చెత్తను పోగేసుకుంటున్న తండ్రీకొడుకులు...!?
రాజకీయాల్లో చంద్రబాబును అపరచాణ్యుకుడంటారు. ఆయన వ్యూహాల వల్లే ఎన్టీఆర్ తరువాత టిడిపి బతికి బట్టకట్టిందని, ఆయన ఓర్పు,నేర్పు వల్లే ఒక ప్రాంతీయ పార్టీ ఇంకా దేశ రాజకీయాలను తనపై ఆధారపడే స్థితికి తెచ్చుకుందని చంద్రబాబు మద్దతుదారులు చెబుతుంటారు. ఒక వేళ ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు కనుక టిడిపి పగ్గాలు చేతిలోకి తీసుకుని ఉండకపోతే..టిడిపి ఎప్పుడో చరిత్రలో కలిసేదని కూడా వారు ఆయనకు కితాబులిస్తుంటారు. అది చాలా వరకూ నిజమే. ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. 2004,2009ల్లో టిడిపి ఓడిపోయింది. ఇక ఆ పార్టీ పనైపోయిందనుకున్న స్థితిలో, ఆ పార్టీని రాజకీయంగా చావుదెబ్బ కొట్టాలనుకుని నాటి యుపిఏ అధినేత సోనియాగాంధీ రాష్ట్ర విభజన చేసి, టిడిపిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించింది. అయితే..ఆమె చేసిన నిర్ణయం వల్ల టిడిపికి ఊపిరి వచ్చినట్లైంది. సోనియా కుట్రను అర్థం చేసుకున్న ఆంధ్రా ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. అప్పట్లో టిడిపి మళ్లీ గెలవడంలో చంద్రబాబు పాత్ర కన్నా..సోనియా నిర్ణయమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే..2019లో జగన్ చేతిలోఘోరంగా ఓడిపోయిన టిడిపి పార్టీ మళ్లీ ఇప్పుడు పుంజుకుందంటే..ప్రధాన కారణం జగనేనని చెప్పవచ్చు. ఆయనకు వచ్చిన మెజార్టీకి ఆయన ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించి ఉంటే..టిడిపి మళ్లీ గెలవడం కష్టమయ్యేది. టిడిపి మళ్లీ పుంజుకోవడంలో పార్టీ అథినేత చంద్రబాబు, ఆయన తనయుడు చేసిన కృషి కంటే..జగనే..టిడిపిని మళ్లీ బ్రతికించారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే..ఓర్పు,నేర్పుతో అన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో, అభివృద్ధి చేస్తారనే పేరు చంద్రబాబుకు ఉండడం వల్ల, మరో ప్రత్యామ్నాయం లేకుండా చేసుకోవడంతోనే టిడిపి మళ్లీ పుంజుకోగలిగింది. పార్టీని మళ్లీ అధికారంలోకి తేవాలన్న కార్యకర్తల పట్టుదల, మధ్యతరగతి, పార్టీ సానుభూతిపరుల తోడ్పాటుతో టిడిపి ముందంజ వేయగలిగింది. అయితే..అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన బలహీనతలను మళ్లీ బయటపెట్టుకుంటున్నారు. ఆయన రాజకీయవ్యూహాల వల్లే ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చానన్న తలంపుతోనే..ఇప్పుడుమళ్లీ తప్పటడుగులు వేస్తున్నారు.
మళ్లీ అవే తప్పులు...!
2014లో అధికారంలోకి వచ్చిన తరువాత వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలను, ఆ పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలను ఇబ్బడిముబ్బడిగా పార్టీలోచేర్చుకున్నారు. ఎవరు వచ్చినా..పార్టీ కండువా కప్పేశారు. లేనిపోని చెత్తనంతా పోగేసుకున్నారు. ఈ చెత్తను పోగేసి..అదే తన బలమని, జగన్ పనైపోయిందని కలలు కన్నారు. వాస్తవాలను విస్మరించి పోగేసుకున్న చెత్త వల్ల 2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్లీ అదే చెత్తను పోగేసుకుంటున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు చెందిన వైకాపా నాయకులను, వారి బంధుగణాలను పార్టీలో చేర్చుకుంటున్నారు. వారి వల్ల ఉపయోగం ఏమిటో తెలియదు..నిన్న మొన్నటి దాకా టిడిపి నాయకులను, కార్యకర్తలను వేధించిన వారిని పార్టీలోకి తీసుకుని నిజమైన టిడిపి కార్యకర్తలకు ఏమి సందేశం ఇస్తున్నారో..? నిన్నటి దాకా..తమతో పోరాడిన వారిని పార్టీలోకి తీసుకుని అందలం ఎక్కించడంతో..తాము చేసిన త్యాగాలు ఎటుపోయాయో..అని స్థానిక నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరు కాకుండా వైకాపా ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎక్కడ లేని చెత్తను తెచ్చి మళ్లీ చంద్రబాబు, ఆయన కుమారుడు చెత్తను పోగేసుకుంటున్నారని, వీరందరిని పార్టీలోకి తీసుకుంటే జగన్ బలహీన పడతారా..? గతంలో ఏమి జరిగిందో..తెలుసుకదా..? మళ్లీ అటువంటి ప్రయోగాలు ఎందుకో..? జాతీయ అవసరాల దృష్ట్యా వైకాపా రాజ్యసభ సభ్యుల వరకు ఓకే..అది రాజకీయం అనుకోవచ్చు. కానీ..స్థానికంగా..ఉన్నవారి వల్ల ఉపయోగం ఏమిటి..? మొన్నటిదాకా అడ్డగోలు అధికారం అనుభవించి, ప్రజలను వేధించిన వీరిని పార్టీలోకి తీసుకుంటే..ప్రజలు ఏమనుకుంటారోననేది కూడా తండ్రీకొడుకులు మరిచిపోయినట్లుఉన్నారు. మొత్తం మీద..చెత్తను పోగేసుకుంటే..ఏమవుతుందో..తెలిసీ కూడా తండ్రీకొడకులు రోజూ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో...2026లో తెలుస్తుంది. అప్పటి వరకూ..మనకు ఎదురేలేదు..జగన్ పనైపోయిందని సంబరపడదాం.