జగన్ ఖాకీలపై చర్యలు..ఒకే...మిగతా డిపార్ట్‌మెంట్స్ జగన్ భక్తుల... సంగతేమిటి...!?
జగన్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి స్వామి భక్తిని చాటి, జగన్ కళ్లలో ఆనందం కోసం అడ్డమైన పనులు చేసిన పోలీసుల్లో చాలా మందిపై కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జగన్ కోసం టిడిపి, జనసేన నాయకులను, కార్యకర్తలను హింసించిన సీనియర్ పోలీసు అధికారులను డిజీపీ కార్యాలయానికి సరెండర్ చేసి, వారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీలో కార్యాలయంలో కూర్చోబెట్టడంపై రాష్ట్ర ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. వారు చేసిన అరాచకాలకు అదే శిక్ష అని, తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో రెండో ఆలోచన చేయవద్దని కూడా వారు కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే..కేవలం పోలీసుశాఖలోని అవినీతి, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా...? మిగతా డిపార్ట్స్‌మెంట్ సంగతేమిటనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్నిశాఖల్లో ఇష్టారీతిన అధికారదుర్వినియోగం చేశారు. మైనింగ్, మద్యం, పురపాలక,రెవిన్యూ, పౌరసరఫరాలు, విద్యాశాఖ, సమాచారశాఖ, పశుసంవర్ధకశాఖ ఇలా ఒకటేమిటి దాదాపు అన్నిశాఖల్లోని ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి జగన్ దోపిడీకి సహకరించారు. జగన్ దోచుకున్నది పోగా..మిగతాది వీరు వాటాలు వేసుకుని పంచుకున్నారు. ఈ సంగతి టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే ఆరోపణలు చేసింది. అయితే..ఇప్పుడు పోలీసు, మైనింగ్, మద్యం, రెవిన్యూ శాఖల్లోని అవినీతిపరులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.మిగతా శాఖల్లోని జగన్ భక్తులను ఇంత వరకు కనీసం టచ్ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు అవుతున్నా..వివిధశాఖల్లో ఉన్న జగన్ భక్త బృందాన్ని ఏమీ చేయలేదు. వీళ్లు ఇప్పుడు కూడా అధికారం చెలాయిస్తున్నారు. పైగా కూటమి ప్రభుత్వం తమనేమీ పీకలేదని, వాళ్లకు అంతధైర్యం లేదని అంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. ఆర్ధికశాఖలో కోట్లాది రూపాయల అవినీతికి కారణమైన సత్యనారాయణ అనే అధికారిపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై పదే పదే ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆయన సంగతే పట్టించుకోలేదు. ఆయన యధావిధిగా తనపనులు తాను చేసుకుంటున్నారు. అదే విధంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి బహిరంగంగా జగన్‌కు మద్దతు పలికారు. ఆయనపై ఇంత వరకూ చర్యలు లేవు. ఆయన సహచరులు పాలనకు కీలకమైన సచివాలయంలో జగన్‌కు అనుకూలంగా పనులు చేస్తున్నారు. మరోవైపు వందలాది కోట్లు సాక్షి, వైకాపా అనుకూల మీడియాకు కుమ్మరించి పరార్ అయిన అప్పటి ఐ&పిఆర్ కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఆయన అవినీతిలో వాటాదారులు అయిన I&PR సీనియర్ అధికారులపై ఇప్పటి వరకూ ఈగ వాలలేదు. పశుసంవర్ధకశాఖలో కూడా అదే పరిస్థితి. అదే విధంగా అసైన్డ్ భూముల అడ్డగోలు అమ్మకాల్లో వాటాదారులైన సీనియర్ ఐఏఎస్ అధికారులపై కూడా చర్యలు తీసుకోలేదు. దాదాపు అన్ని హెచ్ ఓడీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. జగన్‌ను చూసుకుని, విర్రవీగి అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించు వందల కోట్లు దోచుకున్న సీనియర్ అధికారుల అవినీతిని బట్టబయలు చేసి, వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.