విజయ్‌కుమార్‌రెడ్డిని వెనక్కు పంపండి...!?
కేంద్రానికి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం
ఐదేళ్లలో అడ్డగోలుగా అవినీతికి, అక్రమాలకు పాల్పడి, అధికారం మారిన వెంటనే పరార్ అయిన I&PR కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి అవినీతి భాగోతానికి తగిన శిక్ష పడబోతోంది. ఆయనతోపాటు అవినీతిలో భాగస్వాములు అయిన సమాచారశాఖకు చెందిన ఆరుగురు ఉన్నతస్థాయి ఉద్యోగులపై కూడా విజిలెన్స్ విచారణ జరగబోతోంది. కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన విజయ్‌కుమార్‌రెడ్డి డిప్యూటేషన్ ముగిసిందని, చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రి పరార్ అయ్యారు. పరార్ అయి ఢిల్లీలోని కేంద్రసమాచారశాఖలో లాబీయింగ్ చేసుకుని పోస్టింగ్ తెచ్చుకుని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆయన పరార్ అయినా ఆయన చేసిన పాపాలు ఆయనను వెన్నాడుతున్నాయి. తమ రాష్ట్రంలో ఆయన అవినీతికి, అక్రమాలకు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని, ఇక్కడ రిలీవ్ అవలేదని, ఆయనను వెనుక్కు పంపాలని కేంద్ర సమాచారశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆయనను వెంటనే ఇక్కడకు పంపాలని, ఆయనపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని, దాని తరువాతే..ఆయనను కేంద్రానికి పంపిస్తామని, వెంటనే ఆయనను రాష్ట్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు Janamonline.com కు తెలిపాయి. గత ఐదేళ్లలో ఆయన ఆయన బృందం చేసిన అక్రమాలను నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. కాగా రాష్ట్ర సమాచారశాఖ అవినీతిపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా వందలకోట్లు కట్టబెట్టడం, ఇతర పత్రికలపై పక్షపాతం చూపించడంపై మంత్రిని సభ్యులు నిలదీశారు. దీనిపై సంబంధిత మంత్రి పార్థసారధి స్పందిస్తూ అవసరమైతే దీనిపై సభా సంఘంతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
ఆరుగురిపై విజిలెన్స్ విచారణ...!
సమాచారశాఖలో గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయించబోతోంది. దీనిపై త్వరలో ఆదేశాలు విడుదల కాబోతున్నాయి. రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఐదుగురిపై విచారణ జరగబోతోంది. అత్యంత నిజాయితీపరుడైన విజిలెన్స్ అధికారి ఆధ్వర్యంలోని బృందం వీరిని విచారించనుంది. విజయకుమార్‌రెడ్డితో పాటు అప్పట్లో శాఖను తన కనుసైగతో శాసించిన అధికారితో పాటు మరో నలుగురిపై విజిలెన్స్ విచారణ జరగబోతోంది. మొత్తం ఆరుగురిలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. వీరిలో ఓ మహిళా అధికారి కోట్లు కూడబెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. వీరితోపాటు అవుట్‌డోర్ యాడ్‌లు పర్యవేక్షించిన అధికారి, ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారిని కూడా విచారించనున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతాధికారిని పక్కన పెట్టి అంతా తానై వ్యవహారాలు నడిపిన అధికారిపై విచారణ జరగనుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్‌లో అంతా ఆయన వ్యవహారమే నడిచింది. సదరు ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతాధికారిని కాదని, జగన్ సామాజిక వర్గానికి చెందిన అధికారే పెత్తనం చేశారు. లక్షలాది రూపాయల ఇంజనీరింగ్ పరికరాలను జగన్ ఇంట్లో ఏర్పాటు చేయడంలో ఈయనదే ప్రధాన పాత్ర. జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆ పరికరాలను తిరిగి తేవాలని జీఏడీ కోరినా..సదరు అధికారి తెచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద..విజిలెన్స్ విచారణలో సమాచారశాఖ అవినీతి మొత్తం బయటకు వస్తుందని, తరువాత ఇందులో వాటాలు ఉన్నవారంతా ఊచలు లెక్కించాల్సిందే.