అవినీతి అధికారులకు ఇద్దరు సీనియర్ మంత్రుల అండదండలు...!?
వాళ్లు గత జగన్ ప్రభుత్వంలో అవినీతికి, అరాచకాలకు, అక్రమాలకు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు. అప్పట్లో జగన్ అండ చూసుకుని చెలరేగిపోయిన సదరు ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ప్రస్తుతం ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరుగుతోంది. అయితే..ఈ విచారణ జరుగుతుండగానే అవినీతి ఆరోపణలపై పక్కనపెట్టిన అధికారులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వాలని దస్త్రాలను వేగంగా కదిలిస్తున్నారు. శాఖలోని సీనియర్ అధికారుల సహకారంతో, ఇద్దరు మంత్రుల అండదండలతో సదరు అవినీతి ఉద్యోగులు మళ్లీ పోస్టింగ్‌లు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి ఇద్దరు మంత్రుల కార్యాలయాలతో పాటు, ఆ మంత్రులు మద్దుతు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతుండగానే..దీనిపై ఇంకా ఏమీ తేలకుండానే..వారికి పోస్టింగ్‌లు ఇప్పించాల్సిన అవసరం ఏముంది..? అవినీతి ముద్ర, వైకాపా సానుభూతిపరులైన వీరిపై మంత్రులకు అంత ప్రేమ ఏమిటి..? స్వకులం వారనా..? లేక ఇంకేమైనా ఉన్నాయా..? భారీగా సొమ్ములు చేతులు మారడంతోనే..వీరిపై మంత్రులకు ప్రేమ పుట్టిందని సచివాలయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గతంలో మున్సిపల్‌శాఖలో పనిచేసిన ఓ అధికారి సదరు సీనియర్ మంత్రి వద్ద చక్రం తిప్పుతున్నారని, ఆయనే వీరితో బేరం కుదుర్చుకున్నారని, అందుకే వారికి పోస్టింగ్‌లు ఇప్పించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వీరి వద్ద నుంచి భారీగా వసూలు చేసిన సొమ్ములను మంత్రులకు కూడా పంచుతున్నామని ఆయన చెబుతున్నారట. కాగా..వీరితో పాటు అవినీతి మరకలు అంటిన మరికొందరితో కూడా సదరు మంత్రి పేషీ అధికారి మాట్లాడుకున్నారని, వారి వద్ద నుంచి కూడా భారీగా వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది. కాగా..సదరు మంత్రి అవినీతిపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పటికే ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. ఇటీవలే సదరు మంత్రికి దాదాపు రెండు కోట్లు ముట్టినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. మా మంత్రి అప్పుడే ఖాతా తెరిచారు..ఆయనకు సొమ్ములకు కొదవలేకపోయినా..ఏదో ఖర్చులకు వస్తాయిలే..అంటూ సదరు శాఖ పేషీ అధికారి చెబుతున్నారట. మొత్తం మీద..అవినీతి మరకలు అంటిన వారిని రక్షించడానికి మంత్రులే రంగంలోకి దిగడం విశేషంగా చెబుతున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని చెబుతోన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీరిని ఏమైనా మందలిస్తారో..లేదో చూడాలి.