హిమాన్ష్ శుక్లాకు మూడు పోస్టులు
A.P. State Film, TV and Theatre Development Corporation Limited (A.P.S.F.TV.T.D.C.Ltd) ఎండిగా రాష్ట్ర సమాచార,పౌరసంబంధాలశాఖ డైరెక్టర్ హిమాన్ష్ శుక్లాకు అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఆయన ఇప్పటికే I&PR Director & Ex-officio Joint Secretaryగా పనిచేస్తున్నారు. కొంతకాలం క్రితం ఆయనకు ఎపి డిజిటల్ కార్పొరేషన్ ఎండిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ఎపిఎస్ఎఫ్‌టివిడిసికి ఎండిగా నియమించింది. యువకుడైనందున ఆయన చురుగ్గా పనిచేస్తారన్న భావనతో ప్రభుత్వం ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగిస్తోంది. వాస్తవానికి ఇటీవల ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా హిమాన్ష్ శుక్లాను నియమిస్తారని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పటి వరకు కలెక్టర్‌గా ఉన్న సృజనను కేంద్ర డీఓపీటీ తెలంగాణకు బదిలీ చేయడంతో హిమాన్ష్‌ను అక్కడ నియమిస్తారని అధికారవర్గాలు చెప్పాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌లు ఆయనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా పంపించాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే..ఆయనను కలెక్టర్‌గా పంపితే..సమాచారశాఖ డైరెక్టర్ పోస్టు కోసం ఇతరులను తేవాల్సి ఉంది. సమాచారశాఖ డైరెక్టర్ పోస్టులో పనిచేయడానికి ఐఏఎస్‌లు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సమాచారశాఖలో ఏబీసీ, విజిలెన్స్ విచారణ జరుగుతోంది. దీంతో..అక్కడ పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని చాలా మంది ఆ పోస్టు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హిమాన్ష్ సతీమణి కార్తిక శుక్లా ఆ పోస్టు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే అదీ జరగలేదు. వీరిద్దరిని కాదని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మీశను కలెక్టర్‌గా నియమించింది. ఇది ఇలా ఉంటే..ఇప్పుడు శుక్లాకు మరో పోస్టు లభించింది. మొత్తం మీద జూనియర్ అధికారి అయిన హిమాన్ష్‌కు ఒకటికి మూడు పోస్టులు లభించడం విశేషమే.