సంక్రాంతి నాటికి అమరావతి టెండర్లు పూర్తి...!?
అమరావతి ప్రేమికులకు శుభవార్త. కలల రాజధాని నిర్మాణానికి మళ్లీ శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గత జగన్ ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయిన రాజధాని అమరావతిని కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల సమస్యపై దృష్టి పెట్టి దాన్ని సాధించింది. ప్రపంచబ్యాంక్ రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. దీనిపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో నిన్న సిఆర్‌డి కమీషనర్ కాటంనేని భాస్కర్ ఒప్పందం చేసుకున్నారు. దాదాపు రూ.15వేల కోట్లను ప్రపంచ బ్యాంక్ రాజధాని నిర్మాణానికి నిధులను ఇస్తోంది. నిన్న ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పందంతో రుణ వ్యవహారం కొలిక్కివచ్చింది. రుణ మంజూరుతో ఇప్పుడు రాజధాని పనులు చకచకా జరుగుతాయనే భావన అధికారుల్లో వ్యక్తం అవుతోంది. సచివాలయం, మంత్రుల క్వాటర్స్, హైకోర్టు భవనాలు, సీడ్‌యాక్సెస్ రోడ్లు, అంతర్గత రోడ్లకు సిఆర్‌డిఏ టెండర్లను పిలవబోతోంది. సంక్రాంతి నాటికి అన్ని టెండర్లను ఫైనల్ చేయబోతున్నారు. టెండర్లు అయిన వెంటనే పనులు మొదలు పెట్టబోతున్నారు. అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలతో పాటు, స్థానిక సంస్థలు కూడా ఈ పనులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. టెండర్లు ఫైనల్ అయిన వెంటనే పనులు శరవేగంగా మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్స్, కరకట్ట రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం మీద..కూటమి ప్రభుత్వం తన ప్రాధాన్యాలలో ముఖ్యమైన రాజధానిని శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తోంది.