మద్యంలో అవినీతి జరుగుతుందని ముందే తెలుసు: అజయ్ కల్లంరెడ్డి
జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానంలో అవినీతి జరుగుతుందని, తనకు ముందే తెలుసునని రిటైర్డ్ సిఎస్, మొన్నటిదాకా జగన్ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్న అజయ్‌కల్లంరెడ్డి తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో తప్పులు చేసిందని, వారు తెచ్చిన మద్యం విధానం సరికాదని, తాను చెప్పినా..అన్నా..మద్యం గురించి మీరు మాట్లాడవద్దని తనకు జగన్ చెప్పారని, దాంతో..తాను ఆ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వమే మద్యం అమ్మడం వల్ల ఇబ్బందులు వస్తాయని తాము చెప్పినా..వారు వినలేదని, జగన్ పార్టీ ఓడిపోవడానికి అదో కారణమని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే మద్యాన్ని అమ్మాలని భావించిందని, అప్పట్లో మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు ఇతరులు తమిళనాడులో అమలు చేస్తోన్న విధానాన్ని పరిశీలించి వచ్చారని, అదే విధంగా ఇక్కడ చేయాలని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారని, ఆయన కూడా అమలుకు సరే అన్నారని, కానీ అధికారులు మాత్రం వద్దని చెప్పారని, దాంతో..చంద్రబాబు ఆ నిర్ణయాన్ని వెనుక్కు తీసుకున్నారని అజయ్‌కల్లంరెడ్డి పేర్కొన్నారు. తమిళనాడులో ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహించడం వల్ల భారీగా అవినీతి జరిగిందని, ఈ విషయం జగన్‌కు తెలుసునని, కానీ..అదే విధానాన్ని ఆయన ఇక్కడకు తెచ్చారని, దీని వల్ల భారీగా దీనిలో అవినీతి జరిగిందని కల్లంరెడ్డి చెప్పారు. తమచేత జగన్ రెడ్డి నాసిరకమై మద్యం తాగిస్తున్నారని దాదాపు 50లక్షల మంది భావించారని, వీరంతా జగన్‌కు వ్యతిరేకంగా ఓటువేశారని, అందుకే కూటమికి అంత ఘనవిజయం లభించిందని ఆయన అన్నారు.
జగన్ ఓడిపోతాడని ముందే తెలుసు...!
జగన్ ఓడిపోతాడని తనకు ముందే తెలుసనని కూడా ఆయన అన్నారు. వైకాపా ఓటమిని ముందే ఊహించానని, అది ఊహించని విషయం కాదని, మనిషిలో అహంకారం పెరిగితే, ఇలానే అవుతుందని, ఆయన అన్నారు. జగన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, అన్ని వర్గాల విశ్వాసాన్ని ఆయన కోల్పోయారని కల్లంరెడ్డి చెప్పారు. మొత్తానికి ఐదేళ్లు జగన్‌కు సేవచేసిన ఈ రిటైర్డ్ ఐఏఎస్ పదవి పోయిన తరువాత జగన్ పాపాల గురించి పెదవి విప్పడం వెనుక కారణం ఏమిటో..? జగన్ పదవిలో ఉన్నప్పుడు పెదవి విప్పితే ఏమి జరుగుతుందో..తెలిసినవాడు.. కనుక ఇప్పుడు జగన్ పాపాలను వివరిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి.