లేటెస్ట్

IYR బాధేంటో...!?

మాజీ ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బిజెపి నాయ‌కుడు ఐవైఆర్ కృష్ణారావు చంద్ర‌బాబు చెప్పేమాట‌లను నమ్మ‌ర‌ట‌. ఆయ‌న మాట‌లు విశ్వ‌సించ‌లేమ‌ని, ఆయ‌న‌ను తాను న‌మ్మ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు..గ‌తంలో చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ప‌నిచేసిన ఈ రిటైర్డ్ ఐఏఎస్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌గ్గోలు రేగిన తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ వివాదంలో..చంద్ర‌బాబు మాట‌ల‌ను తాను న‌మ్మ‌డం లేద‌ని, ఆయ‌న మాట‌ల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని కృష్ణారావు కోరుతున్నారు. హిందువులంతా త‌మ‌కు అత్యంత ప‌విత్ర‌మైన వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌సాదం క‌ల్తీకి గురైంద‌ని, దాని జంతు సంబంధ అవ‌శేషాలున్నాయ‌ని, దానికి గ‌త పాల‌కుడు జ‌గ‌నే కార‌ణ‌మ‌ని, దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌నలు చేస్తున్నారు. అయితే..కృష్ణారావు మాత్రం దీనికి మ‌ద్ద‌తు ఇవ్వ‌ర‌ట‌. చివ‌ర‌కు బిజెపి అగ్ర‌నేత‌లు, రాష్ట్రానికి చెందిన సీనియ‌ర్ నేత‌లు కూడా ల‌డ్డూలో క‌ల్తీ జ‌రిగింద‌ని, దీనికి జ‌గ‌న్‌దే బాధ్య‌త‌ని చెబుతుండే..ఈ బిజెపి నేత మాత్రం చంద్ర‌బాబునే నిందిస్తున్నారు.  ప్ర‌పంచ‌మంతా ఒక దోవ అయితే..ఈ ఐవైర్‌ది మాత్రం చంద్ర‌బాబును వ్య‌తిరేకించే దోవ‌. అదే స‌మ‌యంలో..ప‌లు అవినీతి, క్రిమిన‌ల్ కేసులు ఉన్న జ‌గ‌న్‌కు ఈయ‌న‌గారు వ‌త్తాసు ప‌లుకుతుంటారు. అలా వ‌త్తాసు ప‌ల‌క‌డానికి చంద్ర‌బాబుపై ఉన్న వ్య‌తిరేక‌త కార‌ణ‌మా..?  లేక‌..నెల నెలా..ప్యాకేజీలు కార‌ణ‌మో తెలియ‌దు..కానీ..చంద్ర‌బాబు విష‌యంలో ఈ మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి ఒంటికాలిపై లేస్తుంటారు. వాస్త‌వానికి చంద్ర‌బాబునాయుడు ఈయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా చాలా ల‌బ్దే చేకూర్చారు. విభ‌జిత రాష్ట్రానికి మొద‌టి ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసే అవ‌కాశం క‌ల్పించారు. సిఎస్‌గా రిటైర్ఢ్ అయిన వెంట‌నే..ఐవైఆర్ కోస‌మే..బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేయించి దానికి ఆయ‌న‌ను ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. అంతే కాదు..ఆ కార్పొరేష‌న్‌కు భారీగా నిధులు కేటాయించి బ్రాహ్మ‌ణ విద్యార్ధుల‌కు విదేశీచ‌దువుల కోసం, స్కాల‌ర్‌షిప్ కోసం, పేద‌లైన బ్రాహ్మ‌ణుల‌కు ఆర్ధిక స‌హాయం చేసే విధంగా సౌక‌ర్యాలు క‌ల్పించారు. దాదాపు రెండేళ్ల‌పాటు బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా ఐవైఆర్ ఉన్నారు.  అయితే..చంద్ర‌బాబు ఐవైర్‌కు ఎంత చేసినా...చంద్ర‌బాబుపై ఐవైఆర్‌కు అసంతృప్తి. అది ఎందుకో ఎవ‌రికీ తెలియ‌దు. త‌న‌కు మేలు చేసినా..చంద్ర‌బాబుపై ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తూ..అవ‌స‌రం అయితే అడ్డంకులు కూడా సృష్టించారు. ఎవ‌రి రాజ‌ధాని అమ‌రావ‌తి...అంటూ అప్ప‌ట్లో ఓ పుస్త‌కాన్ని కూడా ప్ర‌చురించారు..ఈ మేధావి. అప్ప‌ట్లో ఆ పుస్త‌కాన్ని ఇప్ప‌టి డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేత ఆవిష్క‌రింప‌చేశారు. మొత్తం మీద‌..చంద్ర‌బాబు ఎంత మేలు చేసినా..ఐవైఆర్ ఆయ‌న‌పై విషం క‌క్కుతూనే ఉన్నారు. ఇది చంద్ర‌బాబు..చేసుకున్న‌..దుర‌దృష్ణం అనాలేమే...? ఆయ‌న వ‌ల్ల మేళ్లు పొందిన వారంతా ఆయ‌న‌పై విషం క‌క్కుతూనే ఉంటారు..! 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ