ACBవిచారణ కొలిక్కి రాకుండానే..I&PR అధికారులకు పోస్టింగులా...?
గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర సమాచారశాఖ సొమ్ములను జగన్ అండ్ కోకు దోచిపెట్టిన సమాచారశాఖ అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. అప్పట్లో సమాచారశాఖ కమీషనర్‌గా ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డి, జాయింట్‌డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ దోపిడికీ సహకరించారని, వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పార్థసారధి అసెంబ్లీలో సభ్యులకు హామీ ఇచ్చారు. నాటి అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్ విచారణ చేయిస్తున్నారు. విచారణకు ముందే కొందరు అధికారులను బదిలీ చేశారు. అయితే..మరోసీనియర్ అధికారిని మాత్రం అక్కడే కొనసాగించి ఆ అధికారికే పెత్తనం మొత్తం అప్పచెప్పారు.సదరు అధికారి తాను నీతిమంతుడినైనట్లు, బదిలీ అయిన అధికారులు మాత్రమే అవినీతి పరులైనట్లు ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే బదిలీ అయిన అధికారులకు తాజాగా పోస్టింగ్‌లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో సమాచారశాఖను తన గుప్పెట్లో పెట్టుకుని,శాఖను తన కనుసైగతో శాసించిన అధికారికి ఇప్పుడు మళ్లీ పోస్టింగ్ ఇస్తున్నారట. సదరు అధికారి ప్రస్తుతం జీఏడి అటాచ్‌లో ఉన్నారు. ఇప్పుడు సదరు అధికారికి ప్రెస్ అకాడమీ సెక్రటరీ పోస్టు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రధాన కార్యాలయంలో జరిగిన అవినీతిలోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ ఆ అధికారిదే కీలక పాత్ర. వందలాది మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామయంలోనూ, అవుట్‌డోర్ యాడ్ ఏజెన్సీలకు ప్రకటనలు విడుదల చేయడంలోనూ,సాక్షి అండ్ కో పత్రికలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇవ్వడంలోనూ సదరు అధికారితో పాటు, ఇప్పుడు పెత్తనం చేస్తోన్న అధికారికి కూడా సంబంధం ఉంది. అసలు ఏసీబీ, విజిలెన్స్ విచారణలో ఇప్పుడు పెత్తనం చేస్తోన్న అధికారిని విచారించకుండా, పైపైన విచారణ జరుపుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. కాగా..ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పోస్టింగ్ ఇవ్వాలని దస్త్రాన్ని పెట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరి ఒత్తిడితో..ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి అర్జెంట్‌గా పోస్టింగ్ ఇస్తున్నారు. దీనిలో మతలబు ఏమిటి..? ఎవరెరు లొంగిపోయారు..? దీనిలో మంత్రి కార్యాలయం పాత్ర ఎంతో..? తెలియదు. మొత్తం మీద తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న అధికారికి మళ్లీ పోస్టింగ్ ఇస్తున్నవైనం అధికారవర్గాల్లో చర్చనీయాంశం అయింది.