పలుకుబడిన కలిగిన ఈయనను ఎస్సీ వర్గానికి చెందిన అధికారులు పెద్ద ఎత్తున్న కలుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే..‘రేవంత్‌రెడ్డి’కి అధికార వ్యవస్థపై మంచి అనుభవం ఉందని, ఎవరి సేవలను ఎలా వాడుకోవాలో..ఎవరిని తప్పించాలో ఆయనకు బాగా తెలుసునని, గతంలో తప్పులు చేసిన వారిపై ఇప్పటికే..ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారని,మరో రెండు మూడు రోజుల్లో..వీరందరికీ టాటా చెబుతారని తెలుస్తోంది. మొత్తం మీద గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికార వ్యవస్థలో తిష్టవేసిన కొంతమందిని ఇంటికి సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది.