I&PRలో మొదలైన ప్రక్షాళన...!? జెడీపై వేటు..మరికొందరిపై చర్యలు...!
రాష్ట్ర సమాచారశాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి, అక్రమాలకు, అనైతిక కార్యక్రమాలకు కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొద్దిగా ఆలస్యంగానైనా కూటమి ప్రభుత్వం అవినీతికి, అక్రమాలకు కారణమైన వారిపై చర్యలకు ఉపక్రమించింది. గత జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా అధికారం అనుభవించి, ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో ఒకరిపై ప్రభుత్వం చర్య తీసుకుంది. రాష్ట్ర కార్యాలయంలో జాయింట్‌డైరెక్టర్‌గా పనిచేస్తోన్న అధికారిని జిఏడీలో రిపోర్టు చేయమని ఆదేశించింది. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌రెడ్డితో కలసి సదరు జెడి అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. సదరు జెడీతో పాటు, ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న మరో కీలక అధికారి, అవుట్‌డోర్ యాడ్స్ చూస్తోన్న మరో జెడిపై కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ముందుగా గతంలో కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డిని గుప్పెట్లో పెట్టుకుని, శాఖను తన గుప్పెట్లో పెట్టుకున్న జెడిపై తొలివేటు పడింది. సదరు జాయింట్ డైరెక్టర్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రకటనల విడుదలలో, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకంతో పాటు, వారి జీతభత్యాల విషయంలోనూ, అక్రిటిడేషన్ల విషయంలోనూ ఆరోపణలు వచ్చాయి. సమాచారశాఖలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ముందుగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అయితే..విజిలెన్స్ విచారణకు ముందే గతంలో కమీషనర్‌గా ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డి ఇక్కడ నుంచి పరార్ అయ్యారు. అయితే..ఆయనను తిరిగి వెనక్కు తెస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది. ఈలోగా..అతనికి సహకరించిన వారందరిపై చర్యలకు ఉపక్రమించింది. ముందుగా జాయింట్ డైరెక్టర్‌పై వేటు వేసింది. సదరు జాయింట్ డైరెక్టర్‌ను జీఏడీలో రిపోర్టు చేయమని ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా సదరు జెడీకీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా మరికొందరు ఉన్నతాధికారులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సదరు జెడీ నిర్వహిస్తున్న బాధ్యతలను అడిషనల్‌డైరెక్టర్‌కు అప్పగించింది. మొత్తం మీద గతంలో అధికారం ఉందికదా అని, విర్రవీగి అవినీతి, అక్రమాలకు, అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఆలస్యంగానైనా కఠిన చర్యలు తీసుకుంటోంది.