I&PR అక్రమాలపై విచారణ చేయిస్తాంఃమంత్రి పార్థసారధి
సమాచారశాఖలో గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై సభాసంఘంతో విచారణ చేయిస్తామని సమాచారశాఖ మంత్రి పార్థసారధి అసెంబ్లీలో వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ గత ఐదేళ్లలో సమాచారశాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే మాట నిజమేనని, దీనికి కారణం అయిన అప్పటి సమాచారశాఖ మంత్రితో పాటు, అప్పట్లో కీలకంగా వ్యవహరించిన అధికారులందరిపై సభాసంఘం చేత విచారణ చేయిస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా దీనిపై విచారణ చేయించాలని చెప్పారని, ఆయన చెప్పిన విధంగానే సమాచారశాఖ అక్రమాలపై, అవినీతిపై విచారణ చేయిస్తామని ఆయన సభకు హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భార్య భారతి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రికకు రూ.403కోట్లు దోచిపెట్టారనే మాట వాస్తవమేనని, సర్క్యులేషన్ నిబంధనలను పట్టించుకోకుండా ఆ పత్రికకు వందల కోట్లు ఇచ్చారని, ఇది రూల్స్‌కు విరుద్ధమని దీనిపై విచారణ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ అవినీతిలో భాగమైన అధికారులను వదలమని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఈనాడును కాదని తన స్వంత పత్రికకు అప్పటి ముఖ్యమంత్రి వందలకోట్లు దోచిపెట్టారనేది నిజమేనని, అయితే అప్పట్లో తమకు బిల్లులు చెల్లించడంలేదనే భావనతో ఈనాడు యాడ్స్‌ను వదులుకుందని మంత్రి చెప్పారు.