క్యాట్‌కు I&PR విజయ్‌కుమార్‌రెడ్డి...!?
అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి..జగన్ ప్రభుత్వంతో అంటకాగిన I&PR కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డికి ఇప్పుడు అసలైన కష్టాలు మొదలయ్యాయి. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. చేసిన తప్పులుకు సమాధానం చెప్పకుండా, ఎవరికీ బాధ్యతలు అప్పచెప్పకుండా, సమాచారశాఖను గాలికి వదిలేసి ఢిల్లీకి పరిగెత్తిన ఆయనకు అక్కడ చుక్కెదరయింది. తన డిప్యూటేషన్ పూర్తి అయిందని, తనను మళ్లీ కేంద్ర సర్వీసులోకి తీసుకోవాలని ఆయన కోరిన కోర్కెను కేంద్రం తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వ రిలీవ్ ఆదేశాలు ఉంటేనే కేంద్ర సర్వీసులోకి తీసుకుంటామని ఖరాఖండిగా చెప్పింది. దీంతో ఇక్కడ నుంచి పరారయిన విజయ్‌కుమార్‌రెడ్డి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. తన డిప్యూటేషన్ జూన్9తో అయిపోయింది కనుక తాను రిలీవ్ అయినట్లే అని ఆయన వాదిస్తున్నారు. దీనిపై ఆయన క్యాట్‌ను ఆశ్రయిస్తారని ప్రచారం సాగుతోంది. తన డిప్యూటేషన్ పొడిగింపును రద్దు చేసుకున్నానని, తనకు డిప్యూటేషన్ వద్దని జిఏడీని కోరానని, అయితే దాన్ని ఆయోదించాల్సిన ప్రభుత్వం ఆమోదించలేదని, ఇందులో తన తప్పేమీలేదని, తన డిప్యూటేషన్ ముగిసినట్లేనని ఆయన వాదిస్తున్నారు. దీనిపై క్యాట్(సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)కు వెళతానని ఆయన చెబుతున్నారట. అయితే..ఆయన అక్కడకు వెళ్లినా ఉపయోగం లేదనే వాదన ఉంది.
జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తుందనే భావనతో ఆయన మళ్లీ రెండేళ్ల డిప్యూటేషన్ కోరారని, దాన్ని కేంద్రం ఆమోదించినందున ఆయన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసునని, అందుకే నిన్న ఆయన సచివాలయానికి వచ్చి జిఏడి అధికారులను కలిశారు. అయితే...ఆయనను రిలీవ్ చేయించుకునేందుకే ఆయన అక్కడకు వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా..ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లిపోతామనే ఆతృతతో ఆయన I&PRను అనాథలా వదిలేశారని, బాధ్యతలు ఎవరికీ అప్పచెప్పకుండా పరారవడం..తీవ్ర కలకలానికి కారణమవుతోంది. గతంలో ఎవరూ ఈ విధంగా చేయలేదని అంటున్నారు. ఏ ప్రభుత్వంలోనైనా I&PR శాఖ కీలకంగా ఉంటుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటుంది. అయితే..ఇప్పుడు I&PRను పట్టించుకునే వారు లేరు. మంత్రి ఉన్నా..కమీషనర్ లేకపోవడంతో..శాఖలో పనిచేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా..శాఖలో పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు. కమీషనర్ ఉంటేనే వారికి జీతభత్యాలు విడుదలవుతాయి. కాగా..ఇప్పుడు కమీషనర్‌గా విజయ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్లా లేనట్లా..తెలియడం లేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన కార్యాలయానికి రావడం లేదు. మొత్తం మీద జగన్‌తో అంటకాగిన విజయ్‌కుమార్‌రెడ్డి, ఆయన సన్నిహితులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు, ఇక్కట్లకు గురవుతున్నారు.