I&PRలోని అవినీతి అధికారులను కాపాడుతున్నదెవరు...!?
గత జగన్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతికి, అక్రమాలకు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన రాష్ట్ర సమాచారశాఖ ప్రధాన కార్యాలయంలోని అధికారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది. గత ఐదేళ్లలో సమాచారశాఖలో అవినీతి జరిగిందని విజిలెన్స్ ప్రాధమిక ఆధారాలు ప్రభుత్వానికి సమర్పించినా, అవినీతిలో భాగస్వాములైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. గతంలో కమీషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌రెడ్డి కూటమి ప్రభుత్వం రాగానే ఇక్కడ నుంచి పరార్ అయ్యారు. సమాచారశాఖలో జరిగిన అవినీతికి, అక్రమాలకు ఆయన కేంద్రబిందువనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ కుటుంబానికి వీరవిధేయుడిగా పనిచేసిన ఈ అధికారి సమాచారశాఖ నిధులు మొత్తాన్ని జగన్ కుటుంబానికి దోచిపెట్టారు. ఈ దోచిపెట్టడంలో మిగిలిన వాటాను విజయ్‌కుమార్‌రెడ్డి, అప్పట్లో ఆయనను గుప్పెట్లోపెట్టుకుని ఆడించిన అధికారులు దోచుకున్నారు. గత ఐదేళ్ల లో సమాచారశాఖలో దాదాపు రూ.100కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. వీటిలో ప్రింట్‌మీడియాకు విడుదల చేసిన ప్రకటనలు, అవుట్‌డోర్ మీడియా, సీసీ యాడ్స్ వంటివే కాకుండా, భారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరిట పెట్టిన అక్రమ బిల్లులు, యాడ్స్ డిజైనింగ్ పేరిట సమర్పించిన బిల్లులు కూడా ఉన్నాయి. సమాచారశాఖకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల కంటే అదనపు నిధులను తెచ్చుకుని విజయ్‌కుమార్‌రెడ్డి, ఆయన బృందం దోచేసింది. దీన్ని విజిలెన్స్ కూడా నిర్ధారించింది. అప్పట్లో సమాచారశాఖలో కొందరు ఉద్యోగులను నియమించారు. వారు పనిచేసినా..చేయకపోయినా...వారి పేరుతో నిధులను డ్రా చేశారు. విజయ్‌కుమార్‌రెడ్డిని గుప్పెట్లో పెట్టుకుని ఆడించిన అధికారికి పిఏగా వ్యవహరించిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి భార్య కూడా అక్కడ పనిచేస్తున్నట్లు రికార్డులో చూపించి నిధులను డ్రా చేశారు. అంతే కాకుండా వామపక్షాలకు చెందిన ఓ పత్రిక విలేకరి భార్య కూడా అక్కడ పనిచేస్తున్నట్లు చూపించారు. వాస్తవానికి ఆమె కొన్నాళ్లు పనిచేసి, తరువాత మానేశారు. అయితే..ఆమెకు ఆగస్టు నెల జీతం కూడా ఇచ్చినట్లు రికార్డుల్లో రాసుకున్నారు. ఇవన్నీ కాకుండా అవుట్‌డోర్ పబ్లిసిటీలో భారీగా అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారు. జగన్ సామాజికవర్గానికి చెందిన ఓ యాడ్ ఏజెన్సీకి కోట్లాది రూపాయలను కట్టబెట్టారు. వాస్తవానికి ఈ సొమ్ముల్లో సగం విజయ్‌కుమార్‌రెడ్డి అండ్ కో మింగేశారు. ఒకే వ్యక్తి రెండు లేక మూడు ఏజెన్సీలను వేర్వేరు పేర్లతో సృష్టించి వాటిపేరుతో ఆర్డర్స్ తీసుకుని ప్రజాధనాన్నిదోచేశారు. ఇలా ఒకటేమిటి...అనేక రకాలుగా అవినీతికి, అక్రమాలకు పాల్పడినా..కూటమి ప్రభుత్వం ఇచ్చి మూడు నెలలు అవుతున్నా వారిపై చర్యలు తీసుకోలేదు. అక్రమాలకు, అవినీతికి పాల్పడిన వారు దర్జాగా తమ విధులను వెలగబెడుతున్నారు. అంతే కాదు..గతంలో..అడ్వాన్స్‌లు ఇచ్చిన వారి పనులు చేయడానికి, వారి ఫైళ్లను ఇప్పుడు కదిలిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారే..ఇప్పుడూ మళ్లీ చక్రం తిప్పుతున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది.
అవినీతి అధికారులను కాపాడుతున్నదెవరు...?
సమాచారశాఖలో వందలకోట్లలో అవినీతి జరిగిందని విజిలెన్స్ ప్రాధమికంగా నిర్ధారించినా...సంబంధిత అధికారులపై ఇంతవరకూ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. విజయ్‌కుమార్‌రెడ్డిని వెనక్కు రప్పిస్తామని సమాచారశాఖ మంత్రి పార్థసారధి అసెంబ్లీలో చెప్పినా..ఇంత వరకు దానిపై ఎటువంటి కదలికలు లేదు. విజయ్‌కుమార్‌రెడ్డి అవినీతిలో భాగస్వాములైన అధికారులపై కూడా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందో..ఎవరికీ అర్థం కావడం లేదు. విజయ్‌కుమార్‌రెడ్డితో అంటకాగిన ఓ అధికారి తన సామాజికవర్గానికి చెందిన వారిని కలిసి తనపై చర్యలు తీసుకోవద్దని చంద్రబాబును కోరాలని వారి చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల ఆ అధికారి ఢిల్లీకి వెళ్లి మరీ తన సామాజికవర్గానికి చెందిన నేతను కలిసివచ్చారు. చంద్రబాబుకు సన్నిహితుడైన ఈ ఉద్యమనేతను ఈ అధికారి కాకా పడుతున్నారు. తన తప్పేమీ లేదని, అంతా విజయ్‌కుమార్‌రెడ్డే చేశాడని, తనను ఇరికిస్తున్నారని తనను కాపాడాలని కోరారని తెలిసింది. ఆ ఉద్యమనేత ఇటీవల చంద్రబాబును కలిశారని, సదరు అధికారి గురించి చెప్పి..ఆ అధికారిపై విచారణ చేయవద్దని చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పరిణామాలతో తెలుగురాష్ట్రాల్లో ఒక సామాజికవర్గంలో హీరోగా మారిన ఆయన మాటను చంద్రబాబు వింటారని, ఆయన చుట్టూ సదరు అధికారి తిరుగుతున్నారట. ఆ అధికారితో పాటు, ఇంజనీరింగ్ సెక్షన్ అధికారి కూడా ఇదే బాటలో ఉన్నారట. వారు తెచ్చిన ఒత్తిడితోనే..రాష్ట్ర ప్రభుత్వం సమాచారశాఖ అవినీతిపై ముందుకు వెళ్లడం లేదట. వందల కోట్లు దోచుకున్న అధికారులను శిక్షించకపోతే..రాబోయే కాలంలో అధికారులెవరూ ప్రభుత్వాన్ని లెక్కచేయరు. ఇది ఇలా ఉంటే సదరు అధికారులు చర్యలు నుండి తప్పించుకునేందుకు వారి వారి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సీరియస్‌గానే ఉందని, వారిని వదిలిపెట్టరని మాటా గట్టిగానే వినిపిస్తోంది. చర్యలు తీసుకోవడం ఆలస్యం కావచ్చు కానీ, చర్యలు తప్పక ఉంటాయంటున్నారు. చూద్దాం ప్రభుత్వం ఏమి చేస్తుందో...!?