అదానీ లంచాల్లో...అధికారుల వాటా ఎంత...!?
వివాదాస్పద వ్యాపారవేత్త అదానీ లంచాల బాగోతం బయటకు వచ్చింది. బిజెపి ఏలుబడిలో ఇతగాడు ఎలా ఎదిగాడనే దానిపై సాక్ష్యాధారాలతో నిరూపితమవుతోంది. ముఖ్యంగా రెవిన్యుబుల్ ఎనర్జీ విషయంలో ఇతగాడి కంపెనీలు ఎలా ఎదిగాయి..రాత్రికి రాత్రి లక్షల కోట్ల కంపెనీలుగా ఎదిగిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా చర్చజరుగుతోంది. అప్పట్లో..అదానిపై షార్ట్‌షెల్లింగ్ సంస్థ హిడెన్‌బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసినా, తనకు ఉన్న పలుకుబడితో ఇతగాడు తప్పించుకున్నారు. అయితే..తాజాగా ఇతగాడి వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాధినేతలకు, అధికారులకు ఇచ్చి లంచాల బాగోతంపై అమెరికాలో కేసు నమోదైంది. దేశంలో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ గ్రూపు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సెకీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా దేశంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు, అధికారులకు దాదాపు రూ.2029కోట్లు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే..దీనిలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతలకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
జగన్ ఖాతాలో మరో అధికారి బలి...!
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా అప్పట్లో అధికారంలో ఉన్న జగన్‌కు ఆయన అధికారులకు దాదాపు రూ.1750కోట్లు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2021లో జగన్, అదానీ ఇద్దరూ వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఈ బేరం జరిగిందని, దీని తరువాతే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టులో కేసు నమోదు అయింది. దాదాపు 228 మిలియన్ డాలర్ల మేరకు ఆంధ్రాలో లంచాలు పంచినట్లు తెలుస్తోంది. నాడు విద్యుత్ ఒప్పందాలు జరిగిన సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి నాగులపల్లి శ్రీకాంత్ విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. నాడు విద్యుత్ ఒప్పందాలపై ఆయన సంతకం చేశారో..లేదో తెలియదు. అయితే ప్రభుత్వ పెద్దలకు భారీగా లంచాలు వెళ్లాయని ఇప్పుడు అమెరికా కోర్టు ఆరోపిస్తోంది. వాస్తవానికి నాగులపల్లి శ్రీకాంత్‌కు నిజాయితీపరుడనే పేరుంది. అయితే..ఆ విద్యుత్ ఒప్పందాల తరువాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మరి అప్పట్లో జరిగిన ఈ లంచాల తతంగాలను భరించలేకే ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారా..లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే తెలియదు. అయితే..అప్పట్లో ఈ విద్యుత్ ఒప్పందాలపై ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ, సిపిఐ పార్టీలు తీవ్ర ఆరోపణలు చేశాయి. అదానీ వద్ద లంచాలు తీసుకునే ఈ ఒప్పందాలు చేసుకున్నారని అవి ఆరోపించాయి. అయితే..అప్పట్లో వీరి ఆరోపణలకు విలువలేకుండా పోయింది. కేంద్రంలోని బిజెపి పెద్దల అండతో అదానీ, జగన్‌లు ఇష్టారాజ్యంగా ఒప్పందాలు చేసుకుని ప్రజల సొమ్ములకు తూట్లు పొడిచారు. మొత్తం మీద..జగన్ పాపాల వల్ల మరో అధికారి బలికాక తప్పదు.