2009 తప్పులు పునరావృతం అవుతున్నాయా..?
సార్వత్రిక ఎన్నికలకు మరో 19 రోజులు మాత్రమే సమయం ఉన్న పరిస్థితుల్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు టిడిపి కార్యకర్తలు, అభిమానులకు ఆందోళన కల్గిస్తున్నాయి. మొన్నటి దాకా బిజెపి లేకపోతే పోలింగ్ రోజు అధికార వైకాపాను ఎదుర్కోలేమని, బిజెపి పొత్తులో ఉండాలని కోరి, వారిని పొత్తులోకి తెచ్చుకుంటే..ఉన్నది పోయిందన్నట్లు కూటమి పరిస్థితి ఉంటోందని కొందరు టిడిపి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 2009లో అప్పటి కాంగ్రెస్ ను దించడానికి మహాకూటమి పేరుతో టిడిపి చేసిన విఫల ప్రయోగం వలే ఇప్పుడూ అవుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నాడు టిడిపి, టిఆర్ ఎస్ (బిఆర్ ఎస్), వామపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అప్పట్లో కూటమిలో నెలకొన్న లుకలుకలవల్ల, ఆఖరి నిమిషం వరకూ జరిగిన సర్దుబాట్ల వల్ల చేతిలోకి వచ్చిన అధికారం మళ్లీ కాంగ్రెస్‌కు టిడిపి అప్పగించాల్సి వచ్చింది. అప్పట్లో కెసిఆర్ వల్ల కూటమికి నష్టం జరిగితే..ఇప్పుడు బిజెపి ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ వల్ల కూటమికి నష్టం వాటిల్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిజెపి కూటమిలోకి వస్తే అధికార వ్యవస్థ ఒక పార్టీకి కొమ్ము కాయకుండా పనిచేస్తుందని, అదేవిధంగా, అధికార వైకాపా చేసే అక్రమాలను అరికట్టడానికి ఉపయోగపడుతుందని, టిడిపి, జనసేనలు ఆశించాయి. అయితే..వారు ఆశించిన విధంగా పరిస్థితులు లేవు. ముఖ్యంగా అధికార వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజీపీ ఇంకా అధికార పార్టీ సేవ చేస్తూనే ఉన్నారు. అపధ్దర్మ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగానే వారు వ్యవహరిస్తున్నారు. అదే విధంగా చిలకలూరిపేట సభలో ప్రధాని చేసిన ప్రసంగం కూడా కూటమికి నష్టమే చేసింది. నామినేషన్ల గడువు రేపటితో ముగియనుండగా..కూటమిలో ఇంకా సీట్ల వ్యవహారం కొల్కిక్కి రాలేదు. టిడిపి నేతలను బలవంతంగా బిజెపిలో చేర్పించి ఆ పార్టీ తరుపున పోటీ చేయించడం, సగటు టిడిపి కార్యకర్తలకు రుచించడం లేదు. ఎంత సర్దుకున్నా..బిజెపి కూటమి ఐక్యతకు, కూటమికి నష్టం చేకూర్చే పనులు చేస్తూండడం 2009 పరిణామాలను గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుత అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తం అవుతున్నా దాన్ని ఓట్లగా మలుచుకోడానికి అందివచ్చిన ప్రతి అవకాశానికి బిజెపి, ముఖ్యంగా ప్రధాని మోడీ అడ్డుకట్టవేస్తున్నారు. మొత్తం మీద..బిజెపి ఆడుతోన్న నాటకం టిడిపికి మరోసారి భంగపాటును కల్గిస్తోందా..అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే..బిజెపి ఎన్ని నాటకాలు ఆడినా, జగన్‌పై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అసహ్యం, వ్యతిరేకత టిడిపి,జనసేన కూటమి విజయావకాశాలను పెంచుతున్నాయి. మరోసారి జగన్ గెలిస్తే ఏమి జరుగుతుందో..ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రా ప్రజలు చూశారు కనుక..బిజెపి ఎన్ని ఆటంకాలు కల్పించినా..ఏమి చేసినా..టిడిపి, జనసేన గెలుపును ఆపలేరనే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి.