వణికిపోతోన్న... అమాత్యుడు...!?
కూటమి ప్రభుత్వంలో ఓ అమాత్యుడు తన శాఖలకు చెందిన నిర్ణయాలు తీసుకోవడానికి వణికిపోతున్నారట. ఏ నిర్ణయం తీసుకుంటే..ఏమవుతుందో..? ఎలాంటి ఉపద్రవం తనమీదకు వస్తుందోనన్న భయం ఆయనలో ఉందట. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారట. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తోన్న ఈయన సీనియర్ నాయకుడు. రాజకీయచైతన్యానికి మారుపేరైన జిల్లా నుంచే ఆయన రాజకీయాలు ప్రారంభించారు. పైగా ఆయనకు రాజకీయ కుటుంబనేపథ్యం కూడా ఉంది. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి ఆయన చురుగ్గానే పనిచేస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో పాటు, తనంతట తానే స్వంతంగా నిర్ణయాలు తీసుకుని పనిచేస్తున్నారు. అయితే ఆయన ఓ వివాదంలో చిక్కుకోవడంతో ఇప్పుడు అంతా తలకిందులైంది. ఆయన వల్ల ఏర్పడిన వివాదంతో ఆయన మంత్రి పదవి పోతుందేమోనన్నరీతిలో ప్రచారం సాగింది. వాస్తవానికి ఆయనను తీసేయాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఆయన స్థానంలో ఆయన సామాజికవర్గానికి చెందిన నేతను క్యాబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు. అయితే..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఆయనను తొలగించేందుకు ఒప్పుకోలేదట. ఆరు నెలలకే మంత్రి పదవి నుంచి తీసేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భావనతో..ఆయనను తొలగించకుండా తీవ్రంగా మందలించారట. దీంతో.. అప్పటి నుంచి ఆ మంత్రి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వణికిపోతున్నారట.
తన శాఖకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఆయన తీసుకోకుండా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తోన్న మంత్రికి దానిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారట. తన శాఖకు సంబంధించిన ప్రతి అంశాన్ని నోట్ ద్వారా కీలక మంత్రికి చేరవేస్తున్నారట. ఆ కీలక మంత్రి నిర్ణయం తీసుకునేవరకూ..అది పెండింగ్‌లోనే ఉంటోందనే ప్రచారం సాగుతోంది. తనపై వచ్చిన వివాదంతో పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డ సదరు మంత్రి తనకు మంత్రి పదవి ఉంటే చాలనే విధంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే..ఇదంతా ముందే ఉండాల్సింది. ముందుగా జాగ్రత్త పడితే..ఈ విధంగా జరిగేది కాదుకదా..అని టిడిపి నాయకులు అంతరంగిక సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు మంచి పోస్టులు ఇచ్చారని, తగినంత స్వేచ్ఛ కూడా ఇచ్చారని, కానీ సదరు మంత్రి దాన్ని దుర్వినియోగం చేశారు. తన పేషీలో అవినీతిపరులను నియమించుకోవడంతో పాటు, వైకాపా అభిమానులను పిఆర్వోగా నియమించుకోవడం..అదీ చంద్రబాబును ఆయన తనయుడిని దూషించిన వారిని..వెనుకేసుకురావడం..ఆయన ప్రస్తుత పరిస్థితికి కారణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద..మంత్రి ఆత్మరక్షణతో శాఖలో జరగాల్సిన పనులు ఆగిపోతున్నాయని, దీంతో..ఆయా శాఖల పరిధిలోకి ఉన్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.